మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో సీఐడీ దూకుడు.. వైసీపీ బెంబేలు

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తులో సీఐడీ దూకుడు పెంచింది. ఎక్కడా తగ్గేదే లే అన్నట్లుగా ఆధునిక సాంకేతికతను ఆధారం చేసుకుని మరీ అరెస్టుల పర్వాన్ని కొనసాగిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కేసిరెడ్డిని అరెస్టు చేసిన సీఐడీ తాజాగా ఆయన పీఏ దిలీప్ ను అదుపులోనికి తీసుకుంది. అంతకు ముందే వైసీపీ సీనియర్ నాయకుడు, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని విచారించింది.

ఈ అరెస్టుల పర్వం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నది. మద్యం కుంభకోణం తీగ లాగితే తాడేపల్లి ప్యాలస్ డొంక కదులుతుందన్న భయం వైసీపీలో  కనిపిస్తోంది. రాజ్ కేసిరెడ్డి అరెస్టుతో జగన్ పార్టీ కీలక నేతలతో తాడేపల్లి ప్యాలెస్ లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి హడావుడిగా పొలిటికల్ అఫైర్స్ కమిటీని వేయడం చూస్తుంటే.. మద్యం కుంభకోణం కేసులో తానూ జైలుకు వెళ్లక తప్పదన్న భయంలో ఆయన ఉన్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు. 

ఇక ఈ కేసులో నాలుగు మార్లు నోటీసులు అందుకుని కూడా విచారణకు డుమ్మా కొట్టి విదేశాలకు చెక్కేయాలని స్కెచ్ వేసుకున్న రాజ్ కసిరెడ్డిని ఆయన గోవా నుంచి వస్తున్నట్లుగా అందిన కచ్చితమైన సమాచారంతో శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. రాజ్ కేసిరెడ్డి శంషాబాద్ నుంచి మారుపేరుతో చెన్నై అక్కడ నుంచి విదేశాలకు చెక్కేయడానికి పక్కా ప్రణాళిక రచించుకున్నట్లు సీఐడీ పసిగట్టింది. ఇక కోర్టు కూడా రాజ్ కేసిరెడ్డిని ఏడు రోజుల సీఐడీ కస్టడీకి అప్పగించడంతో ఈ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తాయని అంటున్నారు. ఇక రాజ్ కేసిరెడ్డి పీఎ దిలీప్ అరెస్టు కూడా విమానాశ్రయంలోనే ఉంది. విచారణకు గైర్హాజర్ కావడమే కాకుండా దుబాయ్ పారిపోవడానికి చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న దిలీప్ ను సీఐడీ అరెస్టు చేసింది. అతని కదలికలపై నిఘా పెట్టిన సీఐడీ, అతడి ఫోన్ లోకేషన్ ఆధారంగా చెన్నై విమానాశ్రయంలో అదుపులోనికి తీసుకుని విజయవాడ తరలించారు. రాజ్ కేసిరెడ్డిని సీఐడీ కస్టడీకి కోర్టు అనుమతించడం, దిలీప్ పోలసులకు చిక్కడంతో లిక్కర్ స్కాం కు సంబంధించి కీలక సమాచారం లభించడానికి సీఐడీకి మంచి అవకాశం లభించినట్లైందని పరిశీలకులు అంటున్నారు.  ఈ అరెస్టుల నేపథ్యంలో  మద్యం కుంభకోణంతో తాడేపల్లి ప్యాలెస్ లింకులు బయటపడతాయన్న భయం వైసీపీ అగ్రనాయకత్వంలో వ్యక్తమౌతోందని అంటున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu