కల్యాణలక్ష్మినీ వదలని పందికొక్కులు.. విజిలెన్స్ రిపోర్టులో కళ్లు చెదిరే నిజాలు

హుజూరాబాద్ ఉపఎన్నికలో బీజేపీ దూకుడుకు కళ్లెం వేద్దామనుకుంటున్న తరుణంలోనే కేసీఆర్ కు దిమ్మతిరిగే రిపోర్టు ఒకటి బయటికొచ్చింది. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ను బాగా చేరువ చేసిన పథకాలల్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చాలా ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ పథకాలతోనే కేసీఆర్ కు పేదప్రజల ఇంటి పెద్దకొడుకు అన్న పేరొచ్చింది. హిందువులకు కల్యాణలక్ష్మి, ముస్లింలకు షాదీముబారక్ పేరుతో ఈడొచ్చిన పేదింటి ఆడపిల్లల పెళ్లి ఖర్చుల కోసం రూ. లక్ష ప్రభుత్వం సాయం చేస్తోంది. కేసీఆర్ మానసపుత్రిక లాంటి ఈ పథకానికే కన్నం పడుతోంది. దీనిపై విజిలెన్స్ అధికారులు ప్రిపేర్ చేసిన ఓ రిపోర్టు తాజాగా ప్రభుత్వానికి చేరింది. ఆ రిపోర్టు చూశాక కంగు తినడం ప్రభుత్వ ఉన్నతాధికారుల వంతయింది. 

పేదల పెళ్లిళ్లకు సాయం చేసే చిన్నమొత్తాలకు కూడా భారీ మొత్తంలో కన్నాలు వేస్తూ ఒక్కో లబ్ధిదారుని నుంచి రూ. వెయ్యి నుంచి రూ. 10 వేల దాకా లంచాలు పుచ్చుకొని ప్రభుత్వ సాయపు సొమ్మును రిలీజ్ చేస్తున్నట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. రాష్ట్రంలోని దాదాపు 10 జిల్లాల్లో క్షేత్రస్థాయిలో జరిగిన విజిలెన్స్ పరిశోధన తరువాత ఈ మేరకు పూర్తి రిపోర్టు ప్రభుత్వానికి నివేదించారు. అందులో ఒక్కరో ఇద్దరో కాదు.. ఏకంగా 40 మందికి పైగా ఎమ్మార్వోలు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ సొమ్ము నుంచి భాగం పంచుకుంటున్నారని గుర్తించారు. పరిశోధించిన పది జిల్లాల్లోనే 40కి పైగా కక్కుర్తి ఎమ్మార్వోల సంగతి బయటపడిందంటే రాష్ట్రం యావత్తులో విజిలెన్స్ దాడులు నిర్వహిస్తే ఇంకెంతమంది అధికారుల గుట్టురట్టవుతుందోనన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. 

ఒక్క ఎమ్మార్వోలే కాదు.. అధికార పార్టీ నాయకులు, మిత్రపక్షమైన ఎంఐఎం పార్టీ లీడర్లకు కూడా ఈ ఆమ్యామ్యాల షేరింగ్ లో భాగం ఉందని విజిలెన్స్ అధికారులు నివేదించారు.  క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్, ఎంఐఎం లీడర్లు, వారి అనుచరులు, మీసేవా కేంద్రాల నిర్వాహకులు, తహశీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది, మరికొందరు బ్రోకర్లు కలసి అక్రమాలకు పాల్పడినట్లు విజిలెన్స్ విచారణలో నిగ్గు తేలింది. అనర్హులకు డబ్బులు చెల్లించి వారి వద్ద నుంచి లంచాలు తీసుకున్నట్లు గుర్తించారు. ఆదిలాబాద్ ఆర్డీవో ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం దరఖాస్తుల ప్రక్రయలో దాదాపు 90 లక్షల మొత్తం దుర్వినియోగానికి పాల్పడ్డట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ఘటనలో గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్ లో నిందితునిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ కూడా చేయడం గమనించాల్సిన అంశం. 

ఇక వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ తాహశీల్దార్ ఆఫీసు కేంద్రంగా కూడా అవినీతి జరిగింది. ఇందుకోసం సదరు ముఖ్యాధికారి కొందరు ప్రజా ప్రతినిధులను, ఇతరులను బ్రోకర్లుగా నియమించుకుని వసూళ్లకు పాల్పడినట్లు విజిలెన్స్ అధికారులు నివేదించారు. ఇందులో ఓ మాజీ ఎంపీపీ, ఓ సర్పంచ్, మరో ముఖ్యమైన స్థానిక  వ్యక్తి ప్రమేయమున్నట్లు  నిర్ధారించారు. ఇదే తరహాలో వరంగల్ అర్బన్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, నల్లగొండ, సూర్యాపేట, ఆదిలాబాద్, నాగర్ కర్నూల్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన 40 మందికి పైగా రెవెన్యూ అధికారులు, ఇతర సిబ్బంది అంతా కలిసి పెళ్లి పథకాల లబ్దిదారుల దరఖాస్తు ప్రక్రియలోనే లంచాలకు పాల్పడ్డారు.  దరఖాస్తుదారుల నుంచి రూ. వెయ్యి నుంచి పది వేల వరకు వసూళ్లు చేశారు. తహశీల్దార్లతో పాటు డిప్యూటీ తహశీల్దార్లు, వీఆర్వోలు, వీఆర్ఏల ప్రమేయం ఉన్నట్లు విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి నివేదించింది. 

ఈ నివేదిక కోసం విజిలెన్స్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశోధన మొదలుపెట్టినప్పటి నుంచే పలువురు తహశీల్దార్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. జనగామ జిల్లాలో జనగామతో పాటు స్టేషన్ ఘన్ పూర్, నర్మెట, తరిగొప్పుల, భూపాలపల్లి జిల్లాలో భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలోని మహబూబాబాద్, గూడూర్, కేసముద్రం నల్గొండ జిల్లాలోని త్రిపురారం, నిడమనూరు, తిరుమలగిరి, దామరచర్ల, మిర్యాలగూడ, వేములపల్లి, నక్రేకల్, కేతపల్లి వంటి కేంద్రాల్లో రెవిన్యూ అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. అంతేకాదు.. సూర్యాపేట, ఆదిలాబాద్, నాగర్ కర్నూలు, నిజామాబాద్ జిల్లాల నుంచి అనేక మండలాల్లో ఇలాంటి అక్రమాలు జరిగినట్లు, జరుగుతున్నట్టు ఆధారాలతో సహా ప్రభుత్వానికి నివేదిక అందింది. 

కేసీఆర్ ముందుగా ప్రక్షాళించాలనుకున్న విభాగాల్లో ముందువరుసలో ఉన్నది రెవిన్యూ విభాగమే కావడం గమనించాల్సిన అంశం. అయితే అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం తరువాత రెవెన్యూ అధికారుల తీరు మారుతుందని అంతా అనుకున్నారు. కానీ వాళ్ల పద్ధతి ఏమాత్రం మారకపోగా మరింత దిగజారినట్లు ఈ నివేదికలే తేల్చిచెబుతున్నాయి. రెవిన్యూ విభాగాన్ని సమూలంగా ప్రక్షాళించాలనుకున్న సందర్భంలో కూడా రెవిన్యూ అధికారుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడమే గాక ప్రభుత్వం చేతగానితనం కూడా పెద్దఎత్తున ఎక్స్ పోజ్ అయింది. దీంతో కేసీఆర్ ఆచితూచి అడుగులు వేశారు. కానీ ఇప్పుడు కింది స్థాయి ఉద్యోగులతో కుమ్మక్కై తహశీల్దార్లు షాదీముబారక్, కల్యాణలక్ష్మి వంటి చిన్నస్థాయి లబ్ధిదారుల సొమ్ములకే ఎసరు పెడుతున్నట్టు నిగ్గు తేలడంతో ప్రభుత్వం చాలా తీవ్రమైన చర్యలే తీసుకుంటుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరోవైపు హుజూరాబాద్ లో ఉపఎన్నికలో ఎలాగైనా గెలిచి తీరాలన్న కసితో ఉన్న కేసీఆర్ విజిలెన్స్ నివేదికపై ప్రభుత్వాధికారులతో చర్చించి శాఖాపరంగా కఠినమైన నిర్ణయాలే తీసుకుంటారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.