లక్ష్యానికి అండర్ లైన్ చేసుకోండి

చాలా మంది యువత తమ లక్ష్యం పట్ల స్పష్టమైన, కచ్చితమైన అభిప్రాయం ఉండదు. ప్రాథమిక పాఠశాలనుంచి యూనివర్సటీ వరకూ అభిప్రాయాలు మార్చుకుంటారు. చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో ఉపాధ్యాయుడు "నువ్వు భవిష్యత్ లో ఏమవుతావు" అని అడిగినప్పుడు మనం ఇచ్చిన సమాధానం ఆరేడేళ్ల తర్వాత హైస్కూల్ కి వచ్చేసరికి మన సమాధానం మారిపోతుంది. హైస్కూల్ నుంచి కాలేజ్ కి వచ్చేసరికి కూడా మన అభిప్రాయం మారిపోతుంది. అయితే ఈ క్రమంలో ఎక్కడో ఒక చోట కచ్చితమైన లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలి. గమ్యాన్ని నిర్ణయించుకుంటే కదా ప్రయాణం సాగించగలం.

పదునైన ఏకాగ్రత మాత్రమే మనలో గొప్ప ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించగలదు. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని అదే ఆలోచనతో, అదే వ్యాపాకంతో ఉండాలి. అది తప్ప వేరే ఇతర వ్యవహారాల జోలికి వెళ్లకుండా కృషి చేస్తే ఎంత అసాధ్యమైన లక్ష్యం అయినా సుసాధ్యం కాగలదు. లక్ష్య సాధనకు సూత్రం ఇదే!

ఒకే సమయంలో పలు రకాల పనులు చెయ్యానుకుంటాము. మన ఆదర్శవంతమైన లక్ష్యం అయినా శ్రద్ధా ఏకాగ్రత లేకుండా గొప్ప పని సాధ్యం కాదు. హర్యానాలో చిన్న మారుమూల గ్రామంలో పుట్టిన కల్పనా చావ్లా రోదసీలో ప్రయాణించిన మొట్టమొదటి భారతీయ యువతి. ఆమె తన చిన్నతనంలోనే ఒక స్థిరమైన గమ్యాన్ని ఏర్పాటు చేసుకుంది. ఆమె జీవిత కథ రాసిన రచయిత " వేసవి రాత్రుల్లో కల్పన వెళ్లికలా పడుకొని ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ ఉండేది. బహుశా రోదసీలో ప్రయాణించాలి అనే కలను అదే కలిగించి ఉండొచ్చు" అంటారు. ఆమె అంతరిక్షావిజ్ఞాన శాస్త్రం (ఏరోనాటికల్ ఇంజనీరింగ్) చదువుకోవాలి అన్నప్పుడు, ఆమె తల్లిదండ్రులు , స్నేహితులు,శ్రేయోభిలాషులు చివరకు కాలేజ్ ప్రిన్సిపాల్ కూడా ఆ శాస్త్రానికి బదులు మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ విభాగాలలో చదువుకోమని సలహా ఇచ్చాడు. కానీ కల్పన మనసు మార్చుకోలేదు. అన్నీ అడ్డంకులను అధిగమించి తన గమ్యాన్ని సాధించింది. తన గమ్యం పట్ల తనకి ఉన్న ఏకాగ్రత భక్తితోనే ఆమె తన జీవితంలో విజయం సాధించడానికి కావలసిన ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది.

◆వెంకటేష్ పువ్వాడ