జగన్‌తో మళ్లీ భేటీ కానున్న చిరంజీవి

మంచు విష్ణుపై పైర్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్‌రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి మళ్లీ భేటీ కానున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు. ఆ క్రమంలో ఫ్రిబవరి 8వ తేదీన హైదరాబాద్‌లోని తెలుగు ఫిల్మ్ ఛాంబ‌ర్ ఆధ్వ‌ర్యంలో ఓ సమావేశం జరగనుందని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి అధ్య‌క్ష‌తన జరిగే ఈ సమావేశానికి టాలీవుడ్‌లోని అన్ని క్రాప్ట్‌లకు చెందిన ప్ర‌తినిదులంతా పాల్గొనున్నారని సమాచారం.

ఇటీవల సీఎం జగన్‌తో మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యారు. ఈ సందర్బంగా సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యలు.. సినిమా టికెట్ల వ్యవహారం, సినిమా థియేటర్ యజమానుల ఇబ్బందులు, సినీ కార్మికుల కష్టాలతోపాటు ఇతర అంశాలను సైతం సీఎం జగన్ దృష్టికి చిరంజీవి తీసుకు వెళ్లినట్లు తెలుస్తోంది. అలాగే సినీ పరిశ్రమకు ప్రోత్సాహకాలు సైతం ఇవ్వాలనే అంశాన్ని కూడా సీఎం జగన్‌ ముందు  చిరంజీవి ఉంచిగా.. అందుకు సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని సమాచారం.

నాడు సీఎం జగన్‌తో జరిగిన భేటీలో చర్చకు వచ్చిన అంశాలతోపాటు ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను చిరంజీవి ఈ సందర్భంగా టాలీవుడ్ ప్రతినిధుల ముందు ఉంచే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే ఈ తాజా సమావేశంలో వీటన్నిటిపై చర్చించి.. ఓ నివేదిక రూపొందించి.. దానిని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి ఇస్తారని సమాచారం. ఇలా అయినా.. టాలీవుడ్ సమస్యలకు ఓ పరిష్కారం దొరుకుతుందేమోనని ఫిలింనగర్ వర్గాలు ఆశగా ఎదురు చూస్తున్నాయి.  

మరోవైపు.. సీఎం జగన్‌తో మెగాస్టార్ చిరంజీవి గతంలో భేటీ కావడంపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు తాజాగా స్పందించారు. ఈ భేటీ వారి వ్యక్తిగతమంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇది అసోసియేషన్ మీటింగ్‌గా భావించకూడదంటూ మంచు విష్ణు పేర్కొన్నారు.

టాలీవుడ్ సమస్య పరిష్కారం కోసం ఏదో ప్రయత్నం జరుగుతోందని అంతా భావిస్తున్నారు. అలాంటి తరుణంలో... మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బాధ్యతయుతమైన పదవిలో ఉన్న మంచు విష్ణు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు సబబు అని టాలీవుడ్ వర్గాలు మండిపడుతున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu