ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ అరెస్ట్.. ఈటల మాటల సారాంశం అదేనా?
posted on Jun 19, 2025 3:57PM
.webp)
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అరెస్టు కాబోతున్నారా? కేసీఆర్ కేబినెట్ లో మంత్రిగా పని చేసి ఆ తరువాత ఆయనతో విభేదించి బయటకు వచ్చ బీజేపీ గూటికి చేరిన ఈటల రాజేందర్ మాటల సంకేతమదేనా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేసిన సిట్ ఇప్పుడు బాధితుల నుంచి వాంగ్మూలం తీసుకుంటున్నది. అందులో భాగంగానే ఈటల రాజేందర్ వాంగ్మూలం కూడా తీసుకోనున్నది. ఈ మేరకు ఇప్పటికే ఈటలకు సిట్ సమాచారం ఇచ్చింది.
దీనిపై మీడియాతో మాట్లాడిన ఈటల సంచలన విషయాలు చెప్పారు. దానిని బట్టే ఆయన టార్గెట్ కేసీఆర్ అని అర్ధమౌతున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తాను సిట్ కు వాంగ్మూలం ఇస్తానని మీడియా ముఖంగా చెప్పిన ఈటల.. ఫోన్ ట్యాపింగ్ లో తొలి బాధితుడిని తానేనని అన్నారు. తన ఫోనే కాదు, తన కుటుంబ సభ్యులు, డ్రైవర్, గన్ మెన్, బంధువులు, స్నేహితుల ఫోన్లూ కూడా అప్పట్లో ట్యాప్ చేశారని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని తాను సిట్ ఎదుట చెబుతానని వెల్లడించారు. అన్ని ఆధారాలు, రుజువులతో సహా సిట్ ఎదుటకు వెళ్లి వాంగ్మూలం ఇస్తానన్నారు.
ఫోన్ ట్యాపింగ్ చట్టవిరుద్ధమనీ, ఇందులో ప్రమేయం ఉన్న వారందరికీ శిక్షపడాలని చెప్పారు. కేసు దర్యాప్తు సాగుతున్నకొద్దీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అన్ని వేళ్లూ మాజీ సీఎం కేసీఆర్ వైపే చూపుతున్నాయి. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నది నిర్థారణ అయ్యిందని అంటున్నారు. ఈ కేసులో ఏ1గా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకరరావు తాను ఫోన్ ట్యాపింగ్ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఇప్పటి వరకూ అంగీకరించకపోయినప్పటికీ ఇప్పటి దాకా ఈ కేసులో అరెస్టైన వారు, విచారణకు హాజరైన వారు కూడా ఆయన ఆదేశాల మేరకే పని చేశామని వెల్లడించారు.
ఈ నేపథ్యంలో ఈటల వాంగ్మూలం కీలకంగా మారిందంటున్నారు. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ ఎదుట ఈటల విచారణకు హాజరయ్యారు. కేసీఆర్ కేబినెట్ లో ఆర్థిక మంత్రిగా పని చేసిన ఈటల.. కాళేశ్వరం అవినీతితో తనకు సంబంధం లేదని చేతులు దులిపేసుకోవడమే కాకుండా, ఏమైనా అవకతవకలు జరిగితే కేసీఆర్, హరీష్ లే అందుకు బాధ్యులని సంకేతం ఇచ్చే విధంగా మాట్లాడారు.