సంగీతంతో ఒత్తిడిని జయించండి

మారుతున్న పరిస్థితుల కారణంగా, జీవన నడవడికలో రకరకాల ఒత్తిళ్లు మన మనోధైర్యాన్ని పరీక్షిస్తాయి. అయితే సమయానుకూలంగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్లకుంటే మాత్రం ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. విద్యార్థులు మార్కుల వేటలో మధనపడుతుంటారు. వ్యాపారస్తులు లాభార్జనకు తపిస్తుంటారు. ఇంటిని ఆర్ధికంగా, ఆరోగ్యకరంగా ఉంచడానికి గృహిణి పరితపిస్తుంటుంది. ఇలా ఎవరి స్థాయిలో వాళ్లు రకరకాల కారణాలతో మానసిక ఒత్తిడికి లోనై కొన్ని సందర్భాల్లో జీవితాలను కూడా త్యజిస్తారు.

*ఒత్తిడికి ప్రధాన కారణం 

మనం ఏదైనా కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టేముందు దాని ద్వారా కలిగే ఫలితాన్నీ ఎక్కువ ఊహించుకోవడం ఆ సమయంలో ఏవైనా ఇబ్బందులు కలిగి మనం అనుకున్నట్లు జరగకున్నా కృంగిపోతాము. ఇదే ఒత్తిడికి ప్రధాన కారణం. టార్గెట్లు పెట్టుకొని పని చేయడం కూడా మంచిది కాదు. ఉదాహరణకు నూతన పెళ్లి చేసుకున్న దంపతులు పాశ్చాత్య పోకడుల కారణంగా ఒకరిపై ఒకరు ఎక్కువ ఊహించుకొని ( expectations) అది నిజ జీవితంలో సాకారం కాకపోవడం వలన ప్రతి క్షణం అదే ఆలోచిస్తూ మధనపడి పోతుంటారు. ఇదో రకం ఒత్తిడి. ఇలా రకరకాల ఒత్తిళ్ల కారణంగా క్షణికావేశంలో విపత్కర నిర్ణయాలు తీసుకుంటున్నవాళ్ల గురించి మనం రోజూ టీవీల్లో చూస్తున్నాము. పత్రికల్లో చదువుతున్నాము. అయితే పరిస్కారం లేని సమస్య అంటూ ప్రపంచంలో లేదు అని అందరూ గుర్తించుకోవాలి. మౌనంగా మనతో మనం మాట్లాడుకుని సమస్యను విశ్లేషించుకుంటే పరిస్కారం కచ్చితంగా దొరుకుతుంది.

*సంగీతంతో ఒత్తిడిని జయించండి

పని వలన కావచ్చు లేదా ఇంట్లో ఆర్ధిక పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు మానసిక ఒత్తిడికి లోనవుతుంటారు. అలాంటి సమయంలో ఏదొక వ్యాపకం మనల్ని ఆ కఠిన క్షణాలనుంచి ఉపశమనం కలిగిస్తుంది. అందులో ప్రధానమైనది సంగీతం. ఇష్టమైన సంగీతాన్ని వింటూ కాలాన్ని గడిపితే ఆ కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. ఆ వినిపించే పాటలో అందులోని మాటల్లో నే ఏదొక సొల్యూషన్ మనకు దొరుకుతుంది. మనసుకు ఆరోగ్యకరమైన ఎంతో ఆహ్లాదాన్ని కూడా ఇస్తుంది.

*పుస్తక పఠనంతో కూడా..!

పుస్తక పఠనం తో కూడా ఒత్తిడిని జయించవచ్చు. ఏదైనా సమస్యతో ఒత్తిడితో ఉన్నప్పుడు ఇష్టమైన పుస్తకం చదవండి. ఖచ్చితంగా ఆ సందర్భానికి ఏదొక పేజీ లో మీ సమస్యకు పరిస్కారం చూపే మాట కనిపిస్తుంది. ఇలా కొన్ని వ్యాపకాలతో మనం ఒత్తిడిని జయించవచ్చు.

◆ వెంకటేష్ పువ్వాడ