ఎవరున్నా పెట్రోలు పరిస్థితి అంతే
posted on May 16, 2015 10:50PM

రాజకీయ నాయకులు ఏవేవో చెబుతుంటారు. వాటిని నమ్మాల్సిన అవసరం లేదు. సదరు రాజకీయ నాయకులు ఏ పార్టీకి చెందినవారైనా నమ్మక్కర్లేదు. మనం ఓటు వేసిన పార్టీకి చెందిన నాయకులు చెప్పిన మాటలను అస్సలు నమ్మాల్సిన అవసరం లేదు.. అది కూడా ఏ విషయంలో అయినా నమ్మవచ్చుగానీ, పెట్రోలు ధరల విషయంలో మాత్రం రాజకీయ పార్టీల మాటలను అస్సలు నమ్మకూడదు. బాధ్యతగల పౌరులుగా ఇది మన కర్తవ్యం. ఎందుకంటే, మనం మరీ అంత అమాయకులం కాదని, మనకీ ఆలోచించే శక్తి వుందని నిరూపించుకోవాలి కదా.
కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో వున్నా, పెట్రోల్ ధరలు పెరిగినప్పుడు ప్రతిపక్ష పార్టీలు నానా హడావిడి చేస్తాయి. ప్రభుత్వ అసమర్థత వల్లే పెట్రోల్ ధరలు పెరిగాయని రాద్ధాంతం చేస్తూ వుంటాయి. మొన్నటి వరకూ బీజేపీ కూడా ఇలాగే రాద్ధాంతం చేసింది. కాంగ్రెస్ పార్టీ కారణంగానే పెట్రోల్, పెట్రోల్ ఉత్పత్తు ధరలు విపరీతంగా పెరిగిపోయాయని బీజేపీ చెప్పేది. అయితే కొంతమంది ఆ మాటలను సహజంగానే నమ్మేవారు. అయితే పెట్రోల్ ధరల విషయంలో ఏ పార్టీ అధికారంలో వున్నా చేయగలిగింది ఏమీ లేదు. విదేశీ మారక ద్రవ్యం ధరల్లో హెచ్చుతగ్గులు వచ్చినప్పుడు, క్రూడ్ ఆయిల్ ధరల్లో హెచ్చు తగ్గు వచ్చినప్పుడు ఏ పార్టీ అధికారంలో వున్నా ఆ మేరకు ధరల్లో మార్పులు చేయాల్సిందే. మొన్నటి వరకూ పెట్రోల్ ధరల పెరుగుదల మీద పోరాటాలు చేసిన బీజేపీ మరి ఇప్పుడు పెట్రోల్ ధరలను ఎందుకు పెంచుతున్నట్లో?
బీజేపీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళలో అడపాదడపా పెట్రోల్ ధరలను తగ్గించింది. మొత్తం పద్నాలుగుసార్లు ధరలను తగ్గించింది. దీన్ని చూసి చాలామంది అహా మోడీ వచ్చేశాడు... పెట్రోల్ ధరల్ని కిందకి దించేస్తున్నాడు అని సంతోషించారు. వారి అమాయకత్వానికి మనం జోహార్లు అర్పిద్దాం. ఇప్పుడు ఆ అమాయకుల ఆనందం కూడా నిలవటం లేదు. ఈమధ్యకాలంలో పెట్రోల్ ధర పది రూపాయల వరకు పెరిగింది. మరోసారి పెరిగిందంటే యుపిఎ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంత ధర వుండేదే అంత ధరకూ చేరుతుంది. ఇలా రెండుసార్లు ధరలు పెంచిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వాలు అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా పెంచామని రికార్డు చేసిన డైలాగ్స్ ప్రజలకు వినిపించడం మామూలే. మరి అలాంటప్పుడు గత ప్రభుత్వాలు పెట్రోల్ ధరలను పెంచినప్పుడు ఎందుకు వ్యతిరేకించారు అని ప్రశ్నించాలని మనకి అనిపించడం సహజం. అయితే అలా ప్రశ్నించినా వినిపించుకునేవారు లేనప్పుడు ప్రశ్నించడం అనేది వృధా. అయినప్పటికీ, ఈ పెట్రోల్ ధరల విషయంలో మనకు అసలు వాస్తవాలు తెలియడం మాత్రం అవసరం.