రాజ్‌నాథ్‌తో రఘురామ.. సీఎం కేసీఆర్‌కు లేఖ‌.. న్యాయం కోసం పోరాటం..

దెబ్బ‌తిన్న పులిలా ఎంపీ ర‌ఘురామ కృష్ణ‌రాజు న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నారు. త‌న‌కు జ‌రిగిన అన్యాయంపై రాజ్యాంగ వ్య‌వస్థ‌ల ముందు ఏక‌రువు పెడుతున్నారు. ఇప్ప‌టికే మెజిస్ట్రేట్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వ‌ర‌కు.. రాజ్యంపై ఒంట‌రి పోరాటం చేస్తున్నారు. మ‌రోవైపు, ఆయ‌న కుటుంబ స‌భ్యులు సైతం ర‌ఘురామ త‌ర‌ఫున త‌మ వంతు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఏపీ ప్ర‌భుత్వ కుట్ర‌ల‌పై లోక్‌స‌భ స్పీక‌ర్ నుంచి జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ వ‌ర‌కూ.. ర‌ఘురామ‌కు జ‌రిగిన దారుణంపై ఫిర్యాదులు చేశారు. అక్క‌డితో ఆగిపోలేదు ర‌ఘురామ‌. తాజాగా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో ఆయ‌న‌ భేటీ అయ్యారు. దాదాపు 10 నిమిషాల పాటు సమావేశమయ్యారు. 

సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేశాక‌.. సికింద్రాబాద్‌ ఆర్మీ హాస్పిట‌ల్ నుంచి డిశ్చార్జ్ అయి.. నేరుగా ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స తీసుకున్నారు ర‌ఘురామ‌. ఆయ‌న కాలికి తీవ్ర గాయాలు ఉండ‌టంతో ప్లాస్ట‌ర్ ఆఫ్ పారిస్‌తో క‌ట్లు క‌ట్టిన వైద్యులు.. ఆయ‌న‌కు రెస్ట్ అవ‌స‌ర‌మ‌ని సూచించారు. ఢిల్లీ ఎయిమ్స్ నుంచి వ‌చ్చాక‌.. తాజాగా కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను క‌లిసి మొత్తం విష‌యాన్ని ఆయ‌న దృష్టికి తీసుకొచ్చారు. ఏపీ ప్రభుత్వం తనపై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తోందని రాజ్‌నాథ్‌కు రఘురామ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కాలి గాయాల‌తో న‌డ‌వ‌లేని స్థితిలో ఉన్న ర‌ఘురామ‌.. వీల్‌ చెయిర్‌లోనే రాజ్‌నాథ్ ఇంటికి వెళ్లారు.  

మ‌రోవైపు.. ఎంపీ ర‌ఘురామ కృష్ణ‌రాజు.. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లేఖ రాయ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఒక ప్రజాప్రతినిధిని అరెస్టు చేసే సమయంలో పొరుగు రాష్ట్ర పోలీసులు అనుసరించాల్సిన విధివిధానాలు, మార్గదర్శకాలను గచ్చిబౌలి స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ (ఎస్‌హెచ్‌వో) పట్టించుకోలేదని ర‌ఘురామ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ అధికారిపై  క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈనెల 14న తన అరెస్టు సమయంలో చోటుచేసుకున్న నిబంధనల ఉల్లంఘనను వివరిస్తూ... కేసీఆర్‌కు 8 పేజీల లేఖ రాశారు ర‌ఘురామ‌. ‘‘నాపై ఏపీసీఐడీ సూమోటోగా కేసు నమోదు చేసింది. ఈ  కేసును గుంటూరు సీఐడీ అడిషనల్‌ ఎస్పీ విజయపాల్‌ నేతృత్వంలో పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 14వ తేదీన హైదరాబాద్‌ గచ్చిబౌలి బౌల్డర్‌హిల్స్‌లోని నా నివాసమైన 74వ నంబర్‌ విల్లాకు ఒక బృందం వచ్చింది. నన్ను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసేందుకు వచ్చినప్పుడు గచ్చిబౌలి స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ కనీస పోలీసు మాన్యువల్స్‌ను కూడా పట్టించుకోలేదు. ఎంపీగా ఉన్న నా అరెస్టుకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని కూడా పరిశీలించలేదు. ఏపీసీఐడీ  నుంచి ట్రాన్సిట్‌ రిమాండ్‌ ఆర్డరు తీసుకోలేదు. అసలు ఎఫ్‌ఐఆర్‌ ఉందో లేదో కూడా పరిశీలించలేదు. నన్ను అరెస్టు చేసే ముందు నా ఆరోగ్య పరిస్థితిపై  స్థానిక ఆసుపత్రిలో పరీక్షలు చేయించాలన్న నిబంధనను పట్టించుకోలేదు. నన్ను అదుపులోకి తీసుకుంటున్న సమయంలో ఏపీసీఐడీ న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా వ్యవహరించేలా చూడాల్సిన బాధ్యతనూ విస్మరించారు. నన్ను కారులోకి నెట్టేస్తున్నా గచ్చిబౌలి ఎస్‌హెచ్‌ఓ స్పందించలేదు. రాజ్యాంగ హక్కులను కాపాడడంలో భాగంగా నా అరెస్టుకు సంబంధించి ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి. అది కూడా తీసుకోలేదు’’ అని రఘురామ లేఖ‌లో వివరించారు. 

తనను అరెస్టు చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దును దాటేముందు ప్రస్తుతమున్న నిబంధనలు, మార్గదర్శకాల మేరకు తెలంగాణ ప్రభుత్వ అనుమతిని ఏపీసీఐడీ తీసుకోలేదని ఆరోపించారు. తెలంగాణ పోలీసులు ‘రూల్‌ ఆఫ్‌ లా’ను అమలుచేసేలా చర్యలు తీసుకోవాలని కేసీఆర్‌ను కోరారు. సీఐడీ అడిషనల్‌ ఎస్పీ విజయపాల్‌ బృందంతో పాటు తన నివాసానికి వచ్చిన గచ్చిబౌలి పోలీసు సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. 

ఇలా, ఎంపీ ర‌ఘురామ త‌న అరెస్ట్ విష‌యంలో అసంబ‌ద్ధంగా వ్య‌వ‌హ‌రించిన ప్ర‌తీ ఒక్క అంశంపై పోరాడుతున్నారు. ఇప్ప‌టికే కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండ‌గా.. ఎన్‌హెచ్ఆర్‌సీ, కేంద్ర ర‌క్ష‌ణ‌మంతి, తెలంగాణ ముఖ్య‌మంత్రి.. ఇలా న్యాయం కోసం ఆయ‌న తొక్క‌ని గ‌డ‌ప లేదు. అంతిమ విజ‌యం సాధించే వ‌ర‌కూ విశ్ర‌మించేది లేద‌న్న‌ట్టు ఉంది ర‌ఘురామ చిత్త‌శుద్ధి. మ‌రి, త‌ను చేస్తున్న ఒంట‌రి పోరాటంలో ఏ మేర‌కు స‌ఫ‌లం అవుతారో చూడాలి...

Online Jyotish
Tone Academy
KidsOne Telugu