భార్యలు భర్తల నుండి ఏం కోరుకుంటారు...బంధం దృఢంగా ఉండటానికి ఏది ముఖ్యం?

విజయవంతమైన,  సంతోషకరమైన వివాహా బంధానికి ప్రేమ మాత్రమే ముఖ్యం  కాదు. బంధంలో  భార్యను సంతోషంగా ఉంచడం కూడా చాలా ముఖ్యం.  ప్రతి భార్యకు తన భర్త నుండి కొన్ని అంచనాలు ఉంటాయి.  అవి నెరవేరితే బంధంలో తగాదాలు తగ్గుతాయి.   బంధం కూడా బలపడుతుంది. అవి నేరవేరకపోతే మాత్రం బంధం బలహీనంగా మారుతుంది. చిన్న ప్రయత్నాలు మానవ సంబంధాలలో దేనినైనా బలోపేతం చేయగలవు.  భార్యాభర్తల సంబంధం విషయానికి వస్తే అది మరింత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. వివాహం అనేది ఒక పవిత్ర బంధం. దీనిలో ప్రేమ, గౌరవం,  అవగాహన అనే పునాదిపై కలిసి జీవితాన్నిగడపాల్సి ఉంటుంది.   ఇది పరస్పర అవగాహనతోనూ, బంధంలో పలు విషయాల పట్ల సహనంతో ఉండటం ద్వారా జరుగుతుంది. స్త్రీలు తమ భర్తల గురించి కొన్ని అంచనాలను కలిగి ఉంటారు. వాటిని నెరవేర్చడం ద్వారా ఏ భర్త అయినా తన భార్యను సంతోషంగా ఉంచగలడు. భార్యలు భర్తల నుంచి ఏమి ఆశిస్తారో తెలుసుకుంటే..

ప్రేమ..

ప్రతి స్త్రీ తన భర్త నుండి ప్రేమ,  ఎమోషనల్ సపోర్ట్ ఆశిస్తుంది. ఉద్యోగం చేసే మహిళ అయినా లేదా గృహిణి అయినా.. ఇద్దరూ తమ జీవిత భాగస్వామి అడుగడుగునా తమకు తోడ్పాటు అందించాలని కోరుకుంటారు. ప్రేమను వ్యక్తపరచడం కూడా వారికి ఆనందాన్ని ఇస్తుంది. ప్రేమను వ్యక్తం చేయడం ద్వారా భార్యాభర్తల బంధం లోతుగా, దృఢంగా మారుతుంది.


శ్రద్ద..

 ఒకరిని ఎంతగా ప్రేమిస్తున్నారో వ్యక్తం చేయడానికి ఉత్తమ మార్గం వారి పట్ల శ్రద్ధ వహించడం.  భార్యకు ఇంటి పనిలో సహాయం చేయడం, ఆమె మానసిక స్థితి సరిగా లేకుంటే ఆమె ముఖంలో చిరునవ్వు తీసుకురావడానికి ప్రయత్నించడం, ఆమె అనారోగ్యంతో లేదా ఇతర పనులలో బాగా బిజీగా ఉన్నట్లయితే ఆమెకు ఇష్టమైన ఆహారాన్ని వండడం లేదా ఆర్డర్ చేయడం,  ఆమెకు తినిపించడం, ఆమె చెప్పేది శ్రద్ధగా వినడం, ఆమె కోసం సమయం కేటాయించడం..  ఇవన్నీ చిన్నవి కానీ శ్రద్ధ చూపిస్తున్నామని చెప్పడానికి ఇవి చాలా మంచి మార్గాలు.

గౌరవం..

ఏదైనా సంబంధానికి పునాది గౌరవం మీద ఆధారపడి ఉంటుంది. భార్యలకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వని భర్తలు ఎందరో ఉన్నారు. వివాహిత సంబంధంలో దీనిని పొందడానికి భార్యలు ఎక్కువగా పోరాడవలసి ఉంటుంది. భార్యలు తమ భర్తలను ప్రేమించడమే కాకుండా వారి అభిప్రాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని, వారి నిర్ణయాలకు మద్దతు ఇవ్వాలని, సమానంగా చూడాలని,  తమ ఆత్మగౌరవాన్ని తమకు ఇష్టమైనవారి దగ్గర   దెబ్బతీయకూడదని భార్యలు కోరుకుంటారు. భర్త ఇవన్నీ చేస్తే భార్యలు తమను ఎంతగా గౌరవిస్తారో గ్రహించగలుగుతారు

కమ్యూనికేషన్..


భార్యాభర్తల మధ్య ఎలాంటి సంకోచం లేకుండా ఓపెన్ కమ్యూనికేషన్ ఉండటం చాలా ముఖ్యం. భార్య తన భర్త తనతో ప్రతిదీ పంచుకోవాలని,  జడ్జ్ చేయకుండా జాగ్రత్తగా వినాలని కోరుకుంటుంది. భార్యాభర్తల బంధంలో  ఒకరికొకరు నిజాయితీగా,  మంచి  నమ్మకంతో  కలిగి ఉండటం చాలా ముఖ్యం. కానీ ఫలానా వ్యక్తి వల్ల భార్య అభద్రతా భావంతో బాధపడుతుంటే, భర్త ఆమెను పట్టించుకోకుండా ఉండటం సరికాదు.  ఈ భావాన్ని తొలగించడానికి భర్త ప్రయత్నించాలి. తద్వారా వారి మధ్య నమ్మకం బలపడుతుంది.

అవగాహన..

భార్యాభర్తల మధ్య సంబంధాలలో పరస్పర అవగాహన చాలా ముఖ్యం. చాలా మంది మహిళలు తమ భర్తలు తమను అర్థం చేసుకోవడం లేదని భార్యలను అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదని మనస్తత్వంతో ఉంటారని ఫిర్యాదు చేస్తారు. కానీ ప్రతి భర్త తన భార్య ఇష్టాలు,  అభిరుచులను తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఇదే వారి బంధానికి శ్రీరామ రక్ష.

                                                            *నిశ్శబ్ద.