ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్ట్.. భారత్‌కు లక్ కలిసొచ్చేనా?

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న అయిదు టెస్టుల సిరీస్‌లో ఇండియాని అదృష్టం వెక్కిరిస్తోంది. భారత్ యువ జట్టు ఇంగ్లాండ్ టూర్ లో మంచి ఆటతీరు ప్రదర్శిస్తున్నప్పటికీ లక్ మాత్రం కలిసి రావడం లేదు. కాస్త అదృష్టం తోడైతే భారత్ ఇప్పిటికే  3-0 ఆధిక్యంతో నిలిచి సిరీస్ కైవసం చేసుకునేదని క్రీడా పండితులు అంటున్నారు.  అటు బ్యాట్‌తో, ఇటు బాల్‌తో మంచి ప్రదర్శన చేసిన భారత్ కీలక సమయాల్లో పట్టు నిలబెట్టుకోలేక రెండు మ్యాచ్‌లను చేజార్చుకుని 1-2తో వెనుకబడి ఉంది. లార్డ్స్‌లో చివరి వరకు పోరాడి ఓడిన టీమ్ ఇండియా ఇప్పుడు కీలకమైన నాలుగో టెస్టుకు రెడీ అవుతోంది. ఆతిథ్య జట్టుతో బుధవారం (జులై 23)  మాంఛెస్టర్ లో కీలక  నాలుగో టెస్టులో తలపడనుంది. 

మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాపోర్డ్ మైదానంలో జరగనున్న ఈ మ్యాచ్ భారత్‌కు చాలా కీలకంగా మారింది. ఇందులో ఓడితే టీమ్ ఇండియా సిరీస్ ఆశలు ఆవిరవుతాయి.  ఇలాంటి తరుణంలో భారత జట్టుకు కొత్త టెన్షన్ పట్టుకుంది. అక్కడ ఇంగ్లాండ్‌తో  9 టెస్టుల్లో భారత్ 4 మ్యాచుల్లో ఓడిపోయింది. అయిదు డ్రాగా ముగించగలిగింది. ఒక్కటంటే ఒక్క మ్యాచ్ లో  కూడా విజయంసాధించిన చరిత్ర లేదు.  చివరిగా 2014లో ఆడిన టెస్టులో ఏకంగా ఇన్నింగ్స్ 54 పరుగుల తేడాతో చిత్తైంది.  ఈ సిరీస్‌కు ముందు ఎడ్జ్‌బాస్టన్‌లోనూ టీమ్ ఇండియాకు విజయం దక్కలేదు. అయితే ఈ సిరీస్‌లో భారత్ అక్కడ అద్భుత విజయం సాధించింది.  దాంతో గత రికార్డులను పట్టించుకోకుండా ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌ని భారత్ స్ఫూర్తిగా తీసుకోవాల్సి ఉందంటున్నారు.

ఇప్పటి వరకు చేసిన తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకుని సరైన వ్యూహంతో ముందుకెళ్లాలని యువ క్రికెటర్లకు సూచిస్తున్నారు టీమ్ ఇండియా సీనియర్లు. ఇంగ్లాండ్ ప్లేయర్స్ కవ్వింపులకు నోటితో సమాధానం చెప్తూనే ఆటతో వాళ్ల నోళ్లు మూయించాలంటున్నారు. అప్పుడే మాంచెస్టర్‌లో టీమ్ ఇండియా తొలి విజయం నమోదు చేసి సిరీస్‌ను 2-2తో సమం చేయగలుగుతుంది. సో బెస్ట్ ఆఫ్ లక్ టీమ్ ఇండియా.