పాలగుమ్మి విశ్వనాధం కన్నుమూత
posted on Oct 26, 2012 12:00PM
.jpg)
లలిత సంగీత మధురిమల్ని ఆలిండియా రేడియో ద్వారా అశేష సంగీత అభిమానులకు అందించిన సంగీతవేత్త పాలగుమ్మి విశ్వనాధం కన్నుమూశారు. హైదరాబాద్ దోమల్ గూడలోని తన కూతురు శ్వేత నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు. పాలగుమ్మి వయసు 93 సంవత్సరాలు. ఆయన కొంతకాలంగా వయసుపరంగా వచ్చిన అస్వస్థతతో బాధపడుతున్నారు. ప్రముఖ రచయిత పాలగుమ్మి పద్మరాజుకి స్వయానా సోదరుడు. 15 వేల పాటలకు పైగా లలిత సంగీతాన్ని అందించిన ప్రజ్ఞాశాలి పాలగుమ్మి విశ్వనాథం. 1919లో తూ.గో జిల్లా తిరుపతిపురంలో జన్మించారు. సంగీత భూషణ మర్లా సత్యనారాయణమూర్తి దగ్గర కర్నాటక శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించారు. మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రి దగ్గర వీణా వాదనలో శిక్షణ పొందారు. మద్రాసులో సంగీత కళానిధి ఎస్. రామనాథం దగ్గర శిష్యరికం చేశారు. 1954లో ఆలిండియా రేడియో హైదరాబాద్ లో చేరి వేలాది గేయాలకు బాణీలను అందించారు. “అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగా” అనే చిన్నికన్నయ్య గీతం పాలగుమ్మి పేరు చెప్పగానే లలిత సంగీతాభిమానులకు ఠక్కున గుర్తొచ్చే గీతం. ఈ పాటను వింటుంటే కన్నయ్య కళ్లముందే కనపడుతున్నాడా అన్నంతగా వినేవాళ్లు తాదాత్మ్యం చెందుతారని సంగీత అభిమానులు చెప్పుకుంటారు.