చట్టాన్ని చేతిలోకి తీసుకోవాలి

నాలుగు రోడ్ల కూడలి. సాయంత్రం ఐదు ఆరు అవుతుంది. పనులు ముగించుకొని అందరూ ఇంటికెళ్లే సమయం. కానీ ట్రాఫిక్ జామ్. నగరాల్లో ప్రతిరోజు కనిపించే చిత్రం ఇది. ఒక్క అడుగు కూడా వేసే పరిస్థితి లేదు. ట్రాఫిక్ పోలీస్ లేడు. బహుషా ఉన్నా గానీ అత్యవసరం అయ్యి ఎక్కడికైనా వెళ్లి ఉండొచ్చు. ఆ కీకరబాకర వలయంలో ఎవరి గోల వారిది. ఎవరూ పట్టించుకోకుంటే ఎంత సేపు అయినా అదే పరిస్థితిలా అనిపించింది. చిన్న సందు దొరికినా దూరిపోయే చాకచక్యం అందరికీ ఉంది కానీ సమస్య పరిస్కారం గురించి ఎవరూ ఆలోచించరు. నేను కూడా ఆ గుంపులో ఒకన్ని కానీ బండి దిగి మనమే కాసేపు ట్రాఫిక్ విధులు నిర్వహిస్తే సమస్య తీరిపోతుందేమో అనే ఆలోచన వచ్చినా గానీ ఎదో సంకోచం వెనక్కు లాగుతుంది. నాకే కాదు అక్కడ ఉన్న తకిమా యువకులు కూడా అదే ఆలోచన వచ్చి ఉంటుంది. కానీ కొంతమంది బిడియంతో ఆగి ఉంటారు. మరి కొంతమంది హా మనకెందుకులే అని నిర్లక్ష్యంగా ఉంటారు .

ఉన్నట్లుండి ఆ ట్రాఫిక్ వలయంలోకి అంబులెన్స్ వచ్చింది. ఎవరికి వాళ్లు గాబరా పడిపోతున్నారు. ముందు అంబులెన్స్ కి దారి ఇద్దాము అని. అప్పటికే ఒకరి వెనుకాల ఒకరు వాహనాలను ఇరికిచ్చేయడంతో ఎటూ కదలలేని పరిస్థితి. అప్పుడే నా వెనుకనుంచి ఒక పెద్దావిడ బండి దిగి సర్కిల్ సెంటర్ లో నిల్చొని వాహనాలను వరుస క్రమంలో పంపిస్తుంది. ముందు అంబులెన్స్ ఉన్న లైన్ ని పంపారు. ఆమెను చూసి ఇంకో ఇద్దరు తోడుగా వెళ్లారు. ట్రాఫిక్ అయిదు నిమిషాల్లో క్లియర్ అయింది. నిజానికి ఆ సమయంలో స్పందించాల్సింది అక్కడ ఉన్న యువత. సమాజంలో ఎవరూ మనకి ఫలానా మంచి పని చేయమని ఉద్భోధించరు సందర్భానుసారం సొంత నిర్ణయం తీసుకొని ముందుకు కదలాలి. 

ఇలాంటి సమయాల్లో చట్టాన్ని చేతిలోకి తీసుకోవాలి. చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం అంటే కర్ర పెత్తనం కాదు. భాధ్యతను నిర్వర్తించడం.ఆ సమయానికి ఆ పెద్దావిడ నాకు ఒక హీరో లా అనిపించారు. ఇక నుంచి ఇలాంటి సమస్య ఎక్కడ ఎదురైనా యువత స్పందిస్తే బాధ్యతాయుత సమాజాన్ని చూడగలం.

◆ వెంకటేష్ పువ్వాడ