తెలివంటే ఉద్యోగులదేనండోయ్
posted on May 16, 2015 10:48PM

అబ్బ... తెలివి అంటే ప్రభుత్వోద్యోగులదే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అమాయకపు సాధారణ ప్రజలందరూ ప్రభుత్వోద్యోగులను చూసి తెలివితేటలు నేర్చుకుని తమ జీవితాలను ఉద్ధరించుకోవాలి. ఎలాంటి పరిస్థితులనైనా తమకు అనుకూలంగా ఎలా మలచుకోవచ్చో, ఎడారిలో వదిలిపెట్టినా ఇసక అమ్ముకుని ఎలా బతకవచ్చో గవర్నమెంట్ ఉద్యోగులను చూసి నేర్చుకోవాలి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర విభజన, రెండు ప్రభుత్వాల మధ్య గొడవలు, ప్రజల మధ్య విభేదాల సంగతి అలా వుంచితే, ఈ విభజన కారణంగా బోలెడంత లాభం పొందిన ప్రభుత్వోద్యోగులను మాత్రం అందరం మనస్పూర్తిగా అభినందించాలి. రాష్ట్ర విభజన కారణంగా రాజకీయ నాయకుల తర్వాత లాభం పొందింది ఉద్యోగులే. అలా విభజన జరిగిందో లేదో ఇలా వీళ్ళ జీతాలు పెరిగిపోయాయి. 43 శాతం ఫిట్‌మెంట్ విషయంలో రెండు రాష్ట్రాల ఉద్యోగులు పట్టుబట్టి సాధించుకున్నారు. ఈమధ్యే మేం మాత్రం తక్కువా అంటూ ఆర్టీసీ ఉద్యోగులు కూడా పట్టుబట్టి లాభం పొందారు. ఇక ఏపీ ఉద్యోగుల విషయానికి వస్తే, రాష్ట్రం ఆర్థికంగా అడ్డంగా ఆరిపోయినప్పటికీ తమ జీతాల విషయంలో మాత్రం ఎలాంటి లోటూ లేకుండా హ్యాపీగా వున్నారు. మన రాజధాని విజయవాడకు వెళ్ళిపోదాం రండి మహప్రభో అని ముఖ్యమంత్రి బతిమాలుతున్నా చూద్దాం అన్నట్టుగా చెబుతున్నారంటే వారి హవా ఏ స్థాయిలో నడుస్తోందో చూడొచ్చు.
ఏపీ ఉద్యోగులకు దక్కిన మరో సువర్ణావకాశం... రెండేళ్ళ సర్వీసు పెరగడం. రిటైర్మెంటు వయసును రెండేళ్ళపాటు పెంచుతూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రకటించారు. ఈ ప్రకటన ఏపీ ఉద్యోగులు పండగ చేసుకునేలా చేసింది. ఇది తెలంగాణలోని ఉద్యోగులకు కొంత నిరాశ కలిగించింది. ఈ ఛాన్స్ మాకూ దక్కితే బాగుండు కదా అని అనుకున్నారు. కానీ, ఇక్కడ అలా కుదిరే అవకాశాలు కనిపించడంలేదు. ఇక్కడ అలా చేస్తే నిరుద్యోగులు రెచ్చిపోయే అవకాశం వుంది. అయితే కొందరు తెలంగాణ ఉద్యోగులు మాత్రం ఈ రెండేళ్ళ బెనిఫిట్‌ని పొందాలని ఫిక్సయినట్టున్నారు. అందుకే ఉద్యోగుల విభజన సందర్భంగా తమను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించాలని అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఇది, ఏపీకి వెళ్ళి ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలన్న మంచి ఉద్దేశంతో కాదు. ఏపీకి వెళ్తే తమ సర్వీసు మరో రెండేళ్ళు పెరుగుతుందన్న ముందు చూపుతోనే. ఇంత తెలివిగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు హేట్సాఫ్ చెప్పకుండా వుండగలమా?