కరుణా, జయ, శశికళ... ముచ్చటగా మూడో నియంత!
posted on Feb 6, 2017 10:20AM
.jpg)
సోషల్ మీడియాలో ఒక సెటైర్ భలే హుషారుగా చక్కర్లు కొడుతోంది! అదేంటంటే, సిటీ బస్సులో లేడీస్ రిజర్వ్ర్డ్ సీట్ లాంటి తమిళ సీఎం కుర్చీలో కూర్చున్న పన్నీర్ సెల్వం.... శశికళ రాగానే ''కూర్చోండి మేడమ్'' అంటూ పక్కకు తప్పుకున్నారట! ఇంతకు ముందు కూడా ఆయన జయలలిత తప్పుకోగానే కూర్చోటం, మళ్లీ ఆమె రాగానే గౌరవంగా పాదాభివందనం చేసి సీటు ఇచ్చేయటం మనకు తెలిసిందే! అందుకే, ఈ లేడీస్ సీట్ సెటైర్ రన్ అవుతోంది!
తమిళనాడు సీఎం సీటు లేడీస్ కి రిజర్వ్డ్ కాకపోవచ్చుగాని... నెక్స్ట్ చెన్నై క్వీన్ శశికళనే అని ఇప్పటికే రూఢీ అయిపోయింది. పన్నీర్ సెల్వం మరో సారి సెలవు పుచ్చుకుని ముఖ్యమంత్రి నుంచి మామూలు మంత్రి అయిపోయారు. ఇదే పరిస్థితి వేరే రాష్ట్రంలో అయితే పెద్ద రచ్చే అయ్యేది. ఉదాహరణకి బీహార్లో ఆ మధ్య జరిగింది గుర్తుందిగా? నితీష్ కుమార్ తాత్కాలికంగా పీఠం ఎక్కించిన మాంజీ ఏకు మేకయ్యాడు తరువాతి కాలంలో. నానా రభస జరిగింది. కాని, పన్నీర్ సెల్వం అలాంటి పేచీలు ఏమీ పెట్టకుండా అప్పట్లో జయ కోసం, ఇప్పుడు శశికళ కోసం అధికారాన్ని తృణప్రాయంగా వదిలేస్తూ వస్తున్నాడు. అది ఆయన గొప్పతనం అని కూడా చెప్పటానికి లేదు. ఎందుకంటే, ఆయన ముఖ్యమంత్రి కుర్చీని అంటి పెట్టుకుని వుందామన్నా అన్నాడీఎంకేలో ఆయన వెంట గట్టిగా నిలిచే ఎమ్మేల్యేలు దాదాపు లేరనే చెప్పాలి. అప్పుడు జయమ్మ అన్న వారు ఇప్పుడు చిన్నమ్మ అంటున్నారు. రాజకీయ అనుభవం, దక్షత, ప్రజల మద్దతు ఇలాంటివేవీ అన్నాడీఎంకే శాసన సభ్యులు పట్టించుకున్నట్టు లేదు. కేవలం చిన్నమ్మ పట్ల విధేయత మాత్రమే కనిపిస్తోంది. జనం తమకు ఓట్లు వేసేప్పుడు శశికళను చూసి వేశారా... అన్న చిన్న ఆలోచన కూడా వారికి రావటం లేదు!
అసలు తమిళనాడులో గడిచిన కొన్ని దశాబ్దాలుగా కొనసాగిన నియంతృత్వమే ఇవాళ్లీ ఈ పరిస్థితికి కారణం! అన్నాడీఎంకేలో జయలలితది ఉక్కు పిడికిలి. ఆమె తనకు విధేయంగా వున్నంత సేపూ అమ్మలానే వుండేది. కాని, ఎవరైనా సరే తనకు కొంచెం ఎదురుతిరిగినా జేజేమ్మఅయిపోయేది. అందుకే, కరుణానిధి మొదలు వైగో వరకూ అందరు గజగజలాడేవారు. రజినీకాంత్ మొదలు విజయ్ కాంత్, వడివేలు వరకూ అంతా విలవిలలాడేవారు. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా తమిళనాడులో ధైర్యంగా అమ్మకు ఎదురేగి నిలిచిన వారు ఎవ్వరూ లేరు. పార్టీ బయటే ఇలా వుంటే లోపల ఎలా వుంటుంది? మనకి ఒక్క పన్నీర్ సెల్వమ్ మాత్రమే తెలుసు. కాని, ఏఐఏడీఎంకేలో అందరికందరూ పన్నీరు డబ్బాలే! ఎవ్వరూ అప్పుడు జయకి, ఇప్పుడు శశికి ఎదురు తిరిగేవారు కాదు. తమిళ ఓటర్ల కన్నా వారికి పార్టీ అధినేత్రులే ముఖ్యం!
జయలలిత పార్టీనే కాదు కరుణానిధి పార్టీ కూడా తమిళనాడులో కర్కశత్వానికి పెట్టింది పేరు. కరుణ నీడలో ఆ పార్టీలో ఒక్కడంటే ఒక్కడు కూడా బలమైన నేతగా ఎదగలేదు! కరుణానిధి తన కుటుంబ సభ్యుల్ని తప్ప మరెవర్నీ కరుణించలేదు. పోనీ తన పిల్లల్నైనా పాప్యులర్ నేతలుగా మార్చాడా అంటే అదీ లేదు. స్టాలిన్ తో సహా ఆయన వారసులెవరూ సీఎం రేంజ్ అభ్యర్థులు కారు! డీఎంకేలోని మిగతా నేతల మాటైతే మాట్లాడుకోవటమే దండగ! కరుణానిధి బొమ్మ లేకుండా జనంలోకి వాళ్లు వెళితే పట్టించుకునే వాడే వుండనీ పరిస్థితి...
జయ, కరుణానిధి డిక్టేర్‌షిప్‌లు ఇప్పుడు దాదాపు అంతమైనట్టే. అమ్మ లేనేలేదు. తాతగారు మంచంపట్టారు. కనీసం ఇప్పుడైనా తమిళులకి దమ్మున్న నాయకత్వం లభిస్తుందా అంటే అలాంటి సూచనలేం కనిపించటం లేదు. శశికళ సీఎం కుర్చీ ఎక్కేస్తోంది కాని ఆమె మున్ముందు ఎంత వరకూ జనం మద్దతు సంపాదించుకుంటారో డౌటే! ఆమె ఇప్పటి వరకూ జయలలిత చెలికత్తెగా కొనసాగటం తప్ప సాధించింది ఏమీ లేదు. అలాగే, జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ కూడా ప్రజల్లో ఆమోదం సంపాదించటం కష్టమే. ఎందుకంటే, ఆమెకు అమ్మతో రిలేషన్ షిప్ తప్ప ఇంకేం క్వాలిఫికేషన్ లేదు. మీడియా వారి హడావిడి తప్ప దీపాను జనం పట్టించుకుంటారనుకోవటం అత్యాశే! ఇక మిగిలింది రాజకీయాలంటే ఇష్టమో, కష్టమో తేల్చని రజినీకాంత్!
తలైవా తన సినిమాల్లో ఎంతో ధైర్యంగా , ముక్కు సూటిగా మాట్లాడతాడు! కాని, నిజ జీవితంలోకి వచ్చే సరికి పాలిటిక్స్ గురించి ప్రతీసారీ డొంక తిరుగుడే! ఈ మధ్య మరోసారి తనకు పవర్ అంటే ఇష్టమే అంటూ కలకలం రేపాడు. అంతా హాహాకారాలు చేశాక... అబ్బే నేను చెప్పిన ఆధ్యాత్మిక శక్తి అంటూ వివరణ ఇచ్చాడు! అదేదో ముందే చెప్పొచ్చుగా? పొలిటికల్ ఎంట్రీ విషయంలో రజినీది ఎప్పట్నుంచో ఇదే దారి! అనుమానం, అయోమయం తప్ప మరేం వుండదు ఆయన స్ట్రాటజీలో!
పన్నీర్ సెల్వం, స్టాలిన్, దీపా జయకుమార్, రజినీకాంత్... ఇలా ఎన్ని పేర్లు చెప్పుకున్నా తమిళనాడుకు బలమైన సీఎం ఇప్పుడప్పుడే దొరకటం కష్టం. ఇక జనం మద్దతుతో పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ వున్న మాస్ లీడర్ లభించటం ఇంకా కష్టం. కాబట్టే, అందరిలోకి తన ఎమ్మేల్యేలపై కాస్త పట్టున్న చిన్నమ్మ వేగంగా ముందుకు దూసుకువస్తోంది. ఆమె జయ, కరుణానిధి లాగా పాతుకుపోతే... మరో నియంతృత్వానికి బీజాలు పడ్డట్టే!