కర్నాటక ఎన్నికల సమరంలో యాచకుడు.. ఇండిపెండెంట్ గా పోటీ
posted on Apr 21, 2023 11:20AM
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేయాలంటే వందలు వేలు లక్షలు కాదు కోట్లలో డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలే కాదు, చివరకు పంచాయతీ వార్డు మెంబరుగా పోటీచేసినా అభ్యర్ధులు లక్షల్లో ఖర్చుచేస్తున్న సంఘటనలు ఉన్నాయి. అంత ఖర్చు చేసినా చివరకు ప్రజలు ఎవరికి పట్టం కడతారో, ఎవరిని ఇంటికి పంపుతారో తెలియదు.
ఎన్నికలో పోటీ చేయాలంటే చదువు అవసరం లేదు కానీ, డబ్బుల మూటలు మాత్రం మేండటరీగా మారిపోయిన రోజులివి. అటువంటిది కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో యాదగిరి నియోజక వర్గం నుంచి బిచ్చమెత్తుకుని బతికే యంకప్ప అనే యాచకుడు బరిలోకి దిగారు. యాదగిరి పట్టణంలో బిచ్చమెత్తుకుని బతుకుతున్న ఆయనకు ఇల్లూ వాకిలీ లేవు. పొద్దంతా ఇక్కడా అక్కడా బిచ్చమెత్తుకుని కడుపు నింపుకునే, యంకప్ప రాత్రికి ఏ గుడిలోనో తలదాచుంటారు. అయితే ఆయనకు ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందో ఏమో కానీ, పోటీ చేయాలనే నిర్ణయానికి అయితే వచ్చారు. అంతే ఎన్నికల తేదీ ప్రకటించినప్పటి నుంచి డిపాజిట్‌కు కావాల్సిన డబ్బు కోసం నియోజకవర్గంలో ఇంటింటికీ వెళ్లి, బిచ్చమెత్తి డిపాజిట్ చెల్లించేందుకు అవసరమైన రూ.10వేలు సేకరించారు. ఆలా బిచ్చమెత్తి తెచ్చిన రూ.10వేల చిల్లర నాణేలనే డిపాజిట్ గా చెల్లించారు. ఆ నాణేలను లెక్కించేందుకు అధికారులకు రెండు గంటలకు పైగానే సమయం పట్టింది.
కాగా యంకప్ప డిపాజిట్ సొమ్ములు సేకరించడంలోనే పనిలో పనిగా ప్రచారం కూడా కానిచ్చేశారు.. ఈ ఎన్నికల్లో తాను ఎందుకు పోటీ చేస్తున్నది ప్రజలకు చెప్పి మరీ, డిపాజిట్ మొత్తం సేకరించారు. ఈ విషయం ఆయనే స్వయంగా మీడియాకు చెప్పారు. ఎన్నికలలో పోటీ కోసం కోసం అవసరమైన డిపాజిట్ డబ్బుల కోసం యాచిస్తున్నానని ఆయన ప్రజలకు చెప్పి మరీ అడుక్కున్నాడు.
ఆయన నామినేషన్’ ఆమోదం పొంది, పోటీలో నిలిచి గెలిస్తే యంకప్ప చరిత్ర సృష్టించినట్లు అవుతుంది. యంకప్పే కాదు, యాదగిరి నియోజక వర్గం, నియోజక వరం ప్రజలు కూడా చరిత్ర పుటల్లో నిలిచి పోతారు.అయితే, గతంలోనూ కొందరు పేదలు పోటీ చేసిన సందర్భాలు లేక పోలేదు. అయితే, సక్సెస్ అయిన సందర్భాలు మాత్రం అతి స్వల్పం. ఇంతకీ కొసమెరుపేమిటంటే.. దిగ్గజాల మధ్య యంకప్ప ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడుతున్నారు.