షర్మిలపై జగ్గారెడ్డి కౌంటర్లు.. ఏపీలో జగన్ కు ముచ్చెమటలు!
posted on Sep 27, 2022 11:11PM
గదిలో స్విచ్ వేస్తే వరండాలో లైట్ వెలుగుతుంది. ఆ రెండింటికీ ఉన్న కనెక్షన్ అలాంటిది మరి. అలాగే తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిలను విమర్శిస్తే.. ఆ విమర్శలు నేరుగా జగన్ కు తగులుతున్నాయి. జగన్, షర్మిలల మధ్య ఉన్నది అన్నా చెళ్లెళ్ల బంధం మరి. జగన్ కు సీఎం పదవి ఇవ్వాలని నేనూ సంతకం చేశానంటూ జగ్గారెడ్డి చెప్పిన మాటలు ఇప్పుడు ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నేరుగా జగన్ పేరు ప్రస్తావించకపోయినా ఆయన కోరిక మేరకే సంతకాల సేకరణ జరిగిందని జగ్గారెడ్డి చెప్పకనే చెప్పారు. అందుకు తానే ప్రత్యక్ష సాక్షిననీ అన్నారు. దాంతో గతంలో సంతకాల సేకరణ వాస్తవమే కానీ, ఆ విషయం జగన్ కు తెలియదంటూ అప్పట్లో జగన్ సన్నిహితులు ఇచ్చిన వివరణలన్నీ అవాస్తవమని జగ్గారెడ్డి మాటలతో తేలిపోవడంతో ఇప్పుడు ఏపీలో జగన్ ఒకింత ఇబ్బందికర పరిస్థితుల్లో పడ్డారనే చెప్పాలి. వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల కాంగ్రెస్ నాయకుడు ఎమ్మెల్యే జగ్గారెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఆయన ఏ పార్టీలో ఉన్నారో కనీసం ఆయనకూ క్లారటీ ఉందా అన్న అనుమానం వ్యక్తం చేశారు. అక్కడితో ఆగకుండా జగ్గారెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ కోవర్ట్ అని ఆరోపణలు గుప్పించారు. మామూలుగానే జగ్గారెడ్డి ఫైర్ బ్రాండ్. ఆయన విమర్శలు చాలా ఘాటుగా ఉంటాయి. అటువంటి జగ్గారెడ్డికి షర్మిల తనను కేటీఆర్ కోవర్ట్ అంటూ విమర్శించడంతో ఆయనకు ఎక్కడ కాలాలో అక్కడ కాలింది. దాంతో జగ్గారెడ్డి ఘాటుగా స్పందించారు.
తెలంగాణలో షర్మిల రాజకీయ శక్తి కానే కాదని చెప్పారు. అక్కడితో ఆగకుండా ఆయన చేసిన వ్యాఖ్యలు షర్మిల కంటే.. ఆమె సోదరుడు, ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు గట్టిగా తగిలాయి. జగ్గారెడ్డి వైఎస్ మరణించన నాటి సంగతులను ప్రస్తావించారు. వైఎస్ మరణించినప్పుడు ఆయన కుటుంబ సభ్యులు, భార్యా పిల్లలూ తదుపరి ముఖ్యమంత్రి విషయంపైనే దృష్టి పెట్టారనీ, కుటుంబ పెద్ద మరణించిన బాధ వారిలో ఇసుమంతైనా కనిపించలేదనీ చెప్పారు. అందుకు తానే ప్రత్యక్ష సాక్షినని కూడా చెప్పారు. వైఎస్ మరణించిన సందర్భంగా వారిని పరామర్శించడానికి వెళ్లి తాము ఏడ్చామే తప్ప ఆయన కుమారుడూ, కుమార్తెలలో బాధ అన్నది ఇసుమంతైనా కనిపించలేదన్నారు. వైఎస్ మరణించిన సమయంలో జగన్ ముఖ్యమంత్రి కావాలంటూ సంతకాలు పెట్టించిన వారిలో తానూ ఉన్నాననీ, సంతకాలు సేకరించమని తమకు ఆదేశాలు వచ్చాయనీ అన్యాపదేశంగా జగన్ ను ఉద్దేశించి ఆయన చెప్పారు. ఇప్పుడు జగ్గారెడ్డి వ్యాఖ్యలే సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి. షర్మిల విమర్శలకు ఆయన ఇచ్చిన కౌంటర్ తెలంగాణలో కంటే ఏపీలోనే ఎక్కువగా ప్రకంపనలు సృష్టిస్తోంది. వైఎస్ దుర్మరణం పాలైన విషాద సమయంలో, ఇంకా అంత్యక్రియలు కూడా జరగకుండానే సీఎం పదవి కోసం జగన్ సంతకాల సేకరణలో నిమగ్నమయ్యారన్న విమర్శలు అప్పట్లో వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు జగ్గారెడ్డి వ్యాఖ్యలతో నాడు జగన్ పై సీఎం పదవి కోసం సంతకాలు సేకరించిన మాట వాస్తవమేనని తేలిపోయిందంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. జగ్గారెడ్డి మాటలు వాస్తవమేనని చెప్పేందుకు గతంలో వైఎస్ మరణం నాటి సంఘటనలను వివరిస్తూ నటుడు చిరంజీవి చేసిన ప్రసంగం తాలూకు వీడియో క్లిప్పింగ్ ఒకటి సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది. ఆ ప్రసంగంలో చిరంజీవి వైఎస్ అంత్యక్రియలు జరగకుండానే జగన్ సీఎం కావాలంటూ కొందరు సంతకాల కార్యక్రమం చేపట్టారనీ, అప్పట్లో కాంగ్రెస్ లో ఉన్న తనను కూడా సంతకం పెట్టాల్సిందిగా కోరారనీ వెల్లడించారు.
అప్పుడు తాను వారికి అది సబబు కాదనీ, విషాద సమయంలో రాజకీయం కోసం, పదవుల కోసం వెంపర్లాడటం తగదనీ చెప్పానని పేర్కొన్నారు. ఈ విషయాలన్నీ ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ అవ్వడంతో జగ్గారెడ్డి, షర్మిలల మధ్య విమర్శల యుద్ధంలో జగన్ కు గాయాలు తప్పడం లేదని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.