పరులకు ఉపకారం చెయ్యడం ఎందుకంత గొప్ప??

జీవితాలు ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటాయి. అన్నీ సానుకూలంగా అమరిన భద్రమైన జీవితాలు చాలామందికి అసాధ్యం. అలాంటి వారి సమస్యల్లో 1ఏ ఒక్కటైనా మనం తీర్చే ప్రయత్నం చేసినప్పుడే మనకు అసలైన ఆత్మసంతృప్తి లభిస్తుంది. కళాశాలలో చదువుకునే రోజుల్లో, తన తోటి విద్యార్థులకు ఫీజు డబ్బులు లేనప్పుడు స్వామి వివేకానంద తనే ముందుండి ఆ సమస్యను తీర్చేవారు. ఎదుటి వారి ఏ చిన్న కష్టాన్నైనా తనదిగానే భావించి తపించిపోయేవారు. మరొకరి కాలికి ముల్లు గుచ్చుకుంటే, తన కంటిలో గుచ్చుకున్నంత విలవిల్లాడిపోయేవారు. అందుకే ఆయన మహానుభావులయ్యారు. ఇప్పటికీ కొంతమంది యువతీ యువకులు తమ జీతంలో కొంత మిగుల్చుకొని, అనాథలకు, అభాగ్యులకు సహాయపడుతూ ఉంటారు. తమ సరదాలను కొన్నింటిని త్యాగం చేసుకొని, అవసరమైన చిన్నారులకు, ఆర్తులకు పంచుతూ ఉంటారు. వారు నిజంగా అభినందనీయులు, ధన్యులు! ఇలాంటి పునాదిరాళ్ళయిన యువతరంపైనే నవసమాజం నిర్మాణమవుతుంది. ఆధారం లేక అలమటించే వారికి ఏ కొంత చేయూతనిచ్చి, వారి ముఖాన చిరునవ్వులు చిందింపజేసినా అది మంచి మనస్సులకు చిరాయువు నిస్తుంది. అందుకే రాల్ఫ్ వాడో ఎమర్సన్ Make yourself necessary to somebody' అంటారు.


మనకున్నదాన్ని ఒకరితో పంచుకోవడానికి, మనస్సు ముందు కాస్త గింజుకుంటుంది. అయినా ఇవ్వడంలోని ఆనందాన్ని మనస్సుకు అలవాటు చేయాలి. ఆనక అది పొందే ఉల్లాసాన్ని అనుభూతి చెందమనాలి.  


 ఊపిరున్నప్పుడే ఇచ్ఛగా నీవు ఇవ్వగలిగినంతా ఇచ్చేయ్. ఇవ్వలేనని పిడికిట్లో దాచుకొని కూర్చుంటే, మృత్యువు బలవంతంగా నీ మణికట్టు పట్టుకొని పిడికిలి విడిపించి మరీ ఇప్పించేస్తుంది అంటోంది దివ్య ఖురాన్, ఇలా బాధగా ఇవ్వడం కన్నా ఇష్టంతో ముందే నలుగురికి పంచి ఇవ్వడంలో ఎంతో ఆనందం దాగి ఉంటుంది. ఒకరి నుంచి మనం ఏదైనా స్వీకరిస్తున్నప్పటి కన్నా, ఒకరికి మనం ఇస్తున్నప్పుడే ఎక్కువ ఆత్మవిశ్వాసం, ఆనందం కలుగుతాయని.. ఆధునిక మానసిక శాస్త్రవేత్తలు కూడా తమ పరిశోధనలో స్పష్టం చేశారు. అదేవిధంగా ఒకరికి ఇవ్వకుండా, తామొక్కరే దాచుకొని తినే అలవాటు భవిష్యత్తులో ఒక రకమైన మానసిక వ్యాధికి కూడా దారితీస్తుందని వైద్యులు తమ పరిశీలనలో తేల్చారు.


మన మనుగడలో విలువైన, చెప్పుకోదగ్గ సందర్భాలు, గుర్తుచేసుకొని గర్వపడే సంఘటనలు ఏవైనా ఉన్నాయంటే, అవి కేవలం ఇతరులకు మనం సహాయపడ్డ క్షణాలే! భగవంతుడు కూడా పరిగణనలోకి తీసుకునేది ఆ మంచి పనుల్నే! అయితే మితిమీరుతున్న మన ఆశలు దేనినీ వదులుకోనీయడం లేదు. కాస్త కూర మిగిలినా ఫ్రిజ్లో పెట్టుకొని రేపు తిందామనీ, పాతబట్టలుంటే స్టీల్ సామగ్రికి మార్చుకుందామనేంత కక్కుర్తికి దారితీస్తున్నాయి. ఇలాంటి ధోరణి మనల్నే కాదు, ఇంట్లో మనల్ని గమనిస్తున్న చిన్నారులను కూడా సంకుచిత స్వభావులుగా మార్చేస్తుంది. మనకు సరిపడ్డాకనైనా ఇతరులకు ఇద్దామన్న దయాగుణం, పరోపకార తత్త్వం మనకు లేకపోతే మనల్ని చూసి మూగజీవాలు కూడా తలదించుకుంటాయి. మన సనాతన ధర్మం పరోపకారానికి ప్రముఖమైన స్థానాన్ని కల్పిస్తూ... 


పరోపకారః కర్తవ్యః ప్రాణై రపి ధనై రపి|

 పరోపకారం పుణ్యం న స్యా త్రతు శతై రపి ॥


 'కష్టపడి సంపాదించిన ధనమిచ్చి అయినా, చివరకు ప్రాణమిచ్చి అయినా పరోపకారం చేయాలి. నూరుయజ్ఞాల వల్ల కలిగే పుణ్యం కూడా పరోపకారంతో సమానం కాదు'అని హితవు పలుకుతోంది.


                                      *నిశ్శబ్ద.