మిస్ వరల్డ్ 2025 పోటీల ఏర్పాట్ల సమీక్షకు హైదరాబాద్ కు జూలియా ఈవేలిన్ మోర్లీ
posted on May 2, 2025 10:01AM

హైదరాబాద్ లో జరగనున్న మిస్ వరల్డ్ 2025 పోటీల ఏర్పాట్లను సమీక్షించేందుకు లండన్ లోని మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈవో, చైర్ పర్సన్ జూలియా ఈవేలిన్ మోర్లి శుక్రవారం (మే2) హైదరాబాద్ చేరుకున్ననారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆమెకు అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ కోసం జరుగుతున్న ఏర్పాట్లు, మిస్ వరల్డ్ కాంటెండర్స్ పర్యటించే వివిధ ప్రాంతాల లో చేపట్టిన ఏర్పాట్లు, వివిధ ఈవెంట్లకు సంబంధించిన అంశాలపై జూలియా మోర్లి సంబంధిత ఏజెన్సీలు, వివిధ విభాగాలతో సమీక్షిస్తారు.
మిస్ వరల్డ్ 2025 పోటీలకు ఆతిథ్యమిచ్చేందుకు హైదరాబాద్ సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ నెల 7 నుండి 31వ తేదీ వరకు జరగనున్న ఈ అంతర్జాతీయ అందాల పోటీల్లో 140 దేశాలకు చెందిన సుందరీమణులు పాల్గొంటారు. తెలంగాణకు అంతర్జాతీయంగా గుర్తింపును తెచ్చే ఈ వేదిక, రాష్ట్ర పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తుందని భావిస్తున్నారు. ఈ పోటీల సందర్భంగా, మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే అందాల భామలు మే నెలలో తెలంగాణలోని పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించి తెలంగాణ సంస్కృతి, వారసత్వ సంపద, అభివృద్ధిని ప్రపంచానికి తెలియజేయనున్నారు. ఇప్పటికే ఈ పోటీల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పుడు ఆ ఏర్పాట్లను సమీక్షించేందుకే మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈవో, చైర్ పర్సన్ జూలియా ఈవేలిన్ మోర్లీ హైదరాబాద్ వచ్చారు. ఈ పోటీల నిర్వహణ ద్వారా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందని భావిస్తున్నారు.