భర్త ఇలా ప్రవర్తిస్తుంటే.. భార్య మీద ప్రేమ లేదని అర్థం..!


భార్యాభర్తల బంధం ఈ సృష్టిలో చాలా అపురూపమైనది.  దాదాపు పాతికేళ్లు వేర్వేరు కుటుంబాలలో పెరిగిన ఇద్దరు వ్యక్తులు పెళ్లి పేరుతో ఒక్కటిగా మారతారు.  ఇద్దరి జీవితం ఒక్కటే అనే అభిప్రాయం తెచ్చుకుంటారు. ఇద్దరూ ఒకరికి  ఒకరు అనేలా బ్రతుకుతారు.  కష్టం అయినా, సంతోషం అయినా, బాధ అయినా కలిసి పంచుకుంటారు.  అయితే భార్యాభర్తల బంధం అందరి విషయంలో ఇలా ఉంటుందని చెప్పలేం.  కొందరి విషయంలో చాలా విభిన్నంగా ఉంటుంది.  భార్యాభర్తలు ఒకరంటే ఒకరికి ఇష్టం లేకుండా ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటారు.  కొన్ని బంధాలలో భర్తకు భార్య మీద ప్రేమ  ఉండదు.  కానీ భార్య మాత్రం కేవలం బంధం కోసం, పిల్లల కోసం భర్తతో కలిసి ఉంటుంది. మరికొందరు భార్యలు అమాయకంగా తన భర్త ఏం చేసినా.. ఇలా చేస్తున్నాడు అని అంటారు కానీ  నిజానికి అతనికి తన మీద ప్రేమ లేదు అనే విషయం తెలుసుకోలేరు.  భర్తకు భార్య మీద ప్రేమ లేకపోతే.. అతని ప్రవర్తన ఎలా ఉంటుందో.. కొన్ని సింపుల్ విషయాల ద్వారా చెప్పేయవచ్చు.  అవేంటో తెలుసుకుంటే..

అబద్దం చెప్పడం..

అబద్దం చెప్పడం కొందరికి వెన్నతో పెట్టిన విద్య.  సందర్భానుసారంగా చాలా ఈజీగా అబద్దాలు చెప్పేస్తుంటారు. ఇలా అబద్దాలు చెప్పే మనస్తత్వం ఉన్నవారిలో మోసం చేసే ప్రవృత్తి ఉంటుంది. భార్య దగ్గర ప్రతి విషయం గురించి చాలా బాగా అబద్దాలు అల్లేస్తారు.  బయటి స్నేహాలు,  డబ్బు,  ఎక్కడి వెళుతున్నారు, ఎవరిని కలుస్తున్నారు.. ఇలా ప్రతి విషయం ఎప్పుడూ స్పష్టంగా నిజం చెప్పరు. దీనికి బదులు అబద్దాలు చెబుతారు. మరికొన్ని సార్లు సాకులు చెబుతారు.   పైగా అతను చెప్పేది అబద్దం అని తెలిసి తిరిగి అతన్ని ప్రశ్నించినప్పుడు కావాలని గొడవ పెట్టుకుని భార్యనే నిందిస్తాడు.  చివరకు భార్యే బాధితురాలిగా మారుతుంది.

అవసరాలు పట్టించుకోకపోవడం..

భార్య అవసరాలను పూర్తీగా పట్టించుకోని భర్తలో నిజమైన ప్రేమ అస్సలు లేదని అర్థం.  భార్య ఏమడిగినా ఏదో ఒక కారణం చెప్పడం, తప్పించుకోవడం, ఆమె అవసరాలు తీర్చకపోవడం,  ఎప్పుడైనా గట్టిగా అడిగినప్పుడు భార్యనే తిరిగి నిందించడం, బార్య నోరు మూయించడానికి గొడవ పెద్ది చేయడం, భార్య పుట్టింటి వాళ్లను ప్రస్తావిస్తూ గొడవ చేయడం.. ఇలా చాలా చేస్తారు.  అతను తన అవసరాలు తీర్చుకోవడానికి, తన తల్లిదండ్రులు,  తోబుట్టువుల కోసం ఏం చేయడానికైనా సిద్దంగా ఉంటాడు. కానీ  భార్య దగ్గరకు వచ్చేసరికి అతనికి ఏం చేయడానికి ఇష్టం ఉండదు. ఆ ఇష్టం లేకపోవడానికి బయటకు చెప్పలేక ఏవో కారణాలు చెబుతూ ఉంటాడు.

ఎగతాళి చేయడం..

భార్య మీద ప్రేమ ఉన్న ఏ మగాడు అయినా సరే.. స్నేహితుల ముందు కావచ్చు, బయటి వ్యక్తుల ముందు కావచ్చు, కుటుంబ సభ్యుల ముందు కావచ్చు.. భార్యను చాలా గౌరవిస్తాడు. కానీ దీనికి వ్యతిరేకంగా భార్య మీద ప్రేమ లేకపోతే.. సింపుల్ గా.. అందరి ముందు అవమానించడం, చిన్నతనం చేసి మాట్లాడటం,  అస్సలు గౌరవించకపోవడం చేస్తారు.  ఇలా ఏ భార్య పట్ల అయినా భర్త ప్రవర్తిస్తే అతనేదో కోపంలో చేశాడు.. అనే పిచ్చి సమర్థింపు ఏ భార్య చేయకూడదు.  అది అతను ప్రేమ లేకపోవడం వల్ల చేసిన పనే అని గుర్తించాలి.

                                  *రూపశ్రీ.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu