అచ్యుతానందన్.. ఎర్ర జెండా నీడలో వందేళ్ల ప్రస్థానం!

భారత కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఐ) ఆవిర్భావానికి  కొంచెం అటూ ఇటుగా, జన్మించిన కురువృద్ద కమ్యూనిస్ట్ నాయకుడు, కేరళ మాజీ ముఖ్యమంత్రి  వీఎస్ అచ్యుతానందన్  మృతితో  భారత కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రలో ఒక అధ్యాయం ముగిసింది. అవును.. భారత కమ్యూనిస్ట్ పార్టీ నుంచి విడిపోయి,సిపిఎంను ఏర్పాటు చేసిన కమ్యూనిస్ట్ నాయకుల్లో చిట్టచివరి నేత  కామ్రేడ్ అచ్యుతానందన్  అస్తమయంతో సిపిఎం తొలి తరం నేతల్లో చిట్ట చివరి జ్యోతి ఆరిపోయింది. 1923 అక్టోబర్ 20న కేరళలో వెనుకబడిన ఒక నిరుపేద కుటుంబంలో జన్మించిన అచ్యుతానందన్, 101 సంవత్సరాల వయసులో 2025 జూలై 21 న కన్నుమూశారు. 

అచ్యుతానందన్  అంతగా చదవు ‘కొన’ లేదు. పేదరికం కారణంగా ప్రాథమిక స్థాయిలోనే ఆయన చదువుకు స్వస్తి చెప్పారు. బాల్యం లోనే  టైలరింగ్  నేర్చుకుని కొంత కాలం అదే వృత్తిలో కొనసాగారు. ఆ తర్వాత కొబ్బరి పీచు ఫ్యాక్టరీలో చేరి.. తద్వారా కార్మిక ఉద్యమంలో అడుగుపెట్టారు. ఎర్ర జెండా పట్టుకున్నారు. 

అలా.. వామపక్ష ఉద్యమంలో అడుగు పెట్టిన అచ్యుతానందన్ తుది శ్వాస విడిచేవరకూ ఎర్రజెండాను వదలలేదు. 17 సంవత్సరాల నవ యవ్వనంలో, 1940లో కమ్యూనిస్టు పార్టీలో సభ్యుడయ్యారు. ఇక అక్కడి నుంచి ఉద్యమ బాటలో ముందుకు సాగారు. ట్రావెన్‌కోర్ సంస్థానానికి చెందిన భూస్వాములపై పోరాటం చేసి జైలుకు సైతం వెళ్లారు. అయితే.. 1964లో భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) నిట్ట నిలువునా చీలిన సందర్భంలో అచ్యుతానందన్  సీపీఐ జాతీయ కౌన్సిల్‌  సభ్యత్వానికి రాజీనామా చేసి  సీపీఎం ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. తొలి సారిగా, 1967లో కేరళ అసెంబ్లీలో అడుగు పెట్టిన అచ్యుతానందన్  2016 వరకు, ఇంచు మించుగా అర్థ శతాబ్దం పాటు  ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కేరళ చరితలోనే కాదు, బహుసా దేశ చరిత్రలో కూడా ఇంత సుదీర్ఘ కాలం ఎమ్మెల్యే కొనసాగిన   నాయకుడు అచ్యుతనందన్ వినా మరొకరు ఉండి ఉండకపోవచ్చు.

అలాగే  అచ్యుతానందన్  తమ సుదీర్ఘ రాజకీయ జీవితంలో  మూడు సార్లు విపక్షనేతగా.. ఒకసారి ముఖ్యమంత్రిగా పని చేశారు. అన్నిటినీ మించి నిబద్దతగల కమ్యూనిస్ట్  గా  జీవించారు. కమ్యూనిస్ట్  గానే జీవితం చాలించారు.  అందుకే..  రాజకీయలకు అతీతంగా అనేక మంది రాజకీయ రాజకీయేతర ప్రముఖులు  దివంగత నేతకు నివాళులు అర్పించారు. అంతిమ వీడ్కోలు పలికారు. నిజాయితీగా, ప్రజాహితం కోసం పని చేసి.. ఆదర్శ నేతగా ఆచ్యుతానందన్ నిలిచారని కొనియాడారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu