బెజవాడ కనక దుర్గమ్మ సేవలో ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ
posted on May 2, 2025 10:19AM

తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు తనయుడు నందమూరి రామకృష్ణ గురువారం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అమరావతి పనుల పున: నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయవాడ వచ్చిన ఆయన ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అమరావతి పున: నిర్మాణ పనులు విజయవంతం కావాలనీ, అలాగే ఏపీలో ప్రధాని పర్యటన సక్సెస్ కావాలని అమ్మవారిని ప్రార్ధించినట్లు చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్డీఎ కూటమి ప్రభుత్వ హయాంలో రాజధాని నిర్మాణం పూర్తి కావాలని, ఏపీ ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలని, తద్వారా ఏపీ అన్నపూర్ణగా రూపుదిద్దుకోవాలని, సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించాలన్నారు. తెలుగుదేశం పార్టీ, తమ తండ్రి ఎన్టీఆర్ ఆశయాల సాధనకు సీఎం చంద్రబాబు నిరంతరం కృషి చేస్తున్నారని, ఆయన నాయకత్వంలో ఏపీ అన్నివిధాలా అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. స్వర్ణాంధ్రగా ఏపీ రూపుద్దికోవాలని, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కలలు సాకారం కావాలని, ప్రజాశీస్సులతో స్వర్ణాంధ్ర-2047 ద్వారా లక్ష్యాన్ని సాధించాలని రామకృష్ణ ఆకాంక్షించారు.