జగన్ కి అదీ ఒక ఆనవాయితీగా మారిందా?

 

ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు ప్రజల తరపున ప్రభుత్వంతో పోరాడటం సర్వసాదారణమయిన విషయమే. రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ నుండి రెక్కలు కట్టుకొని వచ్చి అక్కడ వాలిపోయి తక్షణమే ప్రభుత్వంపై పోరాటం మొదలుపెట్టేస్తారు. బాక్సైట్ తవ్వకాలు, కల్తీ మద్యం, కాల్ మనీ వ్యవహారం అందుకు తాజా ఉదాహరణలు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు పోరాడవలసిన బాధ్యత ఉంటుంది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైకాపా ఆ బాధ్యత సక్రమంగానే నిర్వహిస్తోంది. కానీ ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నంలో జగన్ ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం కారణంగా ప్రభుత్వం కంటే ముందు వైకాపాయే ఎదురుదెబ్బలు తింటోంది. ప్రత్యేక హోదా మొదలుకొని కల్తీ మద్యం కేసు వరకు అందుకు ఎన్నో ఉదాహరణలున్నాయి.

 

బాక్సైట్ తవ్వకాలను అక్కడి గిరిజనులు, ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ ఆలోచనను విరమించుకొంది. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి చింతపల్లిలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా బహిరంగ సభ నిర్వహించి వచ్చేరు. కల్తీ మద్యం కేసులో జగన్మోహన్ రెడ్డి ప్రదర్శించిన అత్యుత్సాహం వలన మద్యం వ్యాపారాలు చేసుకొంటున్న స్వంత పార్టీలో నేతలే ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు. కల్తీ మద్యం కేసులో పోలీసులు ఇప్పటికే తొమ్మిదిమందిని అరెస్ట్ చేసారు. మిగిలినవారి కోసం గాలిస్తున్నారు. ఐ.పి.ఎస్. అధికారి నేతృత్వంలో ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేసారు. కనుక ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొంటోందని ప్రజలు భావిస్తున్నారు.

 

కాల్ మనీ వ్యవహారం బయటపడగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా తీవ్రంగా స్పందించారు. ఆ వ్యవహారంలో తమ పార్టీకి చెందినవారున్నా కూడా విడిచిపెట్టవద్దని కలెక్టర్ ని, పోలీసులను ఆదేశించారు. కాల్ మనీ పద్దతిలో అప్పులు తీసుకొన్నవారెవరూ వాటిని తిరిగి చెల్లించవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పడం, ఈ విషయంలో ఎవరయినా మహిళను వేధిస్తే వారిపై నిర్భయ చట్టం క్రింద కేసులు నమోదు చేయమని పోలీసులను ఆదేశించడం గమనిస్తే ఆయన ఈ విషయంలో ఎంత సీరియస్ గా ఉన్నారో అర్ధమవుతోంది. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ తీరును తప్పు పడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి బహిరంగ లేఖ వ్రాయడం, మళ్ళీ నేడు తన పార్టీ నేతలను వెంటబెట్టుకొని గవర్నర్ నరసింహన్ న్ని కలిసి రాష్ట్ర ప్రభుత్వంపై పిర్యాదు చేయాలనుకోవడం గమనిస్తే ఆ సమస్యల పరిష్కారం కోసం కాక తన పార్టీ ఉనికిని చాటుకోవడానికి ఇటువంటి అవకాశాలను ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.

 

గవర్నర్ కేవలం కేంద్రప్రభుత్వం తరపున రాష్ట్రంలో ప్రతినిధిగా మాత్రమే వ్యవహరిస్తూ అత్యవసరమయిన సమయంలో మాత్రమే తన విశేషాదికారాలు ఉపయోగిస్తారు తప్ప ప్రతీ సమస్యను ఆయనే స్వయంగా పరిష్కరించరని అందరికీ తెలుసు. ఆ పని చేయడానికే రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అది పూర్తిగా విఫలమయిందని భావించినపుడు గవర్నరే స్వయంగా జోక్యం చేసుకొంటారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఈ విషయం తెలియదనుకోలేము. కానీ ప్రతీ సమస్యపై గవర్నర్ ని కలిసి పిర్యాదు చేయడం జగన్ ఒక ఆనవాయితీగా మార్చుకొన్నారు.

 

ఆయన తీరు చూస్తుంటే ‘నాన్న పులి’ కధ గుర్తుకు వస్తోంది. చివరికి ఇది కూడా ఒక ‘రొటీన్ తంతు’ గా మారిపోతోంది. జగన్మోహన్ రెడ్డి తన ముఖ్య నేతలని వెంటబెట్టుకొని గవర్నర్ ని కలవడం, ఆయనకి వినతి పత్రం ఇస్తూ ఫోటోలు తీయించుకొని మీడియాలో వస్తే వాటిని చూసి తృప్తి పడటం మినహా దాని వలన మరే ప్రయోజనం కనబడటం లేదు. ఆయన ఆశిస్తున్నట్లుగా దాని వలన పార్టీకి పెద్దగా ప్రయోజనం కలగడం లేదు. జగన్మోహన్ రెడ్డి ఏ ఉద్దేశ్యంతో గవర్నర్ ని కలుస్తున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా జాగ్రత్తపడితే మంచిది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu