ధన్‌ఖడ్ రాజీనామా.. వీడని మిస్టరీ!
posted on Jul 23, 2025 12:58PM

భారత ఉపరాష్ట్రపతికి నుంచి జగ్ దీప్ ధన్ ఖడ్ రాజీనామా చేయడం దేశంలో హాట్ డిబేట్ కు తెరలేపింది. ఆరోగ్య కారణాలు అని ఆయన చెప్పినప్పటికీ అదంతా వట్టిదే అని చాలా మంది అంటున్న మాట. ఆయన రాజీనామా వెనుక ఏదో బలమైన కారణం లేకుండా ఇలా మాన్సూన్ సెషన్ తొలిరోజే రిజైన్ చేయడం అంటే మాటలు కాదు అనుకుంటున్నారు. దాల్ మే కుచ్ కాలాహై అన్న చర్చ ఢిల్లీలో నడుస్తోంది. అసలు ధన్ ఖడ్ రిజైన్ తో మొదట షాక్ తిన్నది విపక్షాలే. ఎందుకంటే తాము ఓ స్ట్రాటజీతో వస్తే ధన్ ఖడ్ వారికే షాక్ ఇచ్చారు. ఎవరి తీరుతోనైనా హర్ట్ అయ్యారా? ఎవరి మాటలైనా బాధించాయా? పదవికి ఎసరు వస్తుందని గ్రహించారా? ముందే తప్పుకోవడం బెటర్ అనుకున్నారా? తన లైన్ కు పార్టీ లైన్ కు తేడా ఉందనుకున్నారా? కచ్చితమైన రాజకీయ కారణాలు ఏమున్నాయన్న చర్చలతో రకరకాల రీజన్స్ తెరపైకి వస్తున్నాయ్.
హర్ట్ అయితే రాజీనామా చేసే మనస్తత్వం జగ్ దీప్ ధన్ ఖడ్ ది కాదు. ఎందుకంటే ఆయన ఈ పదవిలోకి రాకముందు బెంగాల్ గవర్నర్ గా పని చేశారు. 2019 జులై 30 నుంచి 2022 జులై 18 వరకు బెంగాల్ గవర్నర్‌గా బాధ్యతల్లో ఉన్నారు. ఆయన పనితీరు చూసి ఉపరాష్ట్రపతి అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. వస్తూనే ఉపరాష్ట్రపతిగా, రాజ్యసభ ఛైర్మన్ గా తనదైన ముద్ర వేశారు. వయసు 74 ఏళ్లు అయినా ఉత్సాహంగా ఉండే వారు. రోజూ ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా బిజీ షెడ్యూల్ ఖరారు చేసుకునే వారు. తన అనుభవాలు చెప్పే వారు. ముఖ్యంగా విద్యార్థులను ఉత్సాహపరిచే వారు. అయితే రాజకీయాల్లో ఏదీ అనుకున్నట్లుగా జరగదు. అనుకున్నట్లుగా ఉండదు కదా. జగ్ దీప్ విషయంలోనూ ఇదే జరిగింది.
బీఏసీ సమావేశం పెడితే రాజ్యసభ లీడర్ రావాలి. ఆ పదవిలో నడ్డా ఉన్నారు. బీఏసీ పెట్టేది రాజ్యసభ ఛైర్మన్. సీన్ కట్ చేస్తే ఉదయం జరిగిన బీఏసీకి వచ్చారు. రెండో బీఏసీ మీటింగ్ కు నడ్డా, రిజిజు ఇద్దరూ రాలేదు. ముఖ్యమైన పనిలో బిజీగా ఉన్నారని, రాజ్యసభ ఛైర్మన్ కు ముందుగానే తెలియజేశామని నడ్డా చెప్పుకొచ్చారు. ఉపరాష్ట్రపతిని అవమానించారని కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. నిజంగా ఏం తప్పు జరిగిందో చెప్పాలంటున్నారు. జులై 21న బీఏసీ నుండి కేంద్రమంత్రులు నడ్డా, రిజిజు ఉద్దేశపూర్వకంగా గైర్హాజరు కావడానికీ, అలాగే 21న మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4:30 గంటల మధ్య చాలా తీవ్రమైన విషయంలో ఏదో జరిగే ఉంటుందని జైరాం రమేశ్ అనుమానం వ్యక్తం చేస్తూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. జగ్ దీప్ తీరుపై సొంత పార్టీ, ప్రభుత్వమే అసంతృప్తిగా ఉందా అన్న చర్చ జరిగింది.
ధన్ ఖఢ్ ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడుతారు. ముక్కుసూటిగా ఉంటారు. చమత్కరిస్తారు. చలాకీగా ఉంటారు. సీనియర్ మోస్ట్ లాయర్ కూడా. ముఖ్యంగా న్యాయవ్యవస్థపై ఆయన చేసిన పదునైన వ్యాఖ్యలకు సంబంధించి, ప్రభుత్వంలోని కొంతమందికి కోపం తెప్పించి ఉండొచ్చు అంటున్నారు. జాతీయ న్యాయ నియామకాల కమిషన్ చట్టాన్ని రద్దు చేసినందుకు సుప్రీంకోర్టు తీరుపైనా దన్ ఖడ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ విషయంపై కాంగ్రెస్ తీవ్రంగా రియాక్టైంది. ఉపరాష్ట్రపతి రాజీనామా వెనుక కారణాలు ఆయన చెప్పిన ఆరోగ్య సమస్యల కంటే చాలా లోతైనవి అని వ్యాఖ్యానించింది. ఆరోగ్య కారణాలను గౌరవించాలి. కానీ ఆయన రాజీనామాకు చాలా లోతైన కారణాలు ఉన్నాయన్నది కూడా వాస్తవం అని విపక్షాలు అంటున్నాయి. అంతే కాదు ధన్ ఖడ్ తన మనసు మార్చుకునేలా ఒప్పించాలని కాంగ్రెస్ నేతలు ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు కూడా. ధన్ ఖడ్ తీసుకున్న ఈ అసాధారణ నిర్ణయం వెనుక కారణాలను మోడీ, అమిత్ షా మాత్రమే వివరించగలరని సీపీఐ అన్నది. కచ్చితంగా చెప్పాలంటే ఆయన ఆరోగ్య కారణాల వల్ల రాజీనామా చేయలేదని, సభను నడపడంలో ఆయన చాలా ఉత్సాహంగా కనిపించి ఎలా రిజైన్ చేస్తారని క్వశ్చన్ చేస్తున్నారు.
జస్టిస్ వర్మపై ప్రభుత్వం అభిశంసన తీర్మానాన్ని ఉభయ సభలలో ప్రవేశపెట్టాలనుకున్నదని, అయితే ధన్ ఖడ్ ఊహించని విధంగా బీఏసీ సమావేశంలో ప్రతిపక్ష తీర్మానాన్ని ప్రస్తావిస్తూ.. మరుసటి రోజు మధ్యాహ్నం 1 గంటలకు దానిని చర్చకు తీసుకుంటానని ప్రకటించడంతో ఆశ్చర్యపోవడం ఎన్డీఏ వంతైందంటున్నారు. అంతే కాదు.. ధన్ ఖడ్ కొంతకాలంగా పార్టీ పరంగా అబ్జర్వేషన్ లో ఉన్నారన్న చర్చ కూడా తెరపైకి వస్తోంది. ఉపరాష్ట్రపతి హోదాలో ఆయన ప్రవర్తిస్తున్న తీరు తగదన్న హెచ్చరికలు ఇంటర్నల్ గా వచ్చాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ వ్యవహారం ఎందుకని ముందస్తుగానే రిజైన్ చేశారంటున్నారు. సో కారణాలు ఏవైనా ధన్ ఖడ్ రాజీనామా ఒక్కసారిగా దేశ రాజకీయాలను షేక్ చేసింది. ఇప్పుడు ఆ పదవిని జేడీయూకి ఇవ్వడం ద్వారా బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బెనిఫిట్ పొందడమా.. లేదంటే వేరే నాయకుడికి పగ్గాలు అప్పగించడమా ఏం జరుగుతుందన్నది చూడాలి.