పొట్లూరి కోసం బాబుపై పవన్ ఒత్తిడి?
posted on Apr 14, 2014 12:01PM

విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి పారిశ్రామికవేత్త పొట్లూరి ప్రసాద్‌కి టిక్కెట్ ఇవ్వడానికి తెలుగుదేశాధినేత చంద్రబాబు నాయుడు ఫిక్సయ్యారు. ఈ స్థానం నుంచి పోటీ చేయడానికి తెలుగుదేశం పార్టీ ఏనాడో డిసైడ్ చేసిన కేశినేని నానికి జెల్లకొట్టి మరీ పొట్లూరి ప్రసాద్‌వైపు చంద్రబాబు మొగ్గు చూపారు. కేశినేని నాని విజయవాడ పార్లమెంట్ సీట్ తనకి కావాల్సిందేనని మొత్తుకుంటున్నా, నిరసన గళం వినిపిస్తున్నా అవి చంద్రబాబు చెవికి చేరడం లేదు. చంద్రబాబు ఈ సీటు విషయంలో ఇంత మొండి పట్టుదలతో ఎందుకున్నాడా అని పరిశీలించిన రాజకీయ పరిశీలకులు ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తున్నారు.
ఈ ఎన్నికలలో బీజేపీ, టీడీపీ తరఫున ప్రచారం చేయడానికి పవన్ కళ్యాణ్ సూత్రప్రాయంగా అంగీకరించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రచారంలో పవన్ కళ్యాణ్ ఎక్కువగా మోడీకి మద్దతు ఇవ్వాలనే కోణంలోనే ప్రచారం నిర్వహించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రచారం మొత్తం బీజేపీకి డైరెక్ట్ గా మద్దతు ఇచ్చేలా వుండొచ్చని తెలుస్తోంది. అయితే ఇలా బీజేపీ వైపే ప్రచారం మొత్తం వుండటం వల్ల బీజేపీకే లాభం జరుగుతుంది తప్ప తెలుగుదేశానికి ఒరిగేదేమీ వుండదని భావించిన చంద్రబాబు తెలుగుదేశానికి కూడా ప్రచారం చేయాలని చంద్రబాబుని కోరినట్టు, అలా చేయాలంటే తన మనుషులకు తెలుగుదేశం కొన్ని సీట్లు కేటాయించాలని డిమాండ్ చేసినట్టు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
ముఖ్యంగా పొట్లూరి ప్రసాద్‌కి ఎట్టి పరిస్థితుల్లోనూ విజయవాడ పార్లమెంట్ టిక్కెట్ ఇచ్చి తీరాల్సిందేనని పవన్ కళ్యాణ్ పట్టుపట్టినట్టు సమాచారం. పొట్లూరి ప్రసాద్‌కి టిక్కెట్ ఇస్తే తెలుగుదేశం పార్టీకి అటు సీమాంధ్రతోపాటు, ఇటు తెలంగాణలో కూడా ప్రత్యేకంగా ప్రచారం చేస్తానని పవన్ కళ్యాణ్ ఆఫర్ ఇవ్వడంతో చంద్రబాబుకు టిక్కెట్ ఇవ్వక తప్పలేదని తెలుస్తోంది.