ఉపరాష్ట్రపతి రాజీనామాపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
posted on Jul 22, 2025 2:35PM
.webp)
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాపై ప్రధాని మోదీ స్పందించారు. వివిధ హోదాల్లో దేశానికి సేవ చేసేందుకు ధన్‌ఖడ్‌కు అనేక అవకాశాలు లభించాయని తెలిపారు. ఆయన మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ప్రధాని పేర్కొన్నారు. కాగా, ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం, వైద్యుల సలహాను పాటించడం కోసమే తాను ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నానని ధన్‌ఖడ్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
రాజ్యాంగంలోని 67(ఎ) అధికరణ కింద ఇది తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపారు. ఈ మేరకు ఉపరాష్ట్రపతి కార్యాలయం ఈ లేఖను విడుదల చేసింది. ఉపరాష్ట్రపతి పదవికి జగ్దీప్ ధన్‌ఖడ్ చేసిన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఆమోదించారు. 74 ఏళ్ల ధన్‌ఖడ్ అనారోగ్య సమస్యల దృష్ట్యా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. మరో రెండు సంవత్సరాలు పదవీకాలం ఉండగానే జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేయడం చర్చకు దారితీసింది.
2022లో ఎన్డీయే తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేట్ కావడంతో ఆయన బెంగాల్ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. విపక్ష అభ్యర్థి మార్గరేట్ అల్వాపై విజయం సాధించి ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. 710 ఓట్లకుగాను 528 ఓట్లు గెలుచుకుని 1997 తర్వాత అత్యధిక ఓట్లతో ఉపరాష్ట్రపతిగా విజయం సాధించిన వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు