పిల్లల జీవితాన్ని బలి చేసే పీకాక్ పేరేంటింగ్.. చాలా మంది తల్లిదండ్రులు చేసే తప్పు ఇది..!
posted on Sep 15, 2025 11:18AM

ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలు బాగా రాణించాలని కోరుకుంటారు. మంచి మార్కులు సాధించాలి, మంచి ఉద్యోగం సాధించాలి, సమాజంలో పేరు ప్రఖ్యాతులు పొందాలి. ఇందుకోసం బాగా డబ్బు కూడా ఖర్చు పెడతారు. పిల్లలను పెద్ద పెద్ద కార్పోరేట్ పాఠశాలలు, కళాశాలలో చేర్పిస్తారు. ప్రత్యేకంగా ట్యూషన్లు చెప్పిస్తారు, కోచింగ్ లు ఇప్పిస్తారు. ఇవన్నీ పిల్లల ఉన్నతికి మంచివే.. కానీ చాలా సార్లు తల్లిదండ్రుల మితిమీరిన అంచనాలు పిల్లలపై ఒత్తిడిగా మారుతాయి. ఇది పిల్లల మానసిక, భావోద్వేగ పెరుగుదలను ప్రభావితం చేస్తుంది. తరువాత ఇది ఒక సమస్యగా మారుతుంది. ఆందోళనకరమైన విషయం ఏమిటంటే చాలా సార్లు తల్లిదండ్రులు తమ పిల్లలపై ఈ విధంగా అధిక ఒత్తిడి తెస్తున్నామని కూడా వారికి తెలియదు.
చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతరుల ముందు పదే పదే.. సందర్భం కాకపోయినా పొగుడుతూ ఉండటం చూసి ఉంటారు. తమ పిల్లలు గెలిచిన ట్రోఫీలు, పతకాల గురించి చెబుతుంటారు. పిల్లలకు వచ్చిన ర్యాంకులు, మార్కుల గురించి గొప్పగా చెబుతారు. మొదట్లో ఇది మంచిగా అనిపిస్తుంది. తమ తల్లిదండ్రులు తమ గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటారో అని పిల్లలు కూడా చాలా సంతోషిస్తారు. కానీ క్రమంగా అది పిల్లలపై ఒత్తిడిని పెంచుతుంది. తమ చిన్న తప్పు కూడా తమ తల్లిదండ్రుల ఆశల మీద ప్రబావం చూపిస్తుందని అనుకుంటారు. ఈ రోజుల్లో పీకాక్ పేరెంటింగ్ అని చాలా ట్రెండ్ లో ఉంది. ఇది పిల్లల మానసిక, భావోద్వేగ పెరుగుదలకు హాని కలిగించే పద్ధతి. దాని గురించి తెలుసుకుంటే..
పీకాక్ పేరెంటింగ్ అంటే ఏమిటి?
పీకాక్ పేరెంటింగ్ అంటే పిల్లలను తల్లిదండ్రులు తమ గర్వానికి, సమాజంలో పేరు సంపాదించడానికి ఒక మార్గంగా మార్చడం. నెమలి తన రంగురంగుల ఈకలను విప్పి అందరి దృష్టిని ఆకర్షించినట్లే, కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతరుల ముందు తాము గర్వంగా ఉండటం కోసం విజయాల వెంట పరుగులు తీయిస్తారు. మొదట్లో ఇది బానే ఉంటుంది కానీ క్రమంగా ఈ అలవాటు పిల్లలపై ఒత్తిడి పెంచుతుంది. తల్లిదండ్రులు తమ పిల్లల విజయాల గురించి అందరి ముందు చెప్పుకోవడం గొప్పగా అనిపించవచ్చు. కానీ పోటీ ప్రపంచంలో ఎల్లప్పుడూ ఒకరే విజేతగా ఉండరు. ఎప్పుడైనా పిల్లలకు నిరాశ కలిగించే ఫలితాలు ఎదురైనప్పుడు తల్లిదండ్రుల ప్రవర్తన మారిపోతుంది. ఇది పిల్లలను కూడా చాలా ఒత్తిడిలోకి నెట్టేస్తుంది.
పీకాక్ పేరెంటింగ్ పిల్లల ఆలోచనలను ఎలా ప్రభావితం చేస్తుంది?
పీకాక్ పేరెంటింగ్ ప్రభావం ఏమిటంటే, పిల్లలు చప్పట్లు కొట్టినప్పుడు లేదా ప్రశంసించినప్పుడు మాత్రమే తాము మంచివాళ్ళమని, గొప్పవాళ్లమని అనుకుంటారు. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా పిల్లలు లోపల నుండి బలహీనంగా మారతారు. తమను ప్రశంసించనప్పుడు తాము విఫలమయ్యామని భావిస్తారు. దీని కారణంగా పిల్లలు తమ తల్లిదండ్రులు లేదా వ్యక్తులు ఇష్టపడేది చేస్తారు తప్ప తమకు నచ్చినది చేయరు. పీకాక్ పేరెంటింగ్ కారణంగా ఎల్లప్పుడూ గెలవాలి చేయాలనే భయం వారి మనస్సులో ఉంటుంది. ఎప్పుడైతే భయం మనసులో ఉంటుందో అప్పుడు గెలవడం కూడా కష్టమవుతుంది.
దీనిని నివారించడానికి పిల్లల మంచిని, చెడును ప్రేమించడం ముఖ్యం. అలాగే వారు గెలిచినా, ఓడినా వారిని ప్రోత్సహించడం ముఖ్యం. తల్లిదండ్రుల గొప్పకు పిల్లలను ఒక మార్గంగా ఎంచుకోవడం మానేయాలి. పిల్లలు ఎలా ఉన్నా తల్లిదండ్రులు ఎప్పుడూ వారిని ప్రేమిస్తారని, వారి వెంట ఉంటారనే విషయం వారికి అర్థమవ్వాలని. ఇలా ఉన్నప్పుడు పిల్లలు మంచి దారిలోనే వెళ్తారు.
*రూపశ్రీ.