పవనిజం.. వ్యూహాత్మక ‘సనాతన’ ప్రయాణం?
posted on Jun 25, 2025 12:50PM

పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీ ఈ పన్నెండేళ్లలో పన్నెండు మలుపులు తిరిగిన మాట నిజం. ఆయన ఇప్పటి వరకూ జత కట్టని వారు లేరు. వారిలో కమ్యూనిస్టులున్నారు. సరిగ్గా అదే సమయంలో మాయావతి వంటి దళిత నేతలున్నారు. ఇక చెగువేరా సంగతి సరే సరి. ఫైనల్ గా ఆయన సేన- బీజేపీ, టీడీపీతో చేస్తోన్న ప్రయాణం గురించి తెలియంది కాదు.
కానీ పవన్ పై ఇప్పుడు చర్చంతా ఏంటంటే ముస్లిం టోపీ ధరించి, గొడ్డు మాంసం తినడం లో తప్పు లేదని.. తన తండ్రి దీపం మంటలో సిగరెట్ వెలిగించుకునేంత నాస్తికుడని చెప్పుకుని, ఆపై బైబిల్ పట్టుకుని తన పెళ్లాం పిల్లలు పూర్తి క్రిష్టియన్లని చెబుతూ.. చివరికి ఆయనిలాంటి నిగూఢమైన వారాహీ దీక్షలు, వాహనాలకు ఆ పేరుబెట్టడంతో పాటు యజ్ఞయాగాల నిర్వహణ, కుంభమేళాలో స్నానాలు.. ఇవన్నీ ఏం చెబుతున్నాయ్? ఆయన హిందువా ముస్లిమా క్రిష్టియనా? లేక కొత్త పేరు ఏదైనా పెట్టాలా? జనాన్నిలా సందిగ్దంలో పడేయటం పవన్ మార్క్ పొలిటికల్ స్ట్రాటజీ.
పవన్ పయనమెటు? ఈయన్ని మనమెలా అర్దం చేసుకోవాలి? అంటే పవన్ పెద్ద స్కెచ్చే వేశారని అంటారు కొందరు ఆధ్యాత్మిక రాజకీయ పండితోత్తములు. వచ్చ రోజుల్లో ఆయన స్టార్ క్యాంపెయినర్ గా దేశమంతా ఒక రకమైన ఫాలోయింగ్ తీసుకురావాలంటే అందుకు తగిన మార్గం కోసం వెతుకుతుండగా వెతకబోయిన తీగ కాలికి తగిలిన చందంగా మారిందట ఈ సనాతనం.
దీని పవర్ కేవలం ఒకటీ రెండు రాష్ట్రాలకు సంబంధించింది కాదు. ఇది దేశ వ్యాప్తంగా కనిపించే కామన్ పాయింట్. గతంలో రజనీకాంత్ ని వాడాలనుకున్నారు మోడీ. ఆయన దగ్గరకు అదే పనిగా పంచకట్టుకుని వెళ్లడం చూసే ఉంటాం. ఆయన కూడా అందుకు తగిన విధంగానే రియాక్ట్ అయ్యారు కూడా. తాను చేస్తే గీస్తే ఆధ్యాత్మిక రాజకీయాలనే చేస్తానన్నారు. కాకుంటే ఈ సూపర్ స్టారుడికి కాలం ధర్మం పెద్దగా కలసి రాలేదు. దీంతో రజనీ ఛాన్స్ మిస్ చేసుకుంది కమలం దండు.
సరిగ్గా ఈ టైంలో.. పవన్ కళ్యాణ్ బీజేపీకి ఇక ఆశాకిరణంగా కనిపించారు. అందుకే పవన్ కళ్యాణ్ ని మోడీ ఎప్పుడైనా ఎక్కడైనా మొదటి ప్రయారిటీ కింద గుర్తిస్తారు. అంతెందుకు ప్రమాణ స్వీకార సమయంలో మోడీ పవన్, చిరంజీవిల చేతులు పైకి లేపి.. ఇచ్చిన సంకేతం ఏమిటి?
అందుకే పవన్ ఈ దిశగా తన అడుగులు వేస్తూ బీజేపీ పాలిట ఒక స్టార్ క్యాంపెయినర్ గా తన పరిధిని పెంచుకుంటూ పోతున్నారు. అందుకే తమిళనాడు బీజేపీ సైతం మురుగన్ పేరిట ఒక ఆధ్యాత్మిక సభను ఏర్పాటు చేసింది. కారణం ఇక్కడ మురుగన్ అన్నదొక ప్రత్యేక మతం. ఈ దేవుడి పేరు చెబితేనే మొత్తం ఊగిపోతారు. తద్వారా పవన్ కళ్యాణ్ కి పెద్ద పీట వేసి.. ఇక్కడి తెలుగు ఓటర్లను విశేషంగా ఆకర్షించి.. ఆపై.. తమిళనాట తన ఓటు బ్యాంకును మరింత మెరుగు పరుచుకోవాలని కమలదళం చూస్తున్నదని పరిశీలకుల విశ్లేషణ.
అది మోడీ ఆదేశాను సారమో మరొకటో తెలీదు కానీ.. ఈ దిశగా పవన్ కి కూటమి ప్రభుత్వంలోనూ భారీ ఎత్తున ప్రయారిటీ దక్కుతోంది. మొన్న కర్ణాటక ఏనుగుల వ్యవహారంలోనూ ఆయన దగ్గరుండి వాటిని తీసుకోవడం.. ఇలా పవన్ ని రాష్ట్రానికి పరిమితం కాకుండా దేశ వ్యాప్తంగా పాపులారిటీని పెంచేందుకు బీజేపీ ఒక పథకం ప్రకారం వెళ్తున్నట్టుగా సమాచారం.
మనమంతా ఏమనుకుంటున్నాం,, ఇదేంటి పవన్ కళ్యాణ్ ఇలా చేస్తున్నారు? ఆయనకు ముస్లిం- క్రిష్టియన్- మైనార్టీ ఓట్లు వద్దా? అని తీసికట్టినట్టు మాట్లాడుకుంటాంగానీ.. ఈ మొత్తం జర్నీలో ఆయన్ని సనాతన ధర్మ వారధిగా భారీ కమల వ్యూహమే రచిస్తోంది బీజేపీ. అందులో భాగంగానే ఇదంతా అంటున్నారు.
ఆయన కూడా వెళ్లిన ప్రతి ప్రాంతాన్నీ.. ఇక్కడే నేను పుట్టా. ఇక్కడే నేను పెరిగా ఇక్కడే నా సినిమాలు ఎక్కువ ఆడేవి అంటూ రకరకాల కామెంట్లు చేస్తూ అక్కడి వారిని ఆకట్టుకునే యత్నం చేస్తుంటారు. ఇదంతా ఒక విస్తృత రాజకీయాల్లో భాగంగానే చూడాలంటారు కొందరు ఎనలిస్టులు.
ఎందుకంటే తాను కేవలం ఒక కాపు నేతగా మాత్రమే కాకుండా.. సర్వజన.. సర్వకుల నేతగా ఎదగడం ఒక అనివార్యంగా కావడంతో.. ఇదిగో ఇదీ పరిస్థితి. పవన్ అలవోకగా చెప్పే డైలాగ్ లోనూ ఒక వ్యూహం ఉంటుందని అంటారు రాజకీయ విశ్లేషకులు. అందులో భాగంగానే ఇదంతా జరుగుతున్నట్టుగా ఒక టాక్ నడుస్తోంది దక్షిణాది రాజకీయవర్గాల్లో. అందుకే ఇతర రాష్ట్రాల వేదికలపై పవన్ కి ఇంత ఎలివేషన్ అంటున్నారు విశ్లేషకులు.