జీవిత గమనానికి - క్రమశిక్షణ ఒక చుక్కాని

జీవితంలో ఆరోగ్యకరం అయిన ప్రయాణానికి దోహదం చేసేది క్రమశిక్షణ. కేవలం సమయపాలననే క్రమశిక్షణ అని అనుకోకూడదు. సమాజం పట్ల అవగాహన కలిగి వుండి ఆశావాహ దృక్పధమైన పనులను వరుస ప్రకారం నెమ్మదిగా చేసుకుపోవడం క్రమశిక్షణ కి అద్దం పడుతుంది. సమయ సాధనతోనే సాధ్యం.

క్రమశిక్షణ అంటే సరైన దారిలో నడిపించడం లేదా నేర్పించడం అనే అర్థం వస్తుంది. కొన్నిసార్లు అది పిల్లల అమర్యాద ప్రవర్తనని సరిచేయడం కూడా అవుతుంది. కానీ ముఖ్యంగా క్రమశిక్షణ అంటే మంచి, చెడు తెలుసుకునేలా శిక్షణ ఇవ్వడం. ఆ శిక్షణ పిల్లలు తప్పు చేయకముందే మంచి నిర్ణయాలు తీసుకునేలా వాళ్లకు సహాయం చేస్తుంది.

ఇటీవల కాలంలో చాలా ఇళ్లలో క్రమశిక్షణ అనేదే లేకుండా పోయింది. ఎందుకంటే పిల్లల్ని సరిదిద్దితే వాళ్ల ఆత్మ గౌరవం తగ్గిపోతుందని తల్లిదండ్రులు భయపడుతున్నారు. కానీ తెలివైన తల్లిదండ్రులు పిల్లలు పాటించగలిగిన రూల్స్‌ పెట్టి పిల్లలు వాటికి లోబడేలా శిక్షణ ఇస్తారు. చదువులో ఏకాగ్రత, పెద్దల పట్ల గౌరవం,మంచి అలవాట్లు క్రమశిక్షణతో సిద్ధిస్తాయి. 

అనుకున్నదానికి కట్టుబడి ఉండండి. మీ పిల్లలు మీరు పెట్టిన రూల్స్‌కి కట్టుబడి లేకపోతే వాళ్లను పర్యవసానాలు ఎదుర్కోనివ్వండి. అలానే మీ బాబు లేదా పాప మీరు చెప్పినట్లు వింటే వాళ్లను వెంటనే మెచ్చుకోండి.

సమంజసంగా ఉండండి. క్రమశిక్షణ ఇచ్చేటప్పుడు పిల్లల వయసు ఎంత, వాళ్ల సామర్థ్యం ఎంత, వాళ్లు చేసిన తప్పు ఎంత పెద్దది అనే విషయాలను చూసుకోవాలి. ఫలానా తప్పు చేసినందుకే ఈ శిక్ష వేయబడింది అనే విషయం పిల్లలకు అర్థం కావాలి. ఉదాహరణకు సెల్‌ఫోన్‌ విషయంలో పెట్టిన రూల్స్‌ని పాటించలేదు కాబట్టే కొన్ని రోజుల వరకు వాళ్లకు సెల్‌ఫోన్‌ ఇవ్వడం లేదని లేదా తక్కువ వాడుకోనిస్తున్నామని వాళ్లకు తెలియాలి. అదే సమయంలో కేవలం మీకు విసుగు తెప్పించారనే కారణంతో చిన్న విషయాల్లో కోపం తెచ్చుకోకుండా జాగ్రత్త పడండి.

ప్రేమతో ఉండండి. తల్లిదండ్రులు ఏది చెప్పినా ప్రేమతోనే చెప్తారు అనే విషయాన్ని పిల్లలు అర్థం చేసుకుంటే వాళ్లకు క్రమశిక్షణను అంగీకరించడం సులువు అవుతుంది.

◆ వెంకటేష్ పువ్వాడ