కాంగ్రెస్ గూటికి పొంగులేటి, జూపల్లి?! ముహూర్తం ఖరారు?
posted on Apr 21, 2023 11:04AM
బీఆర్‌ఎస్ బహిష్కృత నేతలు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ గూటికి చేరడం దాదాపు ఖరారయ్యింది. మే నెల మొదటి వారంలో ఇంకా క్లియర్ గా చెప్పాలంటే వచ్చే నెల 4 లేదా 5న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సమక్షంలో వీరు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. వచ్చే 4 లేదా 5న హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో టీ పీసీసీ ఆధ్వర్యంలో నిరుద్యోగ నిరసన గర్జన జరగనుంది.
ఈ నిరుద్యోగ నిరసన గర్జన సభకు ప్రియాంకగాంధీ హాజరుకానున్నారు. ఆ సభలోనే మాజీ ఎంపీ పొంగులేటి, మాజీ మంత్రి, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ కండువాకప్పుకోనున్నారు. ఈ ఇరువురితో పాటు వారి న అనుచరులు కూడా పెద్ద సంఖ్యలో పార్టీలో చేర్చుకునేందుకు అధిష్టానమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహాకర్త సునీల్ కనుగోలు రాష్ట్రంలో పార్టీ బలోపేతం కావాలంటే ఇతర పార్టీలోని అసంతృప్తులను, బలమైన నాయకులు చేర్చుకోవాలని చేసిన సూచన మేరకు టీ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరువ తీసుకుని మాజీ ఎంపీ పొంగులేటి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులతో చర్చించారనీ, ఆ చర్చల ఫలితమే వీరి చేరికకు రంగం సిద్ధం అయ్యిందనీ కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
కాగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ లో చేరడాన్ని అదే జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఆమె ఖమ్మం లోక్‌సభ నియోజక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. ఇప్పుడు శ్రీనివాస్‌రెడ్డి పార్టీలో చేరితే.. ఖమ్మం పార్లమెంట్ సీటు విషయంలో ఇబ్బందులు వస్తాయని ఆమె వ్యతిరేకిస్తున్నారని అంటున్నారు. అయితే ఈ విషయంలో రేవంత్ రెడ్డి సహా పలువురు సీనియర్ నేతలు ఆమె నివాసానికి వెళ్లి ఆమెను ఒప్పించారని చెబుతున్నారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చేరిక విషయంలో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన నాయకుల నుంచి పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం కాలేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.