ఏపీలో మళ్లీ 'కోడి కత్తి' కలకలం..
posted on Feb 7, 2022 4:49PM
కోడి కత్తి. ఈ పేరు వినగానే అంతా ఉలిక్కిపడుతుంటారు. కోడి కత్తితో రాజకీయాలే మరిపోయిన చరిత్ర. కోడి కత్తి డ్రామా మామూలుగా ఉండదు మరి. అలాంటి కేసు ఎంతకూ కొలిక్కి రాదు మరి. ఇక, సంక్రాంతి పందేలలో కోడి కత్తి పవర్ అంతాఇంతా కాదు. కోట్లకు కోట్లు చేతులు మార్చే యవ్వారం అది. అనేకమంది జీవితాలను తలకిందులు చేసే శక్తి కోడి కత్తికుంది. కోడి కత్తి దెబ్బకు అనేక కుటుంబాలు అప్పులపాలు అయిన ఘటనలో కోకొల్లలు. ఇదంతా పక్కన పెడితే.. తాజాగా ఏపీలో మరోసారి కోడి కత్తి దాడి జరగడం కలకలం రేపుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే....
చిత్తూరు జిల్లా పెద్దమండ్యం మండలం కలిచెర్లలో జరిగిన కోడి పందేల్లో విషాదం నెలకొంది. కోడికి కట్టిన కత్తి తగిలి 40 ఏళ్ల గంగులప్ప చనిపోవడం కలకలం రేపింది. కోడి పందేలు చూస్తున్న గంగులప్పపై ఒక్కసారిగా ఆ పందెం కోడి దాడి చేసింది. కాలితో ఎడాపెడా రక్కేసింది. దీంతో.. కోడి కాలికి కట్టిన కత్తి గీసుకుపోయి.. గంగులప్పకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావంతో ఆసుపత్రికి తరలిస్తుండగానే చనిపోయాడు. విషయం తెలిసి పోలీసులు సీరియస్ అయ్యారు. కోడి పందేల నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.