మాటలొస్తే చాలు రాజ్యం నీదే!

మనిషిని ఆకట్టుకునేది మాట!!
మనిషి వ్యక్తిత్వాన్ని సుస్పష్టం చేసేది మాట!!
మనిషిని ఉన్నతంగా తీర్చిదిద్దేది మాట!!
ఇట్లా మాట మనిషిని ప్రత్యేకంగా నిలబెడుతుంది. అయితే అదే మాట తూటా లాగా ఇతరులను గాయపరుస్తుంది!!

ఆవేశంలో బయటకు వచ్చేమాట ఆయుధం కన్నా పదునైనది. అందుకే కోపం, ఆవేశం ఉన్నపుడు మౌనంగా ఉండటం ఎంతో ఉత్తమం. చాలామంది కొన్ని సార్లు ఎంతో ఆత్మీయులు, మరెంతో కావలసినవాళ్ళ దగ్గర ఏదైనా చిన్న తగాదా వచ్చినప్పుడు ఆవేశంలో ఏదో ఒకటి అనేస్తారు, ఆవేశం కాస్తా చల్లారిపోయాక తాము ఏమి మాట్లాడాము అనేది మరోసారి విశ్లేషించుకున్నాక అప్పుడు తెలుస్తుంది ఎంత అవివేకమైన పని చేశామో అని. కానీ అప్పుడు ఆ తప్పును తిరిగి ఒప్పుకున్నా, అవతల మనిషి మనసుకు అయిన గాయం అంత తొందరగా మానిపోదు. బహుశా కొందరిని ఆ మాటల తాలూకూ గుర్తులు జీవింతాంతం వెంటాడి మీకు దూరంగా ఉండేలా నిర్ణయం తీసుకునేందుకు ప్రేరేపించవవచ్చు కూడా.

మాట మనిషికి ఆభరణం!!

నిజంగా నిజమే!! మనిషి మాట్లాడే మాట ఆ మనిషి ఏంటి అనేది తెలుపుతుంది. ఆవేశం, కోపం, అసహనం చిరాకు ఇలాంటివన్నీ దరిదాపులకు రానివ్వకుండా మాట్లాడగలగడం కొందరికే సాధ్యమని అనుకుంటారు కానీ ప్రయత్నిస్తే ఎవరైనా వీటిని సాదించగలరు. ఎన్నో కంపెనీలు ఈ రకమైన క్వాలిటీస్ ఉన్న అభ్యర్గులకె ఉద్యోగాలు ఇవ్వడం గమనిస్తూనే ఉన్నాం కూడా. 

మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి కేవలం ఉద్యోగ సంస్థలలో పనిచేసేవాళ్లకు మాత్రమే కాదు, జీవిత ప్రయాణంలో ప్రతి మనిషి ఉత్తమంగా ఉండేందుకు కూడా అవసరం. 

మనం ప్రతిరోజు ఎన్నో పనుల దృష్ట్యా కొత్త వాళ్ళతో మాట్లాడాల్సి రావచ్చు, కొందరిని కాంప్రమైజ్ చేయాల్సి రావచ్చు, అందరి దగ్గరా ఓకేవిధంగా మాట్లాడలేం కదా!! అన్ని తెలుసుకుని అడుగేసేవాడు ఉత్తముడని పెద్దల మాట. కాబట్టే మాట్లాడటం అనేది కూడా ఒక కళ అన్నారు.

మాటకు మెరుగులు దిద్దేది మనిషి ముఖంలో సన్నని చిరునవ్వు. నవ్వుతూ పలకరించడం అవతలి వ్యక్తిని పర్ఫెక్ట్ గా రిసీవ్ చేసుకోవడమే. అయితే ఇది అన్ని చోట్లా, అన్ని వేళలా పనికిరాదు.  సందర్భాలు, సంఘటనలు, అవతలి వ్యక్తి మూడ్ ని బట్టి మాట్లాడాలి. చాలామంది చేసే పని ఏమిటంటే తమ మూడ్ ని బట్టి మాట్లాడుతుంటారు కానీ అది వంద శాతం తప్పు. మన మూడ్స్ ను ఇతరుల మీద చూపించకూడదు.

మాటలో వినయం ఉండాలి. ఎదుటివారు చిన్న వాళ్ళు అయినా పెద్దవాళ్ళు అయినా గౌరవించి మాట్లాడాలి. పిచ్చిపిచ్చిగా దిక్కులు చూస్తూ, గట్టిగా నవ్వుతూ ఎప్పుడూ మాట్లాడకూడదు. సన్నని నవ్వుతో, మాట్లాడేటప్పుడు విషయాన్ని వీలైనంత వరకు సాగతీయకుండా తొందరగా ముగించాలి. ముఖ్యంగా కొత్తవాళ్ళ దగ్గర ఎప్పుడూ పిచ్చాపాటి కబుర్లు చెప్పకూడదు. మరొకరిని తక్కువ చేసి మాట్లాడటం ఎంత తప్పో, అనవసరంగా పనిపెట్టుకుని పొగడటం కూడా అంతే తప్పు. 

పార్టీలలో తింటూ తాగుతూ మాట్లాడుకోవడం కామన్. అయితే నోట్లో ఏదైనా ఆహారపదార్థం ఉన్నపుడు, లేదా ఏదైనా తాగుతూ నోట్లో ఉన్నపుడు మాట్లాడకూడదు. దీనివల్ల నోట్లో లాలాజలం ఎదుటివారి మీద పడే అవకాశాలు ఉంటాయి. నోరు కాళీ చేసుకున్నప్పుడు మాత్రమే మాట్లాడాలి. అలాగే పూర్తిగా పళ్ళు ఇకిలించి నవ్వుతూ మాట్లాడకూడదు. సన్నని నవ్వుతో మాట్లాడాలి. అలాగని మరీ చిన్న గొంతుతో మాట్లాడటం వల్ల ఎదుటివారు కాస్త అర్థం చేసుకోవడానికి ఇబ్బంది కావచ్చు. కాబట్టి స్పష్టంగా, మధ్యస్థ గొంతుతో, చెప్పాలనుకునే విషయాన్ని చెప్పాలి.

హుందాగా ఉండాలి. అడ్డదిడ్డంగా, వంకర్లు తిరిగిపోతూ మాట్లాడకూడదు. మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వ్యక్తిని మాత్రమే చూస్తూ మాట్లాడాలి. అపుడపుడు తల అటు ఇటు కదిలించినా పర్లేదు కానీ అసలు ఎదుటి వ్యక్తికంటే చుట్టూ పరిసరాలను గమనించుకుంటూ ఉండటానికి ఎక్కువ సమయం కేటాయించకూడదు. అలా చేస్తే ఎదుటి వాళ్ళను అవమానించినట్టు అవుతుంది.

ఏదేమైనా మాట్లాడటం కూడా ఒక కళ. దాన్ని ఆచరణలో పెట్టేవాళ్లు నలుగురిని తమవైపు చాలా సులువుగా ఆకట్టుకోగలరు.

◆ వెంకటేష్ పువ్వాడ