బుడ్డోడి రిప్లయికి ఎస్సై ఫిదా.. దుర్గమ్మ యాత్రకు డీజే కు లైన్ క్లియర్

ఎంత రాజకీయ నాయకులైనా ఆఖరుకు ఎంతోకొంత భయపడేది మాత్రం కచ్చితంగా పోలీసులకే. వంగివంగి సలాములు కొట్టే పోలీసులంటే రాజకీయ నేతలకు చులకన భావం ఉంటే ఉండొొచ్చు. కానీ నాలుగో సింహం గర్జిస్తే మాత్రం ఎవరైనా బెదిరిపోవాల్సిందే. రాజకీయ మిత్రుడైనా, అరాచక శత్రువైనా  సరే.. పోలీసులు పక్కనుంటేనే పార్టీలకు కొండంత అండ. అందుకే కేసీఆర్ అధికారంలోకి రాగానే ముందుగా సంతోషపెట్టింది పోలీసుల్ని మాత్రమే. అలాంటి ఓ పోలీసాఫీసరుకు ఆరేళ్ల పిల్లగాడు ఎదురునిలిచి సవాల్ చేయడం.. ఏమైనా జరిగితే తరువాత చూసుకుందాం అని చెప్పడం.. ముందుగా అమ్మవారి ముందు డీజే కు అనుమతించాలని సూచించడం విస్తుగొలిపే అంశాలు. స్వయానా అక్కడున్న పోలీసాఫీసరు కూడా బుడ్డోడు ఇచ్చిన జవాబులకు, చేసిన సూచనలకు శభాష్ అంటూ భుజం తట్టాడు.. ఆ ఎస్సై.

దసరా నవరాత్రుల సందర్భంగా ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా పరిసరాల్లో పెద్దఎత్తున అమ్మవారి విగ్రహాలు ప్రతిష్టించారు. ఎంతో నిష్టగా నవరాత్రులకు ఏర్పాట్లు  చేసుకున్నారు. సాధారణంగా గణేశ్ నవరాత్రులైనా, దేవీ నవరాత్రులైనా పెద్దల కన్నా ఎక్కువగా పిల్లలే పూర్తి సమయం కేటాయిస్తారు. రకరకాల బాధ్యతలు తీసుకొని కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరిగేలా చూస్తారు. ఒకరకంగా చెప్పాలంటే పెద్దలది పెత్తనం అన్నట్టుగానే ఉంటుంది. కానీ అసలు పనిభారం అంతా కూడా యువకులు, పిల్లలే మోస్తారు. ఈ స్టోరీలో కనిపిస్తున్న ఇమేజ్ ను పరిశీలించినా కూడా పిల్లల చొరవతోనే ఆ కార్యక్రమం పూర్తయినట్టు కనిపిస్తుంది. అయితే నవరాత్రుల సందర్భంగా పోలీసులు నియమాలు కఠినంగా అమలు చేశారు. అటు కోవిడ్ నిబంధనలు కూడా కట్టుదిట్టంగా అమలు చేశారు. అయితే రూల్స్ పేరుతో కాస్త ఎక్స్ ట్రా చేయడం పోలీసులకు కొత్తేమీ కాదు.. గతంలో చాలా సందర్భాల్లో పోలీసుల ఓవరాక్షన్ చూశాం. గతేడాది హైదరాబాద్ లో వర్షాల కారణంగా సిటీ అంతా అతలాకుతలమైపోయింది. ఆ సమయంలో తమ అపార్టుమెంట్లలో కొందరు మహిళలు బతుకమ్మ  ఆడుకోవడానికి సమాయత్తమవుతుండగా ఓ ఎస్సై బతుకమ్మ ఆడరాదంటూ రూల్స్ ను బయటకు లాగాడు. దీంతో అక్కడి మహిళలు పోలీసులతో వాదనకు దిగారు. కచ్చితంగా తాము బతుకమ్మ ఆడి తీరుతామంటూ అక్కడి మహిళలు భీష్మించుక్కూర్చున్నారు. దీంతో పోలీసులు వెనుకడుగు వేయాల్సి వచ్చింది. 

అలాగే కృష్ణా జిల్లాలోని ఓ గ్రామంలో కూడా బతుకమ్మ ఆడేందుకు ఏర్పాట్లు చేసుకోగా... స్థానిక సీఐ వచ్చి అక్కడి నుంచి బతుకమ్మలను లేపేయించాడు. ఇకముందు ఎవరైనా బతుకమ్మలు ఆడినట్లు తెలిసిందో మీకు మామూలుగా ఉండదు అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఇటీవల గణేశ్ నవరాత్రులు కూడా సొంతిళ్లకే పరిమితం చేసుకోవాలని, వీధుల్లో, కూడళ్లలో పెట్టడానికి వీల్లేదని ప్రభుత్వం నిబంధనలు విధించింది. అయితే ప్రజల నుంచి తీవ్రమైన ఒత్తిడి, విమర్శలు రావడంతో కోర్టు జోక్యం చేసుకున్న కారణంగా గణేశ్ నవరాత్రులకు ఆటంకాలు తొలగిపోయాయి. ఇక తాజాగా కూడా నిబంధనల్లో భాగంగా డీజేలు వాడరాదని, నిమజ్జనం నిశ్శబ్దంగా చేసుకోవాలని హైదరాబాద్ లోని అన్ని కమిషనరేట్లు కూడా రూల్స్ ఫ్రేమ్ చేశాయి. రాత్రి 10 దాటితే డీజేలు ఆపాల్సిందే. లేకపోతే న్యూసెన్స్ కింద కేసులు బుక్ చేస్తామని పోలీసులు హెచ్చరించారు. 

ఆ నిబంధనల ప్రకారమే సంబంధిత ఎస్సై కూడా దుర్గా నవరాత్రులు జరుగుతున్న ప్రదేశానికి వచ్చి డీజేలు ఆపాలంటూ నిర్వాహకులను ఒత్తిడి చేశారు. ఏం చెప్పాలో తెలియని పెద్దలంతా సైలెంట్ గా ఉన్న సందర్భంలో ఆరేళ్ల కుర్రాడు మాత్రం ధైర్యంగా ముందుకొచ్చి సముదాయించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. DJ ఎందుకు పెట్టొద్దు సర్. మా దుర్గమ్మవారి ఊరేగింపుకు  DJ ఎందుకు పెట్టొద్దు... అంటూ SIని ప్రశ్నించాడు. ఏమన్నా ఉంటే రేపు చూసుకుందాం.. ఇప్పుడైతే DJ పెడుతాం.. అంటూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ బుడ్డోడు తీసుకున్న చొరవకు ఎస్సై మంత్రముగ్ధుడైపోయాడు. ఆ అబ్బాయి చూపిన ధైర్యానికి ముచ్చటపడ్డాడు. ఎంతో ప్రోత్సాహంగా భజం తట్టాడు. దీంతో డీజేకు అనధికారికంగా గ్రీన్ సిగ్నల్ పడిపోయి అమ్మవారి ఊరేగింపు అంగరంగ వైభవంగా ముందుకు సాగిపోయింది. 

ఏ ఇతర సంప్రదాయాల పండుగలకు గుర్తురాని నిబంధనలు హిందువుల పండుగకే గుర్తుకొస్తాయని, అయినా ఏ హిందూ నాయకుడికి కూడా ప్రశ్నించే సాహసం లేదని, ఈ ఆరేళ్ల బుడ్డోడు మాత్రం ఎందరో పెద్దలకు స్ఫూర్తిప్రదాతగా నిలిచాడని పలువురు హిందూ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.