భారత్ తో యుద్ధం చేసే సత్తా పాక్ కు లేదు.. వైరల్ అవుతున్న సీఐఏ రహస్య పత్రం
posted on May 2, 2025 12:29PM

ఇటీవల కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన దాడి తరువాత భారత్, పాకిస్థాన్ ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇరు రాష్ట్రాల మధ్యా ఇక యుద్ధమే అన్నట్లుగా వాతావరణం మారింది. పాకిస్థాన్ అయితే భారత్ దాడికి సమాయత్తమౌతోందంటూ ప్రకటనలు గుప్పిస్తోంది. అదే జరిగితే అణ్వాయుధ ప్రయోగానికి వెనుకాడబోమని హెచ్చరికలు సైతం జారీ చేస్తున్నది. అయితే ఆ హెచ్చరికలు, ప్రగల్భాలూ కేవలం వాగాడంబరం మాత్రమేనని తేలిపోయింది. పాకిస్థాన్ కు భారత్ తో పోటీ పడే సత్తా కానీ, యుద్ధం చేసే బలం కానీ లేదని అమెరికాకు చెందిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ( సీఐఏ) ఎప్పడో తేల్చేసింది. తాజాగా 1993లో సీఐఏ వెలవరించిన ఒక రహస్య పత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పాకిస్థాన్ కు భారత్ లో యుద్ధం చేసే సత్తా లేదనీ, ఆ దేశ ఆర్థిక స్థితి గతుల కారణంగా ఏ విషయంలోనే భారత్ తో పోటీ పడే పరిస్థితి లేదనీ ఆ రహస్య పత్రం పేర్కొంది.
ఇప్పుడు సోషల్ మీడియాలో నాటి సీఐఏ రహస్య పత్రంపైనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. భారత్ తో యుద్ధం అంటే పాకిస్థాన్ పరారే అంటూ నెటిజనులు పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. భారత సైనిక, ఆర్థిక బలం ముందు పాకిస్థాన్ నిలవలేదని పేర్కొంటున్నారు. అందుకే పాకిస్థాన్ రక్షణ మంత్రి సందర్భం లేకుండా అణ్వాయుధప్రయోగం అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని అంటున్నారు. యుద్ధ భయంతోనే పాక్ సైన్యాధ్యక్షుడు అజ్ణాతంలోకి వెళ్లారనీ, సైనికులు రాజీనామా బాటపడుతున్నారనీ పేర్కొంటున్నారు.