ఆ 10 స్థానాలకు ఉపఎన్నికలు వస్తాయా ?
posted on Aug 2, 2025 9:54AM

తెలంగాణలో భారత రాష్ట్ర సమితి టికెట్ పై గెలిచి.. అధికార కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై మూడు నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు అసెంబ్లీ స్పీకర్ ను ఆదేశించింది. అంతే కాకుండా.. అనర్హత పిటిషన్‌లో పేర్కొన్న ఎమ్మెల్యేలు ఎవరూ విచారణను ఆలస్యం చేయడానికి అనుమతించకూడదని.. ఎవరైనా ఆ దిశగా ప్రయత్నిస్తే తీవ్రంగా పరిగణించాలని స్పీకర్‌కు సూచించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టీన్ జార్జ్ లతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది.
రాజకీయ ఫిరాయింపుల నిలువరించకపోతే అవి ప్రజాస్వామ్యానికే నష్టం తేగలవని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. అయితే.. అదే సమయంలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టే నిర్ణయం తీసుకోవాలని బీఆర్‌ఎస్ నేతలు చేసిన అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. ఆ అధికారం, న్యాయస్థానాలకు లేదని, అది స్పీకర్ విచక్షనాధికారాల పరిదిలోకి వస్తుందని స్పష్టం చేసింది. అయితే.. అదే సమయంలో అనర్హత పిటిషన్లు సమర్పించి దాదాపు ఏడు నెలలు గడిచినా నోటీసులు జారీ చేయకపోవడం, కోర్టులో కేసు దాఖలు చేసిన తర్వాతే నోటీసులు జారీ చేయడంపై స్పీకర్‌ను ధర్మాసనం తప్పుబట్టింది.
సుప్రీం కోర్టు తీర్పును కాంగ్రెస్ పార్టీ సహా ప్రధాన రాజకీయ పార్టీలన్నీ స్వాగతించాయి. బీఆర్ఎస్ టికెట్ పై గెలిచి కాంగ్రెస్ కండవాలు కప్పుకున్న మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సహా గౌరవ ఎమ్మెల్యేలు కూడా సుప్రీం తీర్పును స్వాగతించారు. అంతే కాదు.. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా శిరసా వహిస్తామని అంటున్నారు.
మరోవంక ఎవరి భాష్యం వారిది అన్నట్లుగా.. సుప్రీం తీర్పును,రాజకీయ పార్టీలు ఎవరికి తోచిన భాష్యం వారు వినిపిస్తున్నారు. ఎవరికి వారు తమకు అనుకూలమైన విధంగా అన్వయించుకుంటున్నారు. మరో వంక రాజకీయ పండితులు ఎవరి పద్దతిలో వారు విశ్లేషిస్తున్నారు. అలాగే న్యాయకోవిదులు, రాజ్యాంగ నిపుణులు ఎవరికి వారు ఎవరి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఇటు రాజకీయ నాయకుల అభిప్రాయాలు, న్యాయ నిపుణులు అభిప్రాయాలను విశ్లేషించి చూస్తే.. అటు తిరిగి ఇటు తిరిగి బంతి మళ్ళీ స్పీకర్ కోర్టుకే చేరిందనే అభిప్రాయం అంతర్లీనంగా అందరి మాటల్లోనూ వినిపిస్తోంది.
అందుకే.. ఇప్పడు అందరి చూపు స్పీకర్ వైపుకు మరలుతోంది. అయితే.. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ఎవరికీ తెలియదు. కాగా.. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ సుప్రీం కోర్టు తీర్పును చదివిన తర్వాత.. తీర్పులో ఏముందో పరిశీలించి న్యాయ నిపుణులతో సంప్రదించి అప్పుడు నిర్ణయం తీసుకుంటానని అన్నారు. అయితే.. అదే సమయంలో స్పీకర్ ఒక సంకేతాన్ని అయితే ఇచ్చారు, ఇటీవల తన పదవికి రాజీనామా చేసిన ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ మాట్లాడిన మాటలు వింటే అప్పుడు అన్నీ మీకే తెలుస్తాయని వ్యాఖ్యానించారు. అంటే.. రాష్ట్రపతి, గవర్నర్లకు న్యాయస్థానాలు ఆదేశాలు జారీ చేయ లేవనే ధన్‌ఖడ్ అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్న సంకేతాలు అయితే ఇచ్చారు. అయితే.. న్యాయనిపుణులతో సప్రదించిన తర్వాత స్పీకర్ ఏ నిర్ణయం అయినా తీసుకోవచ్చని అంటున్నారు. అదలా ఉంటే.. సుప్రీం కోర్టు స్పీకర్ మూడు నెలలలోగా నిర్ణయం తీసుకోవాలని మాత్రమే ఆదేశించింది కానీ.. అనర్హులుగా ప్రకటించాలని సంకేత మాత్రంగా అయినా చెప్పలేదు. అనర్హులుగా ప్రకటించవచ్చు లేదంటే తెలంగాణ శాసనసభ పదేళ్లుగా పాటించిన సంప్రదాయన్ని ‘ప్రిసీడెంట్’ తీసుకుని.. ఆ రకంగా నిర్ణయం తీసుకున్నా తీసుకోవచ్చును. అంతిమ నిర్ణయం ఏమిటో ఇప్పుడే చెప్పడం కుదరదని నిపుణులు అంటున్నారు. అయితే అవన్నీ ఎలా ఉన్నా.. అందరి ముందున్న ప్రధాన ప్రశ్న, ఉప ఎన్నికలకు సంబధించి.. దానికి సమాధానం చెప్పడం ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని విశ్లేషకులు అంటున్నారు.
అయితే బీఆర్ఎస్ ఉప ఎన్నికలు తధ్యమని అంటుంటే, కాంగ్రెస్ నాయకులు ఆ ఆస్కారమే లేదనీ.. ఆ చర్చే అనవసరమని అంటున్నారు. నిజానికి.. రెండు మూడు నెలల క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదిక నుంచే, ఏ చట్టాలు మారాయని, అప్పుడు బీఆర్ఎస్ హయంలో రాని ఉప ఎన్నికలు ఇప్పడు వస్తాయని, ప్రశ్నించారు. ఉప ఎన్నికల ప్రశ్నే లేదని, బే ఫికర్ గా ఉండచ్చని ఫిరాయించిన ఎమ్మెల్యేలకు భరోసా ఇచ్చారు. సో .. ముఖ్యమంత్రి భరోసా నిజం అయితే ఉప ఎన్నికలు రావు .. బీఆర్ఎస్ ఆశలు ఫలిస్తే ఉప ఎన్నికలు వస్తాయి. ప్రస్తుతానికి ఇలాగే అనుకుని సరిపెట్టుకోవాల్సి ఉంటుంది.