సమస్యలు లేని దీపావళి కోసం!

  


లక్ష్మీదేవిని పూజించుకునేందుకో, రాముడు అయోధ్యలో అడుగుపెట్టిన వేళని గుర్తు చేసుకునేందుకో, సత్యభామ చేతిలో నరకాసురుడు చనిపోయాడని సంబరాన్ని చేసుకునేందుకో- కారణం ఏదైతేనేం... దీపావళిని ధూంధాంగా చేసుకుంటున్నాం. కాకపోతే రోజురోజుకీ దీపావళి తీరే మారిపోతోంది. విపరీతమైన వెలుగూ, వేడీ, శబ్దాలను వెలువరించే టపాసులతో ఈ రాత్రి మోతెక్కిపోతోంది. ఇది పర్యావరణానికి కూడా కాస్త హాని కలిగిస్తోందంటున్నారు నిపుణులు...

 

గ్లోబర్‌ వార్మింగ్

వాతావరణంలోకి కార్బన్‌ డై ఆక్సైడ్ వంటి వాయువులు మోతాదుకి మించి చేరడం వల్ల భూతాపం పెరుగుతుందన్న విషయం తెలిసిందే! అయితే ఈ వాయువులు కేవలం పరిశ్రమల నుంచీ, వాహనాల నుంచీ మాత్రమే కాదు.... టపాసుల నుంచీ, కార్చిచ్చుల నుంచి కూడా వెలువడతాయన్న విషయం చాలామందికి తెలియదు. అలా కేవలం ఒక్క దీపావళి రోజునే టన్నుల కొద్దీ కార్బన్ డై ఆక్సైడ్‌ విడుదల అవుతుందట! ఇక టపాసుల నుంచి వెలువడే సల్ఫర్‌, నైట్రేట్‌ వంటి వాయువులు ఆక్సిజన్‌తో కలిసి నీటి మేఘాలను సైతం విషతుల్యం చేస్తున్నాయని తేలింది.

 

చెత్తాచెదారం

దీపావళి ముగిసిన తరువాత వేలకొద్దీ టన్నుల చెత్త మిగిలిపోతుంటుంది. ఒక్క దిల్లీలోనే నాలుగువేల మెట్రిక్ టన్నుల టపాసుల చెత్త పేరుకుపోతుందని చెబుతున్నారు. రోజువారీ చెత్తలాగానే దీనిని కూడా డంపింగ్‌ యార్డులనో, సముద్రంలోనో కలిపేస్తూ ఉంటారు. కానీ ఈ కాగితాలకు అంటుకున్న రసాయనాలు నేలలోకి చేరినప్పుడు ఇటు భూసారాన్నీ, ఆటు భూగర్భజలాలనూ ప్రభావితం చేయక తప్పదు.
ప్లాస్టర్‌ ఆఫ్‌ పేరిస్‌
ఒకప్పుడు దీపావళి కోసమని కొనుక్కొనే ప్రమిదలు, బొమ్మలని మట్టితో తయారుచేసేవారు. కానీ ఇప్పుడు మట్టి బదులుగా చవకగా తేలికగా తయారైపోయే ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ వస్తువులే కనిపిస్తున్నాయి. ఇవి నీటిలో కానీ, నేలలో కానీ ఓ పట్టాన కరగవు సరికదా... వీటికి అద్దే రంగులలో లెడ్‌, క్రోమియం వంటి విషకారకాలు భూమిని విషతుల్యం చేసిపారేస్తున్నాయి.

 

బాలకార్మికులు

ప్రపంచవ్యాప్తంగా పిల్లలకి సంతోషం కలిగించే విషయాలు రెండు. ఒకటి చాక్లెట్లు, రెండు టపాసులు. విషాదం ఏమిటంటే ఈ రెండు పరిశ్రమల్లోనూ వెట్టిచాకిరీ చేసేది కూడా పిల్లలే. ఆఫ్రికాలో పిల్లలు కోకో పరిశ్రమలో నలిగిపోతుంటే, శివకాశి వంటి ప్రాంతాల్లో టపాసుల పరిశ్రమలో పిల్లలే పావులుగా ఉన్నారు. ప్రభుత్వ చర్యలకు భయపడి పెద్ద పెద్ద సంస్థలు పిల్లలతో పనిచేయించేందుకు వెనుకంజ వేస్తున్నా... శివకాశిలోని కుటీరపరిశ్రమల్లో వేలమంది పిల్లల జీవితాలు కడతేరిపోతున్నాయని స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నాయి. నిరంతరం ఈ హానికారక రసాయనాల మధ్య పనిచేయడం వల్ల వారు ఆస్తమా, క్షయ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు లోనవుతున్నారట.

 

కాలుష్యాలు

దీపావళి నాడు కాల్చే టపాసుల నుంచి స్ట్రోటియం, మెగ్నీషియం, బేరియం వంటి హానికారక పదార్థాలు రోజుల తరబడి గాలిలో తిష్టవేసుకుని ఉండిపోతున్నాయి. ఇవి మన శరీరంలోకి చేరి రకరకాల ఆరోగ్య సమస్యలకు కారణం అవుతున్నాయి. దీపావళి రోజున టపాసుల వెలుతురుతో కాంతి కాలుష్యం ఏర్పడి పక్షులు, రాత్రివేళ సంచరించే జీవులు మృత్యుబారిన పడుతున్నాయి. ఇక టపాసుల నుంచి డెసిబల్స్ కొద్దీ వెలువడే శబ్ద కాలుష్యంతో ప్రతి జీవికీ నష్టమే!

 

అలాగని మన సంప్రదాయంలో ముఖ్యమైన దీపావళిని జరుపుకోవద్దని చెప్పే సాహసం ఎవ్వరూ చేయలేరు. మారిపోయిన పరిస్థితులను బట్టి దీపావళి టపాసుల గురించి కంగారుపడుతున్నామే కానీ, ఈ పండుగ వెనుక ఉన్న వైజ్ఞానిక కారణాలను ఎవ్వరూ కాదనలేరు. కాబట్టి ఆచితూచి మనకీ, ఇతరులకీ ఇబ్బంది కలగని విధంగా ఈ పండుగ జరుపుకోవడం అందరికీ శ్రేయస్కరం.

 

- నిర్జర.