చంద్రబాబు ముందుచూపు... నెరవేరనున్న తిరుపతి ప్రజల కల
posted on Feb 2, 2022 11:51AM
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడి ముందు చూపు ఫలితాన్నిస్తోంది. మరి కొద్ది రోజుల్లో తిరుపతి నగరానికి మణిహారం లాంటి గరుడ వారధి ప్రజలకు అందుబాటులోకి రానుంది. గరుడ వారధికి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు స్మార్ట్ సిటీ నిధులు, టీటీడీ సహకారంతో అప్పట్లో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గరుడ వారధి పనులు 2019 లో ప్రారంభమై మూడు నెలల్లో పిల్లర్లు వేయడం కూడా జరిగిపోయింది. అయితే.. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత గరుడ వారధి నిర్మాణ పనుల్లో జాప్యం జరిగింది.
ప్రస్తుతం మొదటి దశ గరుడ వారధి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ నుంచి సర్కిల్ వరకు ప్రారంభం కానుంది. మొత్తం నిర్మాణ వ్యయం 645 కోట్ల రూపాయలు కాగా అందులో స్మార్ట్ సిటీ కార్పొరేషన్ తన వాటా చెల్లించింది. టీటీడీ ఇప్పటి వరకు కేవలం 50 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించిందని సమాచారం. 171 పిల్లర్లతో ఆరున్నర కిలోమీటర్ల పొడవు గల ఫ్లైఓవర్ పనులలో ప్రస్తుతానికి 1.5 కిలోమీటర్ల దూరం మాత్రం పూర్తయింది. ఫిబ్రవరి 10వ తేదీ లోగా సీఎం జగన్మోహన్ రెడ్డి గరుడ వారధి మొదటి దశను ప్రారంభిస్తారని తెలుస్తోంది. మరోవైపు గరుడ వారధి పేరును ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం మార్చివేసి శ్రీనివాస్ శేతుగా నామకరణం చేయడం గమనార్హం.