మోడీ కంటే కేసీఆర్ కే జేజేలు పలికిన జనం
posted on Oct 23, 2015 8:38AM

అమరావతి శంకుస్థాపనకు వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఆంధ్రప్రదేశ్ లో అడుగడుగునా ఘనస్వాగతం లభించింది, అతిరథ మహారథులు ఎంతోమంది హాజరైనా... కేసీఆర్ కి మాత్రం స్పెషల్ ట్రీట్ మెంట్ లభిచింది, కేసీఆర్ అమరావతిలో అడుగుపెట్టిన మొదలుకుని...తిరుగుప్రయాణం అయ్యేవరకూ అన్నిచోట్లా ఏపీ మంత్రులు, అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు, కేసీఆర్ కూడా అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా కనిపించారు
అంతేకాదు అమరావతి శంకుస్థాపన కార్యక్రమం జరుగుతున్నంతసేపూ కేసీఆరే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు, రాష్ట్ర విభజన నేపథ్యంలో కేసీఆర్ కి ఉన్న క్రేజ్ అలాంటిది మరి, అందుకే కేసీఆర్ మాట్లాడుతున్నంతసేపు ప్రజలు తమ కేరింతలతో హర్షధ్వానాలు చేశారు, కేసీఆర్ మాట్లాడతారని చెప్పినప్పటి నుంచి ప్రసంగం ముగిసేవరకూ కేసీఆర్ మాటలకు జనం అద్భుతంగా స్పందించారు, చాలా క్లుప్తంగా నీట్ గా క్లారిటీగా మాట్లాడిన కేసీఆర్... అందర్నీ ఆకట్టుకున్నారు. అమరావతి నిర్మాణానికి అవసరమైన అన్ని సహాయ సహకారాలు తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని కేసీఆర్ ప్రకటించినపుడు ప్రజలు అద్భుతంగా స్పందించారు.
అంతేకాదు ప్రధాని మోడీ అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసే సమయంలోనూ చంద్రబాబుతోపాటు కేసీఆర్ కూడా పాల్గొన్నారు, శిలాఫలకం ప్రారంభోత్సవంలో కూడా కేసీఆర్‌ను చంద్రబాబు తన పక్కనే నిలబెట్టుకున్నారు. అంతేకాదు చంద్రబాబు, కేసీఆర్ కలిసిన ప్రతి సందర్భంలోనూ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది, ఇక సభావేదికపై కేసీఆర్‌కు చంద్రబాబు పుష్పగుచ్చం ఇస్తున్న సమయంలో జనం పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టారు. ప్రజల స్పందనను గమనించిన కేసీఆర్ కూడా జనం వైపు ఉత్సాహంగా చేయి ఊపారు.
ఓవరాల్ గా చూస్తే ప్రధాని మోడీ కంటే తెలంగాణ సీఎం కేసీఆర్ కే జనం బ్రహ్మరథం పట్టారు, కేసీఆర్ మాట్లాడుతున్నంతసేపూ కేరింతలు కొట్టారు, అంతేకాదు చంద్రబాబు, కేసీఆర్ కలిసిన ప్రతి సందర్భంలోనూ ఊహించని స్పందన వచ్చింది.