హస్తినలో వర్ష బీభత్సం
posted on May 2, 2025 12:51PM
.webp)
దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. శుక్రవారం తెల్లవారు జామున ఉరుములు, మెరుపులు, వడగళ్లతో పాటు తీవ్రమైన ఈదురుగాలులతో కురిసిన వర్షం హస్తినను అతలాకుతలం చేసేసింది. ఈ భారీ వర్షం కారణంగా ఢిల్లీ విమానాశ్రయం నుంచి విమానరాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కనీసం 100 విమానాలు రీషెడ్యూల్ అయ్యాయి. విమాన రాకపోకల్లో గంటల తరబడి జాప్యం ఏర్పడింది. పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిలిచిపోయారు. విమానాల రాకపోకలలో జాప్యాన్ని తగ్గించేందుక శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు విమానయాన శాఖ అధికారులు తెలిపారు. విమానాల రీషెడ్యూల్ వివరాలను విమాన సంస్థల వెబ్ సైట్ల ద్వారా తెలుసుకోవాలని సూచించారు.
ఇక ఢిల్లీలోని ద్వారక, ఖాన్‌పూర్, సౌత్ ఎక్స్‌టెన్షన్ రింగ్ రోడ్, మింటో రోడ్, లజ్‌పత్ నగర్ మరియు మోతీ బాగ్ వంటి ప్రాంతా ల్లో నీరు నిలిచిపోయింది. ఇక భారీ ఈదురుగాలుల కారణంగా చెట్లు కూలిపో యాయి. కొన్ని కొమ్మలు రహదారులపై పడిపోయాయి. ఇక పోతే ఢిల్లీలోని ద్వారక, ఖాన్ పూర్, సౌత్ ఎక్స్ టెన్షన్ రింగ్ రోడ్, మింటో రోడ్, లజపత్ నగర్, మోతీబాగ్ వంటి ప్రాంతాలలో రహదారులు జలమయమయ్యాయి. పలు చెట్లు నేలకూలాయి.
ద్వారక ప్రాంతంలోని ఓ వ్యవసాయ భూమిలో ఉన్న ఇంటిపై భారీ వృక్షం కూలిపడటంతో ఆ ఇంట్లో ఉన్న కుటుంబంలోని నలుగురు మరణించారు. ఒక మహిళ, ఆమె ముగ్గురు పిల్లలూ మృత్యువాత పడ్డారు. ఆమె భర్త గాయాలతో బయటపడ్డాడు. కాగా శనివారం (మే 3) కూడా ఢిల్లీ అంతటా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించింది.