హెల్మెట్ క్లిప్పు పెట్టుకోవడంలో నిర్లక్ష్యం.. ప్రమాదంలో నిండు ప్రాణం బలి
posted on Aug 2, 2025 9:34AM
ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకోవాలని.. అనుకోని ప్రమాదాలు సంభవించినప్పుడు హెల్మెట్ వల్ల ప్రాణాపాయం తప్పుతుందని పోలీసులు పదే పదే చెబుతున్నా.. చాలా మంది పెద్దగా పట్టించుకోవడం లేదు. ఫైన్ ల భయంతో నామ్ కేవాస్తేగా హెల్మెట్ ను తల మీద ఉంచుకుని క్లిప్పు పెట్టుకోకుండా వదిలేస్తున్నారు. దీని వల్ల హెల్మెట్ పెట్టుకున్న ప్రయోజనం నెరవేరడం లేదు. హెల్మెట్ క్లిప్ పెట్టుకుంటే జుట్టు రాలిపోతుందనీ, తల పోటు వస్తుందని సాకులు చెబుతుంటారు. అయితే ఆ క్లిప్పే ప్రమాదం జరిగిన సమయంలో ప్రాణాలను కాపాడుతుందన్న విషయాన్ని విస్మరిస్తుంటారు. హైదరాబాద్ లో కూడా ఇటువంటి ఘటనే జరిగింది. ఒక ప్రైవేట్ మెడికల్ ల్యాబ్ లో పని చేసే కూకట్ పల్లికి చెందిన నాగ రాజ్ అనే వ్యక్తి తన ద్విచక్రవాహనంపై మియాపూర్ కి వెళ్లి కూకట్ పల్లికి వస్తుండగా స్కూల్ బస్సు ఢీకొని సంఘటనా స్థలంలోనే మరణించాడు.
అతి వేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఇక నాగరాజు సంఘటనా స్థలంలోనే మరణించడానికి అతడు హెల్మెట్ పెట్టుకున్నా దాని క్లిప్పు పెట్టుకోకపోవడమేనని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. స్కూలు బస్సును ఢీకొన్న నాగరాజు రోడ్డుపై పడినప్పుడు హెల్మెట్ క్లిప్పు పెట్టుకోకపోవడంతో ఆ హెల్మెట్ ఎగిరిపోయింది. దీంతో నాగరాజు తల రోడ్డును బలంగా తట్టుకుని అక్కడికక్కడే మరణించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వేరే వాహనం డాష్ కెమేరాల్లో రికార్డయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.