జాతీయ యువజన దినోత్సవం.. వివేకానంద జయంతిని యూత్ డేగా ఎందుకు చేస్తారు..
posted on Jan 11, 2025 3:18PM

ప్రపంచం మొత్తంలో యువకులు ఎక్కువమంది ఉన్న దేశం గురించి ప్రస్తావన వస్తే అందులో మన భారతదేశమే మొదటిగా నిలుస్తుంది. ఏ దేశ అభివృద్ధికైనా అనుభవం ఉన్న పెద్దవాళ్లతో పాటూ, పనిచేసే యువశక్తి ఎంతో అవసరం అని చెప్పాల్సిన అవసరంలేదు. దేశ యువతంతా క్రమశిక్షణగా ఉండి వారి శక్తి సామర్ధ్యాలు సరిగా వినియోగిస్తే ఆ దేశం ప్రపంచ చరిత్రలోనే గొప్పదిగా నిలవగలుగుతుంది. ఈ విషయాన్ని వందేళ్ల కిందటే అర్థం చేసుకుని యువతకు తన మాటలతో దేశ భక్తి నింపడానికి, యువతే నా దేశ భవిష్యత్తు అని ఎలుగెత్తి చాటిన వ్యక్తి వివేకానందుడు. స్వామి వివేకానందగా పేరు పొందిన నరేంద్రుడు.. భారతీయ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేశాడు. ప్రపంచాన్ని తన మాటలతో, తన దేశ భక్తితో.. ముఖ్యంగా హిందుత్వం, ఆధ్యాత్మిక భావనతో ప్రభావితం చేసి ప్రపంచం మొత్తం భారతదేశం వేపు తల తిప్పి చూసేలా చేశాడు. ఆయన మాటలు, ఆయన వ్యక్తిత్వం వందేళ్ళ తర్వాత కూడా ఆచరించదగినవి. మంచి వక్త, తత్వవేత్త, ఆధ్యాత్మిక గురువు అయిన స్వామి వివేకానంద పుట్టినరోజును ప్రతీ సంవత్సరం జనవరి 12న జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారు.
స్వామి వివేకానంద..
స్వామి వివేకానందుడు 1863 జనవరి 12న కోల్‌కతలో జన్మించారు. దేశ భవిష్యత్తులో యువత పాత్రను యువతకు గుర్తుచేయడానికి , యువత శక్తిని గుర్తుచేయడానికి ఆయన పిలుపు ఇచ్చిన విధానం ఆయనను ప్రసిద్ధుడిగా మార్చింది. ఈయన రామకృష్ణ పరమహంస బోధనలకు ప్రభావితమై.. సన్మానం స్వీకరించారు. ధార్మిక బోధకుడిగా, తత్వవేత్తగా, వేదాలను ఉపనిషత్తులను అవపోషణ పట్టిన వ్యక్తిగా, యోగాను పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తిగా.. ఇలా చాలా రకాలుగా ప్రసిద్ధి చెందాడు.
1893లో చికాగోలో నిర్వహించిన ప్రపంచ సర్వమత మహాసభలలో ఆయన ఇచ్చిన ప్రసంగం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఆ ప్రసంగంలో ఆయన యువశక్తి, విశ్వ సోదర భావం, ఆత్మాన్వేషణలు అనేవి సామాజిక మార్పుకు ప్రాథమిక సూత్రాలుగా చెప్పారు. స్వామి వివేకానందుడు జాతీయవాదంపై ధృడ విశ్వాసం కలిగి, దేశ భవిష్యత్తు ప్రజల చేతుల్లో ఉందని నమ్మారు. ఎటువంటి నీచస్థితిలో ఉన్నవారికైనా గొప్ప ఆలోచనలను కలిగేలా చేయగలమనే ఆయన నమ్మారు.
"శక్తి నీలోనే ఉందనే నమ్మకంతో ముందుకు సాగితే, నువ్వు అద్భుతాలను సృష్టించగలవు.", "నువ్వు మేల్కొని , ఉప్పొంగు, కానీ లక్ష్యాన్ని సాధించే వరకు ఆగకు", "యువతే దేశ అభివృద్ధికి పునాదులు." అనే మాటలతో.. తన ప్రసంగాలతో దేశ యువతని, ప్రజలని నిరంతరం ప్రోత్సహించేవారు.
1984వ సంవత్సరంలో స్వామి వివేకానందుడి ఆలోచనలను, విలువలను వ్యాప్తి చేయడానికి భారత ప్రభుత్వం జనవరి 12ను జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించింది. 1985 నుంచి దేశవ్యాప్తంగా జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటున్నారు. స్వామి వివేకానందుడి తత్వచింతనలు, ఆదర్శాలు భారత యువతకు గొప్ప ప్రేరణగా నిలుస్తాయని ప్రభుత్వం భావించింది.
యువజన దినోత్సవం- యువతకి పిలుపు....
స్వామి వివేకానందుడి బోధనలు యువతకు జీవిత సవాళ్లను ఎదుర్కొనేందుకు స్ఫూర్తినిస్తాయి. వ్యక్తిగతంగా, సమష్టిగా అభివృద్ధి చెందడానికి విద్య అనేది ముఖ్యమైన సాధనమని ఆయన విశ్వసించారు. యువతలో ఐక్యత, ఆత్మవిశ్వాసం, ఆధ్యాత్మిక చింతన అభివృద్ధి చేయటం, అందరూ దేశభక్తి కలిగి ఉండి, మన సంస్కృతి పట్ల గర్వపడాలనే సందేశాన్ని అందిస్తుంది. సమాజంలో మంచి మార్పు తీసుకురావటంలో యువత పాత్ర అవసరమని, ఆ దిశగా యువత తమ నైపుణ్యాలు, శక్తి సామర్ధ్యాలు ఉపయోగించాలనే పిలుపునిస్తుంది.
*రూపశ్రీ.