95 నుంచి 105 సీట్లు.. కేసీఆర్ మైండ్ గేమ్ షురూ...
posted on Feb 2, 2022 11:59AM
ఈసారి టీఆర్ఎస్ గెలుస్తుందా? ఈ ప్రశ్న తెలంగాణలో ఎవరినైనా అడిగి చూడండి.. మీకు ఒకటే ఆన్సర్ వస్తుంది. గెలవదు అని. అవును, మీకు డౌట్ ఉంటే.. మీకు తెలిసిన ఓ పది మందిని ఈ ప్రశ్న అడిగి చూడండి మీకే తెలుస్తుంది. పదిలో కనీసం ఏడుగురు అయినా.. ఈసారి కేసీఆర్ ఓడిపోవటం ఖాయం అంటారు. ఏం చేశాడని గెలుస్తాడని తిరిగి ప్రశ్నిస్తారు. ఉద్యోగాలు ఇచ్చిండా.. డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు ఇచ్చిండా.. పింఛన్లు ఇచ్చిండా.. రేషన్ కార్డులు ఇచ్చిండా.. అంటూ పెద్ద లిస్టే చదువుతారు. ఒక వేళ మీరు కేసీఆర్ అభిమానులు అనుకోండి.. కాళేశ్వరం కట్టిండుగా అనొచ్చు. మరి, నీళ్లేవి అని టక్కున ఆన్సర్ వస్తుంది. మిషన్ భగీరథ అంటే.. మరి, ఇంటింటికి నల్లాలు లేవి? అని నిలదీస్తారు. దళిత బంధు అనేరు.. ఎవడికిచ్చారు చూపించు అంటూ మీపైనే గుస్సా అవుతారు. ఇలా.. తెలంగాణ జనాలు కేసీఆర్‌పై తీవ్ర అసంతృప్తితో, అక్కసుతో రగిలిపోతున్నారు. కానీ... ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఉన్నా.. కేసీఆర్ మాత్రం తమ పార్టీకి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 95 నుంచి 105 సీట్లు వస్తాయని ధీమాగా చెబుతున్నారు. నువ్ రాస్కో.. నే చెబుతున్నాగా.. అంటూ దబాయించారు కూడా.
కేసీఆర్ మాటలు విని అంతా అవాక్కవుతున్నారు. అదేంటి.. జనమంతా కేసీఆర్‌ను తిడుతుంటే, ఈసారి కారు పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాలని చూస్తుంటే.. ఆయనేమో తమకు పక్కాగా ఇన్ని సీట్లు వస్తాయంటూ గంభీరంగా చెబుతున్నారేంటబ్బా.. అని కుసుంత కన్ఫ్యూజన్ రావొచ్చు. అద్గది.. కేసీఆర్‌కు కావలసిందీ ఆ కన్ఫ్యూజనే. అది గాంభీర్యం కాదని.. మేకపోతు గాంభీర్యమని విశ్లేషకులు అంటున్నారు.
కేసీఆర్ పని అయిపోయింది.. కేసీఆర్ ఓడిపోతాడు.. కేసీఆర్ ఖేల్ ఖతం అంటూ తెలంగాణలో పెద్ద ఎత్తున టాక్ నడుస్తోంది. ఈ నెగటివ్ టాక్ ఏమాత్రం మంచిది కాదని గులాబీ బాస్ గుర్తించారు. అందుకే, పాజిటివ్ టాక్‌ను ఆయనే సృష్టించారని అంటున్నారు. టీఆర్ఎస్ మళ్లీ గెలవబోతోంది.. ఈసారి 95 నుంచి 105 సీట్లు వస్తాయట.. అంటూ పాజిటివ్ వేవ్ క్రియేట్ చేసి.. జనాలను కన్ఫ్యూజ్ చేసి.. ప్రతిపక్షాలను డిఫెన్స్‌లో పడేయటమే కేసీఆర్ స్ట్రాటజీ అంటున్నారు. అందుకే.. అప్పట్లో గ్లోబెల్స్..! ఇప్పట్లో కేసీఆర్...!!