హస్తం గూటికి హరీష్..? బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణ!

హరీష్ రావు.. బీఆర్ఎస్ లో అధిష్ఠానం పెద్దగా ఇష్టపడని కీలక నేత. పార్టీలో ఆల్ఈజ్ వెల్ పరిస్థితి ఉన్న సమయాలలో ఆయనకు ఎప్పుడూ పెద్ద ప్రాధాన్యత లభించలేదు. అదే పార్టీ ఇబ్బందుల్లో ఉన్నా, అసంతృప్తి నేతలను బుజ్జగించాలన్నా పార్టీ హైకమాండ్ కు ముందుగా గుర్తుకు వచ్చేది హరీష్ రావే. ఆఘమేఘాల మీద ఆయన మెడలో వీరతాళ్లేసేసి పార్టీని ఇబ్బందుల నుంచి గట్టెక్కించుందుకు తెరమీదకు తీసుకు వస్తుంటుంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలోనూ ఇదే జరిగింది. ఇప్పుడు విపక్షంలో ఉన్నప్పుడు కూడా పార్టీ సమస్యల పరిష్కారం విషయంలో హరీష్ రావుపైనే ఆధారపడుతున్న పరిస్థితి ఉంది. 

బీఆర్ఎస్ 2018 ఎన్నికలలో విజయం సాధించి రెండో సారి అధికారంలోకి వచ్చిన తరువాత కేసీఆర్ ఆయనను కేబినెట్ లోకి తీసుకోకుండా పక్కన పెట్టారు. కేటీఆర్ కు సీఎం పగ్గాలు అప్పగించే విషయంలో హరీష్ రావుతో ట్రబుల్స్ వస్తాయన్న అంచనాతోనే అప్పట్లో హరీష్ రావును పక్కన పెట్టారని కూడా అప్పట్లో గట్టిగా వినిపించింది. కారణాలేమైతేనేం మంత్రివర్గ విస్తరణలో ఆయనకు అవకాశం కల్పించక తప్పలేదు కేసీఆర్ కు. ఇప్పుడు బీఆర్ఎస్ విపక్షంలో ఉన్న సమయంలో కూడా హరీష్ రావు పార్టీకి బలం, బలహీనతగా మారిపోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అధికారంలో లేకపోవడంతో పార్టీలో గతంలోలా కేసీఆర్ మాట చెల్లు బాటు కావడం లేదంటున్నారు. ఇందుకు ఉదాహరణగా పార్టీ శాసనసభాపక్ష నేతగా కేటీఆర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి ఎమ్మెల్యేలు ససేమిరా అనడమేనని చెబుతున్నారు. అప్పట్లో హరీష్ రావును శాసనసభాపక్ష నేతను చేయాలని పలువురు ఎమ్మెల్యేలు గట్టిగా పట్టుబట్టినట్లు పార్టీ వర్గాలే చెప్పాయి. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో, అయిష్టంగానైనా కేసీఆర్ సీఎల్పీ నాయకుడిగా బాధ్యతలు చేపట్టారు. అయినా ఆ హోదాలో ఆయన అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరు కాలేదు అది వేరే సంగతి.

ఇప్పుడు కూడా కేసీఆర్, కేటీఆర్ కంటే హరీష్ రావే కాంగ్రెస్ పై విమర్శల విషయంలో, సవాళ్ల విషయంలో ఒకింత దూకుడు కనబరుస్తున్నారు. అటువంటి హరీష్ రావే తన మద్దతు దారులతో అంటే 20 మందికి పైగా ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ గూటికి చేరితే.. రాష్ట్రంలో ఇక బీఆర్ఎస్ ఉనికి మాత్రంగానైనా మిగులుతుందా? అయినా అసలు హరీష్ రావు ఏమిటి? కాంగ్రెస్ గూటికి చేరడమేమిటి? అనుకుంటున్నారా? 

ఇటీవలి కాలంలో మంత్రులు కోమటరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఒకటి రెండు సందర్భాలలో పాతిక మంది వరకూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు. ఏ క్షణంలోనైనా వారు కాంగ్రెస్ గూటికి చేరవచ్చు అని చెప్పిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా బీజేపీ శాసనసభాపతి ఏలేటి మహేశ్వరరెడ్డి కూడా అదే ఆరోపణ  చేశారు. ఎన్నికల తరువాత హరీష్ రావు 20 నుంచి 22 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని ఆరోపించారు. మెదక్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ తో భేటీ వెనుక ఉన్నది హరీష్ రావేనని ఆరోపించారు.  మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు తమతో టచ్ లో ఉన్నారంటూ చెప్పిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్యా, తాజాగా బీజేపీఎల్పీ నాయకుడు ఏలేటి మహేశ్వరరెడ్డి హరీష్ మద్దతు దారులతో కలిసి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోవడానికి రెడీగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్యా దగ్గరదగ్గరగా ఉండటం గమనార్హం.