బి.ఎ. రాజు 66వ జయంతి సందర్భంగా కీలక ప్రకటన!
on Jan 7, 2026

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు 66వ జయంతి. దాదాపు 40 ఏళ్ల పాటు జర్నలిస్ట్‌గా, పీఆర్వోగా, పబ్లిషర్‌గా మరియు నిర్మాతగా ఆయన అగ్రస్థానంలో నిలిచారు. ఆయన తెలుగు సినీ పరిశ్రమలో అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్నారు. అగ్ర హీరోలు, దర్శకుల నుండి కొత్తవారి వరకు అందరినీ సమాన గౌరవంతో, ప్రేమతో చూసేవారు. ఎంతో మంది హీరోలు, హీరోయిన్లకు మార్గనిర్దేశం చేసి వారి కెరీర్ ఎదుగుదలకు తోడ్పడ్డారు.
సూపర్ స్టార్ కృష్ణ సినిమాలకు పబ్లిసిటీ బాధ్యతలు చూస్తూ కెరీర్ ప్రారంభించిన బి.ఎ. రాజు.. ఏకంగా 1500 సినిమాలకు పైగా పీఆర్వోగా పనిచేసి ఆయా చిత్రాల విజయాల్లో కీలక పాత్ర పోషించారు. జర్నలిజంలో కూడా ఆయన చెరగని ముద్ర వేశారు. పలు దినపత్రికల్లో పనిచేసిన అనంతరం, 1994లో తన సతీమణి బి. జయతో కలిసి 'సూపర్ హిట్' వీక్లీని స్థాపించారు. 27 ఏళ్ల పాటు ఒక్క వారం కూడా ఆపకుండా, తుదిశ్వాస వరకు ఆ పత్రికను నడిపించడం ఆయన అంకితభావానికి నిదర్శనం.
2001లో సూపర్ హిట్ ఫ్రెండ్స్, ఆర్.జె సినిమాస్ బ్యానర్‌పై చిత్ర నిర్మాణం చేపట్టారు. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తూ 'ప్రేమలో పావని కళ్యాణ్', 'చంటిగాడు', 'లవ్లీ', 'వైశాఖం' వంటి పలు చిత్రాలను నిర్మించారు. ఆయన ఇండస్ట్రీకి ఒక 'నాలెడ్జ్ బ్యాంక్' లాంటివారు. కంప్యూటర్ అవసరం లేకుండానే ఏ డైరెక్టర్ ఏ హీరోతో ఎన్ని సినిమాలు చేశారు, సినిమా విడుదల తేదీలు, ఎన్ని రోజులు ఆడింది, కలెక్షన్లు ఎంత అనే విషయాలు ఆయన వేళ్ళ చివర ఉండేవి.
ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆయన తోటి జర్నలిస్టులకు ఎల్లప్పుడూ అండగా ఉండేవారు. ఎవరైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, మానసిక ధైర్యం కావాలన్నా ముందుండేవారు. పరిశ్రమలో అందరితో సన్నిహితంగా ఉన్నప్పటికీ, సూపర్ స్టార్ కృష్ణ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఆయనకు ప్రత్యేకమైన ఆత్మీయ అనుబంధం ఉండేది.
బి.ఎ. రాజు కుమారుడు శివ కుమార్ సూపర్ హిట్ ఫ్రెండ్స్, ఆర్.జె సినిమాస్ బ్యానర్ లను పునరుద్ధరించి, త్వరలోనే ప్రముఖ స్టార్లతో సినిమాలు ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



