గుట్టు రట్టైంది.. బీజేపీతో రహస్య బంధం ఎవరిదో తేలిపోయింది!?

గత ఏడాది డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తరువాత బీఆర్ఎస్ లో తీవ్ర నిర్వేదం కనిపిస్తోంది. తమను ఓడించి ప్రజలు తప్పు చేశారు.. అందుకు ఫలితం అనుభవిస్తారు అన్నట్లుగా ఆ పార్టీ అగ్రనాయకత్వం శాపనార్ధాలు పెడుతోంది. ఈ విషయంలో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రెండాకులు ఎక్కువగానే తిన్నట్లు కనిపిస్తున్నారు.

ఏడాది లోగా రేవంత్ ప్రభుత్వం కుప్పకూలిపోతుందని  జోస్యం చెబుతున్నారు. ఇక లోక్ సభ ఎన్నికలు దగ్గరపడిన వేళ ఆ పార్టీ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగారు. బస్సు యాత్రతో రాష్ట్రం అంతా పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. అయితే గతంలోలా కేసీఆర్ ప్రసంగాలలలో వాడి వేడి కనిపించడం లేదు. ఎన్నికల జోస్యం చెబుతూ.. మళ్లీ కింగ్స్ మేమే అంటూ చెప్పుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల పట్ల ప్రజలలో పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు. ముందు పార్టీని వదిలి వెళ్లిపోతున్న వారిని నియంత్రించే ప్రయత్నాలు చేసుకుంటే మంచిదని పరిశీలకులు సలహాలిస్తున్నారు. 

సరిగ్గా ఎన్నికల వేళ కేసీఆర్, కేటీఆర్ రెండు వేర్వేరు సభలలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలో విస్తృత చర్చకు దారి తీశాయి. గతంలో కేటీఆర్ ఒక సందర్భంగా రేవంత్ బీజేపీ గూటికి చేరడం ఖాయమని పేర్కొన్న సంగతి తెలసిందే. అయితే ఇప్పుడు ఆయన మాట మార్చారు. రేవంత్ కాదు తామే బీజేపీ పంచన చేరేందుకు సిద్ధంగా ఉన్నామని అర్ధం వచ్చేలా మాట్లాడారు. ఆదివారం ఆయన వేములవాడ, కరీంనగర్ లలో ప్రసంగించారు. రాష్ట్రంలో 10 నుంచి 12 లోక్ సభ స్థానాలలో బీఆర్ఎస్ విజయం సాధిస్తే.. ఏడాది తిరిగే సరికి మళ్లీ కేసీఆర్ తెలంగాణను శాసిస్తారని కేసీఆర్ చేసిన వ్యాఖ్యులు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో విస్తృత చర్చకు దారి తీశాయి. లోక్ సభ ఎన్నికలలో ఓ పది పన్నెండు స్ధానాలు గెలిస్తే బీఆర్ఎస్, కేసీఆర్ తెలంగాణను ఎలా శాసిస్తారన్న ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. ఈ ప్రశ్నలకు జవాబు కేసీఆర్ చెబుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఎందుకంటే కేసీఆర్ తన ఎన్నికల ప్రచారంలో కేంద్రంలో రాబోయేది హంగ్ ప్రభుత్వమేననీ, మళ్లీ మనమే కింగ్స్ అని పదే పదే చెబుతున్నారు. రెంటినీ కలిపి చూస్తే కేటీఆర్ అన్న కేసీఆర్ తెలంగాణను శాసిస్తారు అన్న మాట వెనుక ఉన్నది బీజేపీతో పొత్తు సంకేతమేనంటున్నారు. లోక్ సభ ఎన్నికలలో పది పన్నెండు స్థానాలలో బీఆర్ఎస్ ను గెలిపిస్తే రాష్ట్రంలో అధికారం కోసం కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇస్తామని ఆయన చెప్పకనే చెప్పేసినట్లైందని అంటున్నారు. దీంతోనే బీఆర్ఎస్, బీజేపీ రహస్య బంధాన్ని కేటీఆర్ స్వయంగా బయటపెట్టేశారని అంటున్నారు. కాంగ్రెస్ ఇప్పటికే బీఆర్ఎస్ కు బీజేపీతో రహస్య బంధం ఉందని ఆరోపిస్తోంది.  ఇప్పుడు కేటీఆర్ తన వ్యాఖ్యలతో ఆ విషయాన్ని స్వయంగా అంగీకరించినట్లైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.