పిల్లలు బాగా ఎమోషన్ అవుతున్నారా? ఇలా హ్యాండిల్ చేయండి!

పిల్లలు ఎదిగే కొద్దీ తమ చుట్టూ ఉన్న పరిస్థితులకు అణుగుణంగా తామూ కనెక్ట్ అవుతారు. ఈ కారణంగా వారు భావోద్వేగాలకు లోను కావడం జరుగుతుంది.  పిల్లల ముఖంలో సంతోషమైనా, సరదా అయినా అందరూ ఎంజాయ్ చేస్తారు. కానీ వారు బాధపడినా, ఏడ్చినా, కోపాన్ని వ్యక్తం చేసినా, బయటకు చెప్పుకోలేని బాధకు లోనైనా అవి తల్లిదండ్రులు భరించలేరు. మరొక విషయం ఏమిటంటే ఈ భావోద్వేగాలు ఒక పరిధి వరకు ఉంటే పర్వాలేదు. కానీ పరిధికి మించిన భావోద్వేగాలు ఉంటే వాటిని హ్యండిల్ చేయడం తల్లిదండ్రుల కర్తవ్యం.  బాగా ఎమోషన్ అయ్యే పిల్లలను ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకుంటే..


 పిల్లల భావోద్వేగాలను నియంత్రించడానికి ముందు తల్లిదండ్రులు  స్వంతంగా తమ భావోద్వేగాలను  నియంత్రించుకోవాలి. లోతైన శ్వాస తీసుకోవాలి. తమ మీద తాము దృష్టి కేంద్రీకరించుకోవాలి.  సహనం,  అవగాహనతో పరిస్థితిని అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రులు తమ భావోద్వేగాలను అదుపులో ఉంచుకుని  ప్రశాంతంగా ఉన్నప్పుడు పిల్లలే తమ బాధను ఓపెన్ గా చెప్పుకోవడానికి తల్లిదండ్రులే బెస్ట్ అని అర్థం చేసుకుంటారు. తల్లిదండ్రులు బ్యాలెన్స్డ్  గా ఉన్నప్పుడు పిల్లలను కూడా బ్యాలెన్స్ చెయ్యగలుగుతారు.


పిల్లలు భావోద్వేగానికి లోనవుతున్నప్పుడు పిల్లలకు బాధపడద్దని, ఇదేమంత పెద్ద వియం కాదు ఎందుకు బాధపడుతున్నావని  చెప్పకూడదు. ఇలా చెప్తే వారిలో నిరుత్సాహం కలుగుతుంది. నా బాధ నా తల్లిదండ్రులకు అర్థం కావడం లేదు అని వారు ఫీలవుతారు. అలా కాకుండా పిల్లలు బాధపడుతున్నప్పుడు దాని వెనుక విషయాన్ని నెమ్మదిగా అడిగి అది ఎంత వరకు బాధపడాల్సిన సందర్భమో వారికి వివరించి చెప్తే వారి ఎమోషన్ ఎంతవరకు కరెక్టో వారికి అర్థమవుతుంది.


చిన్నపిల్లలకు భావోద్వేగాలను మాటల్లో వ్యక్తం చెయ్యడం రాదు. వారికి తెలిసిందల్లా ఏడవడం, దిగులుగా కూర్చోవడం మాత్రమే. అలా కాకుండా పిల్లలకు భావోద్వేగాలను ఎలా వ్యక్తం చెయ్యలో.. భావోద్వేగాలను వ్యక్తం చెయ్యడానికి ఎలాంటి మాటలు ఉపయోగిస్తారో అవి మెల్లిగా నేర్పించాలి.దీనివల్ల పిల్లల భావోద్వేగం, వారి బాధ ఎంత స్థాయిలో ఉందో అందరికీ అర్థమవుతుంది.  దాన్ని బట్టి తల్లిదండ్రులు పిల్లలను ఊరడించవచ్చు.

పిల్లల భావోద్వేగాలకు గల కారణాలను గుర్తించడం, వాటి పరిష్కార దిశగా ఆలోచించడం, ఎలా పరిష్కరించాలో పిల్లలకే నేర్పించడం తల్లిదండ్రులు చెయ్యాలి. దీనివల్ల పిల్లలు భవిష్యత్తులో వారి సమస్యలను వారే పరిష్కరించుకునే దిశగా ఆత్మవిశ్వాసంతో ఉంటారు.

పిల్లల మనసులో భావోద్వేగాలు ఏమున్నా వాటిని స్వంతంగా ఎలాంటి ఎమోషన్స్ ఉపయోగించకుండా చాలా సాధారణంగా వాటిని వ్యక్తం చేసేలా చూడాలి. అలా చేస్తే పిల్లలు వారి భావోద్వేగాలను కూడా నియంత్రణలో ఉంచుకుంటారు. భావోద్వేగాలను ఎక్కడ బయటపెట్టాలి?  ఎక్కడ బయటపెట్టకూడదు? వంటి విషయాలను పిల్లలు తెలుసుకుంటారు.


                                             *రూపశ్రీ.