కేశినేని నానిపై జగన్ కన్ను!
posted on Apr 14, 2014 12:46PM

తెలంగాణలో వైసీపీ ఆల్రెడీ దుకాణం మూసేసింది. ఇప్పుడు సీమాంధ్రలో తన ఉనికిని కాపాడుకునే తంటాలు పడుతోంది. సీమాంధ్రలో చాలా నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి సరైన అభ్యర్థులు కూడా లేని పరిస్థితిని ఎదుర్కొంటున్న వైసీపీ తెలుగుదేశం పార్టీ మీద కన్నేసింది. ఆ పార్టీలో టిక్కెట్లు దొరకని, కోరుకున్న టిక్కెట్లు దొరకక అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న నాయకులను ఆకర్షించి వైసీపీ తరఫున పోటీ చేయించడానికి ప్రయత్నాలు చేస్తోంది.
ఇప్పటికే ఆ తరహా నాయకులను కొంతమందిని ఆహ్వానించి సీట్లు ఇచ్చేసి తెలుగుదేశం పార్టీ మీద విజయం సాధించేసినట్టు సంతోషిస్తోంది. ఇప్పుడు వైసీపీ దృష్టి విజయవాడ పార్లమెంటు స్థానం మీద పడింది. ఈ స్థానం నుంచి పోటీ చేయాలని పట్టుబడుతున్న కేశినేని నాని మీద వైసీపీ దృష్టిని కేంద్రీకరించింది.
వ్యాపారవేత్త పొట్లూరి ప్రసాద్‌కి విజయవాడ పార్లమెంటు టిక్కెట్ ఇవ్వాలని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నిర్ణయించుకోవడంతో, ఈ స్థానం నుంచి పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్న కేశినేని నాని నిరసన గళం వినిపిస్తున్నారు. దీనిని తనకు అనుకూలంగా మలచుకోవాలని వైసీపీ భావిస్తోంది. కేశినేని నానిని వైసీపీ నుంచి పోటీ చేయించేలా ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ విషయంలో కేశినేని పార్టీని ఒప్పించడానికి ఒక రాయబార బృందం రంగంలోకి దిగినట్టు సమాచారం.