లోకేష్ పోస్టుతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఖుషీఖుషీ
posted on Jul 23, 2025 1:14PM
.webp)
ఏపీ రాజకీయాల్లో జనసేన, టీడీపీల పొత్తు ఖాయమైనప్పటి నుంచి జనసేనాని పవన్‌ని అన్నయ్య అని సంభోదిస్తూ, అదే స్థాయిలో గౌరవిస్తున్నారు నారా లోకేష్. తాజాగా పవర్ స్టార్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' సినిమా గురువారం (జులై 24) విడుదల కానున్న సందర్భంగా ఏపీ విద్య, ఐ.టి. శాఖల మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా తన శుభాకాంక్షలు తెలియజేస్తూ.. 'వినాలి... వీర మల్లు చెప్పింది వినాలి' అనే పాటకు సంబంధించిన 'హరిహర వీరమల్లు' పోస్టర్ ను షేర్ చేశారు. దానితో పాటే 'మా పవనన్న సినిమా హరిహర వీరమల్లు విడుదల సందర్భంగా సినిమా నిర్మాణంలో పాలు పంచుకున్న బృందానికి అభినందనలు. పవర్ స్టార్ అభిమానుల్లాగే నేనూ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నాను. పవనన్న, ఆయన సినిమాలు, ఆయన స్వాగ్ నాకు చాలా చాలా ఇష్టం. పవర్ స్టార్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ తో 'హరిహర వీరమల్లు' అద్భుత విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని పేర్కొన్నారు. లోకేష్ తాజాగా మరోసారి మా పవనన్న అని పెట్టిన పోస్టులో ఇటు తెలుగుతమ్ముళ్లు, అటు మెగా ఫ్యాన్స్ తెగ హ్యాపీగా ఫీల్ అవుతున్నారంట.