వైద్యశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ అవార్డులు
posted on Oct 6, 2025 4:28PM

2025 సంవత్సరానికి వైద్యశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ అవార్డులు లభించాయి. రోగ నిరోధక శక్తికి సంబంధించిన పరిశోధనకు గాను మేరీ బ్రన్కో (అమెరికా), ఫ్రెడ్ రామ్స్‌డెల్ (అమెరికా), షిమన్ సకాగుచి (జపాన్)లకు నోబెల్ ప్రైజ్‌లు వచ్చాయి.
మానవ శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ తన సొంత కణాలు, అవయవాలపై దాడి చేయకుండా ఎలా నియంత్రించబడుతుందనే అంశంపై కీలక రహస్యాన్ని వీరు ఛేదించారు. ఈ విప్లవాత్మక ఆవిష్కరణకు గాను నోబెల్ బహుమతిని అందుకున్నారు. వీరి పరిశోధనలు ‘పెరిఫెరల్ ఇమ్యూన్ టాలరెన్స్ అనే విధానంపై దృష్టి సారించాయి.
ఈ ప్రక్రియలో, నియంత్రిత టీ కణాలు అని పిలువబడే ప్రత్యేక రోగనిరోధక కణాలు శరీరంలో ఆటోఇమ్యూన్ వ్యాధులను అడ్డుకునే రక్షకులుగా వ్యవహరిస్తాయని వారు నిర్ధారించారు. ఈ కణాలు శరీరానికి వ్యతిరేకంగా దాడి చేసే ఇతర ఇమ్యూన్ కణాలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
ఇక నోబెల్ కమిటీ ప్రకారం, అక్టోబర్ 6 నుంచి 13 వరకు వివిధ విభాగాల విజేతలను ప్రకటించనున్నారు. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్యశాస్త్రం వంటి విభాగాలతో ప్రారంభమై, అక్టోబర్ 9న సాహిత్య విభాగంలో నోబెల్ బహుమతి విజేతను స్టాక్‌హోమ్‌లో ప్రకటిస్తారు. అనంతరం అక్టోబర్ 10న నోబెల్ శాంతి బహుమతి గ్రహీత పేరును వెల్లడించనున్నారు.