లెఫ్టినెంట్ గవర్నర్ ను కించపరిచే పోస్టులు తొలగించండి.. ఆప్ నేతలకు ఢిల్లీ హైకోర్టు ఆదేశం

ఆప్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాల మధ్య విభేదాలు కోర్టు మెట్లెక్కాయి. ఆప్ నేతలపై సక్సేనా పరువు నష్టం దావా వేశారు. ఆ దావాలో కోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు సక్సేనాకు ఊరటనిచ్చాయి. అయితే ఆప్ నేతలు మాత్రం కోర్టు మధ్యంతర ఉత్తర్వుల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యాంగ బద్ధ పదవుల్లో ఉన్న వారి అవినీతిని ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిథులుగా తమపై ఉందని పేర్కొన్నారు. ఏది ఏమైనా కోర్టు తీర్పును గౌరవిస్తామన్నారు. 

తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), ఆ పార్టీ నేతలపై వేసిన పరువు నష్టం దావాలో ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ కు ఊరట కలిగేలా ఇచ్చిన ఆ మధ్యంతర ఉత్తర్వులలో లెఫ్టినెంట్ గవర్నర్ ను కించపరిచే పోస్టులు, వీడియోలు, ట్వీట్లను సామాజిక మాధ్యమం నుంచి తొలగించాలని, అలాగే ఆయనపై ఆరోపణల విషయంలో సంయమనం పాటించాలనీ ఆప్ నేతలను  ఆదేశించింది.

తనను కించపరిచే విధంగా తప్పుడు ఆరోపణలు, సామాజిక మాధ్యమంలో పోస్టులు పెడుతున్నారంటూ లెఫ్టినెంట్ గవర్నర్ ఆప్ నేతలు అతిషి, సౌరభ్ భరద్వాజ్, దుర్గేష్ పాథక్, జాస్మిన్షా లపై పరువునష్టం దావా వేశారు. తనకు కించపరిచేలా ఉన్న, తన పరువుకు నష్టం కలిగించేలా ఉన్న పోస్టులు, వీడియోలు తొలగించాలని వారిని ఆదేశించాలని సక్సేనా ఆ పిటిషన్ లో కోరారు. అలాగే తన పరువుకు నష్టం కలిగించినందుకు ఆప్ నేతలు ఐదుగురూ తనకు రెండు కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని కూడా సక్సేనా ఆ డిఫమేషన్ దావాలో కోరారు.  

అయితే ఆ తీర్పు పట్ల ఆప్ నేతలు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము కోర్టు తీర్పును గౌరవిస్తామంటూనే న్యాయస్థానం ఇచ్చినది మధ్యంతర ఉత్తర్వులేనని పేర్కొన్నారు. చట్టాన్ని అమలు చేయాల్సిన సంస్థలు, వ్యవస్థలు, వ్యక్తులు తీసుకునే నిర్ణయాలపై సమగ్ర అధ్యయనం చేసి వాస్తవాలను ప్రజలకు విరించాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిథులదేనని, ఆ బాధ్యతను తాము ఎన్నడూ విస్మరించజాలమనీ పేర్కొన్నారు.

తాము లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాపై చేసిన ఆరోపణలు ఆ కోవలోనివేనని కోర్టుకు తెలిపినట్లు ఆప్ నేతలు చెప్పారు. తాము చేసిన ఆరోపణలపై  స్వతంత్ర దర్యాప్తు డిమాండ్ చేయాలని, అందుకు భిన్నంగా ఆయన ఏ తప్పూ చేయనప్పుడు దర్యాప్తు నుంచి ఎందుకు పారిపోతున్నారని ప్రశ్నించారు. కాగా ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు వెలువడిన తరువాత లెఫ్టినెంట్ గవర్నర్ ‘సత్యమేవ జయతే’ అంటూ ట్వీట్ చేశారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu