హనుమను పట్టుకోవాలని చూసిన సముద్ర రాక్షసి.... సైంటిస్టులకి దొరికిందా?
posted on Feb 6, 2017 1:57PM
.jpg)
హనుమంతుడు సీతమ్మను అన్వేషిస్తూ లంకకు వెళ్లిన సంగతి మనకు తెలిసిందే! కాని, అలా వెళ్లేప్పుడు సింహిణి అనే ఒక రాక్షసని చంపాడని మీకు తెలుసా? సముద్రం మీద ఆంజనేయుడు ప్రయాణిస్తుంటే సింహిణి ఆయన నీడను పట్టుకుని లాగిందట. ముందుకు పోవటం ఇబ్బంది అయిన మారుతి కారణం గమనించి సింహిణి అంతు చూశాడు. తరువాత లంకకు దూసుకుపోయాడు. కాని, అసలు నీడను పట్టుకుని లాగిన ఆ రాక్షసి ఎవరై వుంటారు? తాజాగా బయటపడ్డ ఒక ఆశ్చర్యకర విషయం వింటే మనకు రామాయణంలోని సింహిణిపై కొంత క్లారిటి వచ్చే అవకాశం వుంది!
హనుమంతుడు సీతాన్వేషణ కోసం ప్రయాణించిన హిందూ మహాసముద్రంలోనే వుంది మారిషస్ దేశం. అయితే ఈ దీవుల సమూహం కొన్నాళ్ల కిందట కొందరు శాస్త్రవేత్తల్ని తీవ్రంగా ఆకర్షించింది! కారణం... ఇక్కడ మామూలుగా వుండాల్సిన గురుత్వాకర్షణ కంటే ఎక్కువ శక్తి వుండటమే! అంతే కాదు, మారిషస్ లో సైంటిస్టులకి జిర్కాన్ క్రిస్టల్స్ అనేవి కూడా దొరికాయి. ఆ పదార్థం అక్కడ ఏ విధంగానూ దొరకాల్సింది కాదు. మరి జిర్కాన్ క్రిస్టల్స్ మారిషస్ తీరానికి ఎలా వచ్చాయి? ఈ ప్రశ్నలతో మొదలైన అన్వేషణ, అధ్యయనం చివరకు ఆశ్చర్యకర సత్యాల వెల్లడికి దారి తీసింది!
మారిషస్ లో సాధారణం కంటే ఎక్కువ గురుత్వాకర్షణ శక్తి వుండటానికి కారణం ఆ ద్వీపాల కింద మరో ఖండం వుండటమే అంటున్నారు నిపుణులు! ఆ ఖండం కింద వుండటం వల్లే జిర్కాన్ అనే పదార్థం క్రిస్టల్స్ గా మారి పైకి వచ్చిందంటున్నారు. భూమి లోపల జరిగే తీవ్రమైన వోల్కనిక్ చర్యల వల్ల ఇలా పైకి తన్నుకొస్తుందని చెబుతున్నారు. మారిషస్ కింద భాగంలో వుందంటోన్న ఈ ఖండానికి మారిషియా అనే పేరు కూడా పెట్టారు!
ఇప్పుడు మనం చూస్తోన్న ఏడు ఖండాల భూమండలం ఎప్పుడూ ఇలాగే వుండేది కాదని శాస్త్రవేత్తలు ఎప్పుడో చెప్పారు. గతంలో ఒక సూపర్ కాంటినెంట్ వుండేదని వారు అంటున్నారు. అది తరువాతి కాలంలో ఒత్తిడికి లోనై ముక్కలైందని భావిస్తున్నారు. అదే క్రమంలో ఈ మారిషియా ఖండం నీళ్లలో మునిగిపోయి వుండవచ్చు. బహుశా హనుమంతుడు సముద్ర లంఘణం చేస్తోంటే అతడ్ని బలంగా ఆకర్షించింది ఈ రహస్య ఖండం తాలూకూ శక్తే అయ్యి వుండవచ్చు! దాన్నే అప్పటి వారికి అర్థమయ్యేలా సింహిణి అనే రాక్షసగా వాల్మీకి వర్ణించి వుంటారు!